breaking news
Critical Thinking
-
కొలువుల ‘భాగ్య’నగరం
సాక్షి, హైదరాబాద్: సర్వమతాల సమాహారంగా.. కాస్మోపాలిటన్ సిటీగా... మినీ ఇండియాగా పేరుగాంచిన భాగ్యనగరం మరో గుర్తింపును సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్నత చదువులు చదివిన యువతలో అత్యధికం ఉద్యోగంలో స్థిరపడేందుకు హైదరాబాద్‌నే ఎంపిక చేసుకుంటున్నట్లు వెల్లడైంది. దేశంలోకెల్లా ఉద్యోగార్థులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే నగరాల జాబితాలో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచిందని వీబాక్స్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), టాగ్డ్ సంస్థ సంయుక్తంగా రూపొందించిన ‘ఇండియా స్కిల్స్ రిపోర్ట్–2021’వెల్లడించింది. అలాగే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న నగరాల్లోనూ హైదరాబాదే ముందంజలో ఉన్నట్లు ఈ సర్వే పేర్కొంది. హైదరాబాద్ తర్వాత బెంగళూరు, పుణే, ఢిల్లీ ఉద్యోగానికి అనువైన నగరాలుగా, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న సిటీలుగా నిలి చాయి. కరోనా వ్యాప్తి తర్వాత దేశవ్యాప్తంగా పరిశ్రమల అవసరాలు, ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల్లో అందుకు అవసరమైన సామర్థ్యాలు, వాటిపై కరోనా ప్రభావం వంటి అంశాలపై వీబాక్స్ నేషనల్ ఎంప్లాయిబిలిటీ టెస్ట్‌ను (డబ్ల్యూఎన్ఈటీ) నిర్వహించింది. దేశవ్యాప్తంగా 65 వేల మంది విద్యార్థులతోపాటు 15 పరిశ్రమలను, 150కిపైగా కార్పొరేట్ సంస్థలను సంప్రదించింది. పలు అంశాలపై అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది. క్రిటికల్ థింకింగ్‌లో నాలుగో స్థానంలో తెలంగాణ క్రిటికల్ థింకింగ్‌లో తెలంగాణ విద్యార్థులు టాప్–10 జాబి తాలో 4వ స్థానంలో నిలిచారు. ఆంగ్లభాషా నైపుణ్యంలో రాష్ట్ర విద్యార్థులు ఐదో స్థానంలో ఉన్నారు. న్యూమరికల్ స్కిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఐదో స్థానంలో ఉండగా తెలంగాణ విద్యార్థులు 8వ స్థానంలో ఉన్నారు. కంప్యూటర్ స్కిల్స్‌లో తెలంగాణ విద్యార్థులు 9వ స్థానంలో ఉన్నారు. వృత్తి, సాంకేతిక విద్యా సంబంధ ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ పరంగా చూస్తే ఇంగ్లిష్ భాషా నైపుణ్యం, క్రిటికల్ థింకింగ్, కంప్యూటర్ స్కిల్స్‌లో రాజస్తాన్ విద్యార్థులు ముందంజలో ఉన్నారు. టాప్–10 రాష్ట్రాలవారీగా చూస్తే అక్కడి విద్యార్థులే తొలి స్థానంలో నిలిచారు. అలాగే ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం, న్యూమరికల్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్‌లో మధ్యప్రదేశ్ విద్యార్థులు రెండో స్థానంలో నిలిచారు. కంప్యూటర్ స్కిల్స్‌లో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో నిలిచింది. అక్షరాస్యతలో ముందున్నా కేరళకు లభించని చోటు... కేరళ అక్షరాస్యతలో ముందు వరుసలో ఉన్నా ఉద్యోగార్థులున్న టాప్–10 రాష్ట్రాల్లో ఆ రాష్ట్రం నిలువలేకపోతోంది. అయితే ఆంగ్ల భాష, న్యూమరికల్ స్కిల్స్‌లో మాత్రం టాప్–10లో నిలిచింది. మాతృ భాష కాకుండా రెండో భాషగా ఇంగ్లిష్, స్కిల్స్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్తాన్ తొలి స్థానం సంపాదించింది. అక్కడ కార్పొరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లేకపోవడమే ఇందుకు కారణం. అయితే హైదరాబాద్, బెంగళూరు, పుణే, ఢిల్లీ ఉద్యోగానికి అనువైన పట్టణాలుగా, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న పట్టణాలుగా నిలిచాయి. -
3 స్కిల్స్ ఉంటే..కార్పొరేట్ కొలువు ఖాయం!
