
చెన్నైలో నిర్వహించిన రాయల్ ఎన్‌ఫీల్డ్
ఆకట్టుకున్న హంటర్ 350 గ్రాఫైట్ గ్రే వేరియంట్
కుర్రకారు కేరింతలతో డీజే, లోకల్ ర్యాప్ స్టార్స్ సందడి
స్కేట్‌బోర్డింగ్, స్ట్రీట్ ఆర్టిస్ట్‌ల హల్‌చల్
డుగ్గు డుగ్గు బండిపై ‘బుల్లెట్’లా దూసుకెళ్తున్న కుర్రకారు స్ట్రీట్ కల్చర్‌లోనూ దుమ్మురేపుతున్నారు. అందుకే, బుల్లెట్ బండి అంటే ఠక్కున గుర్తొచ్చే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు ఈ లోకల్ ఆర్టిస్టులకు దన్నుగా నిలుస్తోంది. అర్బన్ రైడర్ల కోసం ప్రత్యేకంగా మలిచిన ‘హంటర్ 350’ బైక్ స్ఫూర్తితో ‘హంటర్‌హుడ్’ వేడుకలకు తెరతీసింది. దక్షిణాదిన ఈ తొలి ఫెస్టివల్‌ను తాజాగా చెన్నైలో నిర్వహించింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ డీజే బెంకీ బేకు... క్రేజీ రీమిక్స్‌లతో ఈవెంట్‌ను ఆరంభించారు.
స్ట్రీట్ ఆర్టిస్ట్‌లు వేసిన బైకింగ్ పెయింటింగ్‌లు అబ్బురపరిచాయి. మరోపక్క, స్కేట్‌బోర్డింగ్ మ్యూజిక్ కలగలిపి సాగిన ఈవెంట్ మరో హైలైట్. స్థానిక తీన్మార్ డప్పుల దరువుకు సింగర్లు పాడిన లోకల్ పాటలు వేరే లెవెల్. లోకల్ హిప్‌హాప్ సింగర్స్ ఇక్కీ బెర్రీ, అసల్ కోలార్, ఆరీవు తదితరుల తమిళం, ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్స్‌తో ఇక్కడి ఐలాండ్ గ్రౌండ్ మొత్తం దద్దరిల్లింది. ఇక డ్యాన్సర్లు కూడా బీట్‌కు అనుగుణంగా క్రేజీ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. విభిన్న ఆర్టిస్టులు ఈవెంట్ ఆసాంతం స్ట్రీట్ కల్చర్ వైబ్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
ఏప్రిల్‌లో తొలిసారి...
ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలిసారిగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ‘హంటర్‌హుడ్’ ఫెస్టివల్‌ను ఒకేసారి ఢిల్లీ, ముంబై నగరాల్లో నిర్వహించింది. ఈ సందర్బంగా ‘హంటర్ 350’ 2025 ఎడిషన్‌ను రియో వైట్, టోక్యో బ్లాక్, లండన్ రెడ్ తదితర రంగుల వేరియంట్లలో ఆవిష్కరించింది. ఆధునిక రెట్రో లైఫ్‌స్టయిల్ కోరుకునే నవతరం యువతను ఆకట్టుకునేలా స్టయిల్, వినోదం, దూకుడును కలగలిపి హంటర్ 350 బైక్‌ను మలిచామని రాయల్డ్ ఎన్‌ఫీల్డ్ చెబుతోంది. మరోపక్క, హిప్‌హాప్, ర్యాప్, స్ట్రీట్ డ్యాన్స్, స్కేట్‌బోర్డింగ్‌లలో లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ... స్ట్రీట్ కల్చర్‌కు దన్నుగా నిలవడమే ‘హంటర్‌హుడ్’ ఫెస్టివల్ ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. క్రమంగా మరిన్ని నగరాల్లోనూ ఈ వేడుకలను నిర్వహించే ప్రణాళికల్లో కంపెనీ ఉంది.
గ్రాఫైట్ గ్రే.. సూపర్బ్
హంటర్ 350లో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రాఫైట్ గ్రే వేరియంట్‌ను చెన్నై హంటర్‌హుడ్ ఫెస్టివల్‌లో ఎన్‌ఫీల్డ్ ప్రత్యేకంగా ప్రదర్శించింది. ఇప్పటికే యూత్‌కు బాగా కనెక్ట్ అవుతున్న హంటర్ బైక్.. ఈ సరికొత్త షేడ్‌తో మరింత ఆకట్టుకుంటోంది. బైకింగ్ యాక్సెసరీలు, లైఫ్‌స్టయిల్ గేర్‌తో పాటు ట్రెండింగ్‌లో ఉన్న స్ట్రీట్ వేర్ ఉత్పత్తులను కూడా ఈ సందర్భంగా వివిధ బ్రాండ్‌లు తమ స్టాల్స్‌లో ప్రదర్శించాయి. కాగా, 350సీసీ లోపు బైక్‌లపై జీఎస్‌టీ రేటును ఇప్పుడున్న 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన నేపథ్యంలో (ఈ నెల 22 నుంచి అమలు) ఎన్‌ఫీల్డ్ హంటర్‌పై గరిష్టంగా రూ.22,000 తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే.
శివరామకృష్ణ మిర్తిపాటి
(చెన్నై నుంచి సాక్షి బిజినెస్ ప్రతినిధి)