వినియోగంలో లేని బ్యాంక్‌ అకౌంట్లు, మగ్గుతున్న రూ.26,697 కోట్లు

Rs 26,697 Crore Lying In Inactive Bank Accounts Says Nirmala Seetharaman - Sakshi

సహకార బ్యాంకులు సహా బ్యాంకింగ్‌ వ్యవస్థలో వినియోగంలో లేని ఖాతాల్లో ఉన్న మొత్తం రూ.26,697 కోట్లని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రాజ్యసభలో ఈ మేరకు అడిగిన ఒక ప్రశ్నకు సీతారామన్‌ సమాధానం చెబుతూ, 2020 డిసెంబర్‌ 31వ తేదీ నాటికి దాదాపు తొమ్మిది కోట్ల అకౌంట్లలో ఈ భారీ మొత్తాలు ఉన్నట్లు వివరించారు. 

ఈ అకౌంట్లు దాదాపు పదేళ్ల నుంచీ నిర్వహణలో లేవని తెలిపారు. ఆమె తెలిపిన సమాచారం ప్రకారం, షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకుల్లో 8,13,34,849 అకౌంట్లలో రూ.24,356 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. అర్బన్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంకుల్లో (యూసీబీ)ల్లోని 77,03,819 అకౌంట్లలో రూ.2,341 కోట్ల డబ్బు ఉంది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లోని 64 అకౌంట్లలో ఉన్న సొమ్ము రూ.0.71 కోట్లు. కాగా ఈ అకౌంట్లకు సంబంధించి ఖాతాదారులు లేదా వారసులను వెతికి పట్టుకోడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడానికి బ్యాంకులకు తగిన సూచనలు ఇవ్వడం జరిగిందని ఆర్థికమంత్రి తెలిపారు.

నిర్వహణ లేకుండా రెండేళ్లు పైబడితేనే ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందని తెలిపారు. ఇలాంటి జాబితాను బ్యాంకుల నోటీస్‌ బోర్డ్‌ల్లో ఉంచాలని కూడా బ్యాంకులకు నిర్దేశించడం జరిగిందన్నారు. అలాగే వినియోగంలో లేని ఖాతాల్లో డబ్బును డిపాజిటర్ల విద్య, అవగాహనా ఫండ్‌ స్కీమ్, 2014కు బదలాయించి నిధిని సద్వినియోగ పరిచే చర్యలూ అమల్లో ఉన్నట్లు తెలిపారు. ఆర్‌బీఐ మాస్టర్‌ సర్క్యులర్‌ ప్రకారం, ప్రతి హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ బోర్డు (హెచ్‌ఎఫ్‌సి) తన నిధుల వ్యయం, మార్జిన్, రిస్క్‌ ప్రీమియం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వడ్డీ రేటు నమూనాను అవలంబించవచ్చని మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు.

చదవండి: దూసుకెళ్తున్న జీఎస్‌టీ వసూళ్లు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top