గెస్ట్ కాలమ్ కార్పొరేట్ కంపెనీలు కొత్త నియామకాల సమయంలో ప్రధానంగా మూడు అంశాల్లో నైపుణ్యాలపై దృష్టి సారిస్తున్నాయి. అవి.. సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేనాటికి ఈ మూడు స్కిల్స్ పెంచుకునేందుకు కృషి చేస్తే జాబ్ మార్కెట్ పోటీలో ముందంజలో నిలిచి కార్పొరేట్ కొలువు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ప్రముఖ కార్పొరేట్ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నెలకొల్పిన శివనాడార్ యూనివర్సిటీ వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నిఖిల్ సిన్హా. ఆయన ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజ్‌లో ఇంగ్లిష్‌లో బీఏ ఆనర్స్.. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సెల్వేనియాలో కమ్యూనికేషన్స్ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేశారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు అకడమిక్, కార్పొరేట్ రంగంలో విశేష అనుభవం గడించిన ప్రొఫెసర్ నిఖిల్ సిన్హాతో ఇంటర్వ్యూ.. ఆధునిక విధానాలు.. సరళమైన కరిక్యులం విద్యార్థులు అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా దీటుగా రాణించాలంటే ఇన్స్టిట్యూట్ల స్థాయి నుంచే మార్పులు మొదలవ్వాలి. బోధన పద్ధతుల్లో ఆధునిక సాంకేతిక విధానాలను అమలు చేయాలి. అదేవిధంగా కరిక్యులంలోనూ మార్పులు తేవాలి. కరిక్యులం సరళంగా, సృజనాత్మక నైపుణ్యాలను వెలికితేసేలా ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలను అందించే విధంగా ఆధునిక కరిక్యులంను రూపొందించాలి. ముఖ్యంగా వృత్తివిద్యా కోర్సుల్లో నేటి పరిస్థితుల్లో ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ సిస్టమ్ ఎంతో అవసరం. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్‌లో నాణ్యత దిశగా విస్తృత దృక్పథంతో ఆలోచించి, అంతర్జాతీయ అవసరాలకు సరితూగేలా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి. యూనివర్సిటీల స్థాయిలోనూ మార్పులు అవసరం యూనివర్సిటీల స్థాయిలో అందించే సంప్రదాయ బ్యాచిలర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లోనూ మార్పులు రావాలి. ఒక డిగ్రీ కోర్సులో ఒకే సబ్జెక్ట్‌ను మేజర్‌గా ఎంచుకునే విధానం ప్రస్తుత పరిస్థితుల్లో సరికాదు. మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ దృక్పథంతో కోర్సులను రూపొందించాలి. ప్రతి కోర్సులోనూ ‘గ్రూప్ సబ్జెక్ట్స్’ అనే విధానాన్ని అనుసరిస్తూనే ఇతర సబ్జెక్ట్లతో ఇంటిగ్రేట్ చేయడం ఎంతో అవసరం. నేటి విద్యా వ్యవస్థలో ప్రధాన లోపం.. ప్రస్తుతం అమలవుతున్న బోధన పద్ధతులు. 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టినప్పటికీ ఇంకా 20వ శతాబ్దపు బోధన విధానాలే అమలవుతున్నాయి. దీనివల్ల విద్యార్థులకు అంతర్జాతీయ నైపుణ్యాలు లభించట్లేదు. కొత్త సవాళ్లను స్వీకరించేలా విద్యార్థులు రూపొందలేకపోతున్నారు. ప్రయోగాత్మక అభ్యసనానికి పెద్దపీట విద్యార్థులు ప్రయోగాత్మక అభ్యసనానికి (ఎక్స్పరిమెంటల్ లెర్నింగ్)కు పెద్దపీట వేయాలి. ఈ క్రమంలో ఇంటర్న్షిప్స్, సర్వీస్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ వంటి క్షేత్రస్థాయి నైపుణ్యాలు అందించే వాటిలో పాల్పంచుకోవడం ద్వారా అకడమిక్ స్థాయిలోనే ప్రాక్టికల్ నైపుణ్యాలు అలవర్చుకోవాలి. ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీలు కూడా ఈ విషయంలో తమ వంతు కృషి చేయాలి. చొరవ తీసుకోవాలి. క్లాస్ రూం, లేబొరేటరీల్లో శిక్షణతోపాటు పరిశోధన కార్యకలాపాల్లో పాల్పంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. మౌలిక సదుపాయాలే.. మొదటి సాధనాలు విద్యార్థులు పోటీ ప్రపంచంలో ముందుండాలంటే అకడమిక్ స్థాయిలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి మెరుగ్గా ఉంటే విద్యార్థులకు మరిన్ని అభ్యసన సాధనాలు అందుబాటులోకి వస్తాయి. వీటివల్ల చక్కటి ఫలితాలు ఆవిష్కృతమవుతాయి. తద్వారా సదరు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్కు కూడా గుర్తింపు లభిస్తుంది. అదే విధంగా ఒక విద్యా సంస్థ లక్ష్యాలు నెరవేరడానికి భౌతిక, సాంకేతిక మౌలిక సదుపాయాలు ఎంతో దోహదం చేస్తాయి. అందుకే వీటి మెరుగుకు కృషి చేయాలి. నిపుణులైన ఫ్యాకల్టీ, ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నప్పటికీ కేవలం మౌలిక సదుపాయాల లేమి కారణంగా గుర్తింపునకు నోచుకోని యూనివర్సిటీలు దేశంలో ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలి. ‘గ్యాప్’ తగ్గించాలనే ఇటీవల దేశంలో పలు కార్పొరేట్ సంస్థలు విద్యా రంగంలోకి అడుగుపెట్టి సొంతంగా ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేస్తున్నాయి. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య నెలకొన్న గ్యాప్‌ను తగ్గించడం కోసమే సొంతంగా విద్యాసంస్థలను నెలకొల్పుతున్నాయి. కార్పొరేట్ సంస్థల ఆధ్వర్యంలో నెలకొన్న అకడమిక్ ఇన్స్టిట్యూట్లు స్వయం ప్రతిపత్తితో పనిచేస్తూ.. టీచింగ్, లెర్నింగ్ విధానంలో వినూత్న పద్ధతులు అనుసరిస్తున్నాయి. తద్వారా కోర్సు పూర్తయ్యేనాటికి వాస్తవ అవసరాలకు సరితూగేలా, జాబ్ రెడీ స్కిల్స్‌తో బయటికి వచ్చేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. అకడమిక్స్ నుంచే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితులు, అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే ఎంతో అవసరం. ఇటీవల కాలంలో మన దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై అవగాహన పెరుగుతుండటం ఆహ్వానించదగిన పరిణామం. ఇదే సమయంలో మరెందరో ఔత్సాహికులు.. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లేదా స్టార్టప్ నెలకొల్పాలంటే వారసత్వం ముఖ్యమనే అభిప్రాయంలో ఉన్నారు. దీన్ని విడనాడాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కేవలం ఫ్యామిలీ బిజినెస్ సంస్థలకే పరిమితం కాదు. ఔత్సాహికులకు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అటు అకడమిక్‌గానూ తరగతి గది నుంచే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవకాశాలు, అర్హతలపై అవగాహన పెంపొందించాలి. ఆ మూడూ ముఖ్యం ప్రస్తుతం సంస్థలు.. ఉద్యోగార్థుల విషయంలో.. కొత్త నియామకాల సమయంలో ప్రధానంగా మూడు అంశాల్లో నైపుణ్యాలపై దృష్టి సారిస్తున్నాయి. అవి.. సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇప్పుడు ఆయా కోర్సుల్లో ఉన్న విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేనాటికి ఈ స్కిల్స్ పెంచుకునేందుకు కృషి చేస్తే.. జాబ్ మార్కెట్ పోటీలో ముందంజలో నిలుస్తారు. అదే విధంగా రెగ్యులర్ లెర్నింగ్ దృక్పథాన్ని అనుసరిస్తే కెరీర్ కూడా నిత్య నూతనంగా ఉంటుంది. విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఇదే నా సలహా. -
ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్..నవతరం అధ్యయన సాధనం
‘బోర్డ్‌పై టీచర్ ఒక ప్రాబ్లమ్ కాన్సెప్ట్‌ను వివరించడం.. విద్యార్థులు తమ పుస్తకాల్లో నోట్ చేసుకోవడం’.. క్లాస్ రూం అనగానే సాధారణంగా గుర్తొచ్చే ఊహాచిత్రం. ఇందుకు భిన్నంగా ఇటీవల కాలంలో సరికొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. విద్యార్థులకు ఒక అంశంపై అత్యంత మెరుగైన నైపుణ్యాన్ని అందించేందుకు ఎన్నో మార్గాలు, సాధనాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో సరికొత్త అధ్యయన సాధనంగా విద్యార్థుల ఆదరణ పొందుతోంది.. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. విద్యార్థులనుభాగస్వాములను చేస్తూ.. ఒక అంశంపై రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అందించే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌పై ఈ వారం ఫోకస్.. క్రియేటివిటీ.. కమ్యూనికేషన్, కొలాబరేషన్, క్రిటికల్ థింకింగ్.. ఒక విద్యార్థి కెరీర్లో రాణించడానికి అత్యంత అవసరమైన నాలుగు ప్రధాన లక్షణాలు. ఈ నాలుగు లక్షణాలు అలవడేలా.. ప్రాక్టికల్ నైపుణ్యాల్ని అందించే సాధనమే.. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్! ఏదైనా ఒక పాఠంలోని అంశానికి సంబంధించి సమస్యను గుర్తించడం.. టీచర్ పర్యవేక్షణలో ఆ సమస్యకు మూలాలు.. పరిష్కార మార్గాలు కనుగొనడం.. ఆ దిశగా పరిశోధన చేయడం.. వెరసి సదరు అంశంపై ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతం చేసుకోవడం.. స్థూలంగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ముఖ్య ఉద్దేశం ఇది. ఎన్నో ఏళ్ల క్రితమే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌కు అంకురార్పణ జరిగినా.. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్.. ప్రాక్టికల్ స్వరూపం ఇప్పటివరకు మనకు తెలిసిన యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌కు అడ్వాన్స్డ్ స్వరూపమే.. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌లో పాఠ్య పుస్తకంలోని నిర్దిష్ట అంశానికి సంబంధించిన ప్రాక్టికల్ యాక్టివిటీస్ ద్వారా అవగాహన లభిస్తుంది. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ విధానంలో.. తరగతిలోని విద్యార్థుల ముందు ఒక సమస్యను ఉంచి.. ఆ సమస్య పరిష్కారానికి వాస్తవ సామాజిక పరిస్థితుల కోణంలో మార్గాలు అన్వేషించేలా ప్రోత్సహిస్తారు. అందుకే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే.. ఒక చిన్నపాటి పరిశోధన చేయడం! ఒక సమస్యను గుర్తించాక.. ఆ సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషించడం.. అన్నింటిలోకి అత్యంత అనుకూలమైన మార్గాన్ని ఎంచుకోవడం.. తర్వాత దశలో ఆ సమస్యకు సంబంధించి.. అప్పటికే తాము పాఠ్య పుస్తకంలో నేర్చుకున్న అంశాల పరిజ్ఞానాన్ని అన్వయించడం.. వాటిని సామాజిక పరిస్థితులతో బేరీజు వేసుకుంటూ పరిష్కారం కనుగొనడం.. మొత్తంగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ స్వరూపం ఇలా ఉంటుంది. ఈ క్రమంలో విద్యార్థులు తమ సృజనాత్మక నైపుణ్యాలకు మెరుగులు పెట్టుకునే అవకాశం లభిస్తుంది. