చమురు సరఫరాలో రష్యా టాప్‌ | Russia Becomes India Top Oil Supplier In October | Sakshi
Sakshi News home page

చమురు సరఫరాలో రష్యా టాప్‌

Nov 7 2022 4:43 AM | Updated on Nov 7 2022 4:43 AM

Russia Becomes India Top Oil Supplier In October - Sakshi

న్యూఢిల్లీ: గత నెల(అక్టోబర్‌)లో భారత్‌కు అత్యధిక స్థాయిలో ముడిచమురును సరఫరా చేసిన దేశంగా రష్యా నిలిచింది. తద్వారా కొన్నేళ్లుగా గరిష్ట స్థాయిలో ముడిచమురు సరఫరా చేస్తున్న సౌదీ అరేబియా, ఇరాక్‌లను వెనక్కు నెట్టింది. ఇంధన కార్గో పరిశీలక సంస్థ వోర్టెక్సా అందించిన వివరాల ప్రకారం అక్టోబర్‌లో రష్యా చరిత్రలోనే అత్యధికంగా 9,33,556 బ్యారళ్ల చమురును ఇండియాకు రవాణా చేసింది. మార్చితో ముగిసిన గతేడాది(2021–22)లో దేశీ చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 0.2 శాతం మాత్రమేకాగా..  తాజాగా ఈ వాటాను 22 శాతానికి పెంచుకోవడం గమనార్హం!

దీంతో మొత్తం దేశీ చమురు దిగుమతుల్లో ఇరాక్‌ వాటా 20.5 శాతానికి, సౌదీ అరేబియా వాటా 16 శాతానికి పరిమితమయ్యాయి. రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన విషయం విదితమే. దీంతో డిస్కౌంట్‌ ధరలో చమురు సరఫరాలకు రష్యా సిద్ధపడింది. ఇది భారత్‌కు రష్యా నుంచి చమురు సరఫరాలు పెరిగేందుకు కారణమైంది. అయితే భారత్‌ గతంలో అంటే 2021 డిసెంబర్‌లో రష్యా నుంచి రోజుకి 36,255 బ్యారళ్లను దిగుమతి చేసుకోగా.. ఇరాక్‌ నుంచి 1.05 మిలియన్‌ బ్యారళ్లు, సౌదీ అరేబియా నుంచి 9,52,665 బ్యారళ్లు అందుకుంది. ఆపై రష్యా నుంచి నెమ్మదిగా దిగుమతులు పెరుగుతూ వచ్చాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement