కొత్త టెక్నాలజీతో మారుతున్న ప్రాధాన్యతలు
టాగ్డ్ సీఈవో దేవాశిష్ శర్మ
న్యూఢిల్లీ: టెక్నాలజీ పరంగా వేగవంతమైన పరివర్తన నేపథ్యంలో రాణించేందుకు కావాల్సిన నైపుణ్యాలు, పోటీతత్వంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నట్టు టాగ్డ్ సీఈవో దేవాశిష్ శర్మ తెలిపారు. సంప్రదాయ డిగ్రీలకు బదులు సంభాషణ నైపుణ్యాలు, క్రిటికల్ థింకింగ్ వంటి సాఫ్ట్ స్కిల్స్‌కు ప్రాధాన్యం పెరుగుతున్నట్టు చెప్పారు. మారుతున్న వాతావరణం నేపథ్యంలో యాజమాన్యాలు ప్రత్యక్ష నైపుణ్యాలు, అప్పగించిన పనిని వేగంగా చేయగలిగే సామర్థ్యాలను అభ్యర్థుల్లో చూస్తున్నట్టు తెలిపారు.
సంభాషణ, క్రిటికల్ థింకింగ్, సమస్యల పరిష్కారం, సృజనాత్మకత, ఉద్యోగం చేయడానికి సన్నద్ధతపై ఉద్యోగార్థులు దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. డేటా ఆధారిత సామర్థ్యాల గుర్తింపు, ఇంటర్న్‌షిప్‌లు, చేపట్టిన ప్రాజెక్టుల ఆధారంగా వారి సన్నద్ధతను యాజమాన్యాలు పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యా సంస్థలతో కలసి కరిక్యులమ్ రూపొందించడం, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై యాజమాన్యాలు దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు.
ముఖ్యంగా నైపుణ్యాల కొరత నేపథ్యంలో విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య సహకారం, సమన్వయంతో గ్రాడ్యుయేట్లు పని ప్రదేశాల్లో రాణించేందుకు కావాల్సిన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం సాధ్యపడుతుందన్నారు. ఐఐటీ ఢిల్లీలో ఐఎన్‌ఏఈ–ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటు.. పరిశోధన, ఆవిష్కరణలపై ఐఐటీ హైదరాబాద్–రెనెసెస్ మధ్య భాగస్వామ్యాలను శర్మ ప్రస్తావించారు. ప్రభుత్వం సైతం ఉద్యోగ అర్హతలను మెరుగుపరచడంపై దృష్టి సారించిందని.. నేషనల్ అప్రెంటిస్íÙప్ ప్రమోషన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టిందని చెప్పారు. దీని కింద 2023–24లో 9.3 లక్షల అభ్యర్థులను చేరుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి 46 లక్షల మంది అప్రెంటిస్íÙప్‌ల లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పారు.