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా అలవడతాయి. ఫలితంగా భవిష్యత్తులో ఎంచుకున్న రంగంలో మరింత ఉన్నతంగా రాణించడానికి మార్గం సులభం అవుతుంది. నిరంతర ప్రాజెక్ట్ వర్క్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో.. నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేసే విధంగా ప్రాజెక్ట్ వర్క్ తప్పనిసరి. ఈ ప్రాజెక్ట్ వర్క్ అంశం ఎంపిక అనేది విద్యార్థి ఆసక్తి, అభిరుచి, బ్రాంచ్ లేదా స్పెషలైజేషన్‌పై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల సదరు విద్యార్థికి ఒక అంశంలో మాత్రమే క్షేత్రస్థాయి నైపుణ్యాలు అలవడతాయి. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది తరగతి గదిలో నిరంతరం జరిగే ప్రక్రియ. ఫలితంగా విద్యార్థులు అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. సిలబస్‌లో నేర్చుకున్న అంశాల ఆధారంగా వాస్తవ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతమవుతుంది. అన్నింటిపైనా అవగాహన ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌లోని మరో ప్రధాన ప్రయోజనం.. విద్యార్థులకు తమ కోర్ సబ్జెక్ట్‌లు మొదలు.. సామాజిక పరిస్థితులపైనా అవగాహన లభించడం. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ విధానంలో ఒక అంశానికి సంబంధించి సమస్యను పరిష్కరించే క్రమంలో.. సామాజిక పరిస్థితులపై సమస్య ప్రభావం.. ఆ సమస్య పరిష్కారం ద్వారా సామాజికంగా కలిగే లాభాల గురించి కూడా తెలుస్తుంది. దీనిద్వారా విద్యార్థులకు ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ కూడా అలవడటం ఈ విధానంలోని మరో ప్రయోజనం. సోషల్ టు టెక్నికల్.. హైస్కూల్ టు పీజీ ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ విధానం కేవలం టెక్నికల్, మేనేజ్మెంట్ కోర్సులు.. ఉన్నత స్థాయి చదువులకే పరిమితం కాదు. సోషల్ సెన్సైస్ నుంచి సాంకేతిక విభాగం కోర్సుల వరకు.. హైస్కూల్ స్థాయి నుంచి పీజీ కోర్సుల వరకు ప్రతి విభాగంలో ప్రతి కోర్సులో.. ప్రతి స్థాయిలో అమలు చేయొచ్చు. కోర్సు.. స్థాయి ఏదైనా ఈ విధానం ఉద్దేశం విద్యార్థుల్లో సహజ నైపుణ్యాలను వెలికితీయడమే. పూర్తిగా గ్రాఫ్‌లు, ఫార్ములాలకే పరిమితమయ్యే మ్యాథమెటిక్స్‌లో నైపుణ్యం ఆధారంగా కూడా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌కు ఆస్కారం ఉందనడం అతిశయోక్తి కాదు. పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా.. కేవలం పాఠ్యాంశాలు, సిలబస్‌లోని నిర్దేశిత అంశాలకే పరిమితం కాకుండా.. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న ఏ రంగంలోనైనా.. ఏ అంశంలోనైనా ఒక సమస్యను పరిష్కరించేలా ప్రోత్సహించడం ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌లోని మరో ప్రత్యేకత. దీని ప్రధాన ఉద్దేశం సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్, సామాజిక-ఆర్థిక పరిస్థితులపై అవగాహన కల్పించడం. ఈ తరహా నైపుణ్యాలను తెలుసుకునేందుకు కొన్ని సంస్థలు ఉమ్మడి వేదికల ద్వారా అవకాశం కల్పిస్తున్నాయి. ఇన్ఫోసిస్ వంటి సంస్థలు పోటీలు నిర్వహిస్తున్నాయి. విద్యార్థులు ఒక ఐడియాతో వెళ్లి.. దానికి కార్యరూపమిస్తే బహుమతులు