మనకన్ని ప్రభుత్వ బ్యాంకులు అవసరం లేదు: ఎస్‌బీఐ మాజీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

Sbi Former Chief Arundhati Bhattacharya Says Need Few Strong Public Sector Banks - Sakshi

చిన్న వాటిని విలీనం లేదా ప్రైవేటీకరించవచ్చు 

ఎస్‌బీఐ మాజీ చీఫ్‌ అరుంధతి భట్టాచార్య

న్యూఢిల్లీ: దేశీయంగా పటిష్టమైన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) కొన్ని ఉన్నా సరిపోతుందని ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ మాజీ చైర్‌పర్సన్‌ అరుంధతి భట్టాచార్య అభిప్రాయపడ్డారు. చిన్నా చితకా పీఎస్‌బీలను విలీనమో లేదా ప్రైవేటీకరించడమో చేయొచ్చని తెలిపారు. అయితే, అలాగని వాటి సమస్యలకు ప్రైవేటీకరణ ఒక్కటే మందు కాదని కూడా ఆమె పేర్కొన్నారు. ప్రైవేటీకరణ ద్వారా ఏ లక్ష్యాలను ఆశిస్తున్నారో వాటిని సాధించగలిగేలా పీఎస్‌బీలకు సాధికారత ఇవ్వాలని, సమాన స్థాయిలో అవకాశాలు కల్పించాలని భట్టాచార్య చెప్పారు.

అన్ని పీఎస్‌బీల ప్రైవేటీకరణకు ప్రభుత్వం 10 ఏళ్ల మార్గదర్శ ప్రణాళిక రూపొందించుకోవాలంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు ఇటీవల సూచించిన నేపథ్యంలో భట్టాచార్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఇన్ని పీఎస్‌బీల అవసరం ఉందని నేను కూడా అనుకోను. వాటి సంఖ్యను తగ్గించుకోవచ్చు. కొన్నింటిని ప్రైవేటీకరించవచ్చు. పటిష్టమైన వాటిని అలాగే కొనసాగించవచ్చు. కానీ అన్ని సమస్యలకూ ప్రైవేటీకరణ ఒక్కటే మాత్రం పరిష్కారమార్గం కాబోదు‘ అని ప్రస్తుతం సేల్స్‌ఫోర్స్‌ ఇండియా సంస్థ చైర్‌పర్సన్‌గా ఉన్న భట్టాచార్య చెప్పారు. 2020లో 10 పీఎస్‌బీలను విలీనం చేయడంతో నాలుగు పెద్ద బ్యాంకులు ఏర్పడ్డాయి. దీనితో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కి తగ్గింది.  

డిజిటల్‌ బ్యాంకులు అనివార్యం.. 
మరోవైపు, కొత్తగా వస్తున్న డిజిటల్‌ బ్యాంకులపై స్పందిస్తూ కస్టమర్లు కోరుకుంటున్న పక్షంలో వాటిని ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదని ఆమె అభిప్రాయపడ్డారు. డిజిటల్‌ బ్యాంకులతో రిస్కులు ఉన్నప్పటికీ .. మార్పు అనివార్యమని, వాటిని కొన్నాళ్ల పాటు ఆపగలిగినా పూర్తిగా ఆపలేమని చెప్పారు. ఈ తరహా బ్యాంకు లైసెన్సు కోసం 2010లోనే తాను ఆర్‌బీఐని సంప్రదించానని, కానీ అలాంటి ప్రతిపాదనేదీ లేదంటూ అప్పట్లో రిజర్వ్‌ బ్యాంక్‌ చెప్పిందని గుర్తు చేసుకున్నారు. ఆర్‌బీఐ ప్రతిపాదిత డిజిటల్‌ కరెన్సీ గురించి మాట్లాడుతూ ఇది చాలా కీలకమైన ముందడుగు కాగలదని భట్టాచార్య చెప్పారు. వినియోగించే వారిలో భరోసా కలిగించగలిగేలా సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) ఉండగలదని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

చదవండి: ఒకటికి మించి బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top