అందించడంతోపాటు.. తమ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి. క్రమేణా పెరుగుతున్న అవగాహన అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఎప్పటి నుంచో సమర్థంగా అమలవుతోంది. మన దేశంలో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌పై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. ప్రధానంగా టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఈ తరహా విధానానికి తెరదీస్తున్నాయి. ఐఐటీ-గాంధీనగర్ తొలిసారి అకడెమిక్ స్థాయిలో పీబీఎల్ విధానాన్ని అమలు చేస్తోంది. ఐఐటీ-బాంబే కూడా ‘ఈ-యంత్ర రోబోటిక్స్ కాంపిటీషన్’ పేరుతో వ్యవసాయ సాగు విధానాలలో రైతులకు తోడ్పడే సాధనాలను ఆవిష్కరించడానికి పోటీ నిర్వహించింది. దేశవ్యాప్తంగా దాదాపు ఆరు వేల మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. పలు సంస్థల ప్రతిపాదన మన దేశంలోని ప్రస్తుత కరిక్యులం, వాస్తవ అవసరాల మధ్య తేడాను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ చాలా అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ మేరకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ), నాస్కామ్ తదితర సంస్థలు అకడెమిక్ స్థాయిలో ఈ విధానాన్ని అమలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని సూచిస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో నేటి అవసరాలను తీర్చే విధంగా కరిక్యులంలోనే పీబీఎల్ విధానాన్ని అంతర్భాగం చేయాలని సీఐఐ సూచించింది. అధ్యాపకుల పాత్ర కీలకం పీబీఎల్ విధానం అమలులో అధ్యాపకులదే ప్రధాన పాత్ర. విద్యార్థులకు నిర్దిష్ట సమస్యను కేటాయించడం.. దాని పరిష్కారం కనుగొనే దిశగా పర్యవేక్షణ, సలహాలు, సూచనలు అందించడంలో అధ్యాపకులే కీలకం. ఈ మేరకు ఆబ్జెక్టివ్స్, చెక్‌లిస్ట్ రూపొందించ డం వంటి వాటిపై ముందుగా వారికి అవగాహన ఉండాలి. ఒక సమస్యను కేటాయించే ముందు ఆ సమస్యకు అందుబాటులో ఉన్న పరిష్కారాల గురించి కూడా తెలిసుండాలి. అంతేకాకుండా తమ తరగతిలోని విద్యార్థుల ఆసక్తి, అభిరుచిని గుర్తించి.. విద్యార్థులను ఒక బృందంగా ఏర్పరచడం అత్యంత కీలకం. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌లో.. ఒక తరగతిలో ఆలోచనలు, ఆసక్తుల్లో సారూప్యమున్న విద్యార్థులను గుర్తించడం.. బృందాలుగా ఏర్పరచడం ద్వారానే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. అందుకే.. పీబీఎల్‌పై అధ్యాపకులకు కూడా పూర్తి స్థాయి అవగాహన లభించేలా.. అమెరికా, కెనడా, యూకే వంటి దేశాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు (ఓరియెంటేషన్ ప్రోగ్రామ్స్) నిర్వహిస్తున్నారు. STEMవిభాగంలో ఎంతో అవసరం మన సామాజిక అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌ను అకడెమిక్ స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా TEM (Science, Technology, Engineering, Management)విభాగంలో పీబీఎల్ ద్వారా విద్యార్థులకు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. దీనికోసం.. విద్యా సంస్థలతోపాటు, సంబంధిత పరిశ్రమ వర్గాల తోడ్పాటు ఉంటే మంచి ఫలితాలు ఆశించొచ్చు. విద్యార్థులను కాలేజ్ స్థాయి నుంచే కంపెనీల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దొచ్చు. పీబీఎల్ వల్ల ఫ్లెక్సిబుల్ లెర్నింగ్‌కు ఎంతో ఆస్కారం లభిస్తుంది. కరిక్యులంలో లేదు కదా.. అనే భావన వీడి విద్యార్థులు.. అధ్యాపకులు ఈ విధానానికి శ్రీకారం చుడితే అద్భుత నైపుణ్యాలు సొంతమవుతాయి. భవిష్యత్తులో చక్కటి అవకాశాలు అందుకోవడానికి వీలవుతుంది. - ప్రొఫెసర్ బి.వి. నారాయణ ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్, ఐఐఎస్సీ-బెంగళూరు ఆర్ అండ్ డీ దిశగా తొలి అడుగు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ విధానాన్ని.. విద్యార్థుల కోణంలో రీసెర్చ అండ్ డెవలప్మెంట్ దిశలో తొలి అడుగుగా పేర్కొనొచ్చు. ఈ అప్రోచ్ ద్వారా విద్యార్థులకు తరగతి గదిలోనే రియల్ టైం ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. ఆర్ అండ్ డీ ఔత్సాహిక విద్యార్థులను గుర్తించి.. భవిష్యత్తులో వారు పీహెచ్డీ దిశగా వెళ్లే ప్రోత్సాహక సాధనంగానూ పీబీఎల్ విధానం తోడ్పడుతుంది. మన దేశంలో ఇంకా పూర్తి స్థాయిలో పీబీఎల్‌పై అవగాహన కలగడం లేదు. దీనికి సంబంధించి విద్యా సంస్థలు, అధ్యాపకులు చొరవ తీసుకోవాలి. పరిశ్రమ వర్గాలతో సంప్రదించి చిన్నపాటి పరిశోధనలను కళాశాల లేబొరేటరీలు, తరగతి గదుల్లోనే పూర్తి చేయాలి. తద్వారా విద్యార్థుల్లో సహజ నైపుణ్యాలు ఆవిష్కృతమయ్యేలా చూడాలి. - ప్రొఫెసర్ వి. వాసుదేవరావు, క్రయోజనిక్ ఇంజనీరింగ్, ఐఐటీ-ఖరగ్‌పూర్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్.. విద్యార్థులకు లభించే ప్రయోజనాలు క్రియేటివిటీ స్కిల్స్ అలవడటం. బృందాలుగా కలిసి పనిచేసే తత్వం. పాఠ్యాంశాలపై ఆసక్తి పెరగడం. భవిష్యత్తులో వాస్తవ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకునే అవకాశం క్లాస్ రూం నుంచే కాంటెంపరరీ అంశాలపై అవగాహన పెంచుకునే వీలు. ముఖ్యంగా పుస్తకాల్లో నేర్చుకున్న అంశాలపై నిరంతరం ప్రాక్టికల్ నాలెడ్జ్ లభించడం. మేనేజ్‌మెంట్‌లోనూ పీబీఎల్‌కు ఆస్కారం పీబీఎల్.. కేవలం టెక్నికల్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లకే అనుకూలం అనుకుంటే పొరపాటు. మేనేజ్మెంట్, సోషల్ సెన్సైస్ విభాగాల్లోనూ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌కు ఆస్కారం ఉంది. మేనేజ్మెంట్ కోర్సుల విషయంలో ఆయా కేస్ స్టడీలకు సంబంధించి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా పరిష్కారాలు కనుగొనే అవకాశం లభిస్తుంది. పరికరాల వినియోగం లేకపోయినా.. ఆలోచనలు, వాస్తవ ప్రామాణికాలు, సృజనాత్మకత ఆధారంగా మేనేజ్మెంట్ కేస్ స్టడీస్ అనాలిసిస్, ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో పీబీఎల్ ఎంతో దోహదపడుతుంది. - ప్రొఫెసర్ వి. సీత డీన్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, హెచ్‌సీయూ ఐటీ విభాగాల్లో ఆవశ్యకం ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్.. ఐటీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ఎంతో ఉపయుక్తం. రియల్ టైం ప్రాబ్లమ్ అనాలిసిస్, సాల్వింగ్‌కు దోహదం చేసే సాధనం. విద్యార్థులు తాము పాఠ్యాంశాల్లో నేర్చుకున్న అంశాల ఆధారంగా వాస్తవ సమస్యలను పరిష్కరించడం.. ఐటీ విభాగంలో ఉంటుంది. అందుకు.. పీబీఎల్ ద్వారా అకడెమిక్ స్థాయి నుంచే అవగాహన కల్పించొచ్చు. - ప్రొఫెసర్ సి. కృష్ణమోహన్, హెచ్ఓడీ-సీఎస్ఈ (ఐఐటీ-హైదరాబాద్)