వేలాది మంది డ్రైవర్లను అప్పుల ఊబిలోకి నెట్టి.. | Rise Fall of App Based Cab Services Lessons for India Gig Economy | Sakshi
Sakshi News home page

వేలాది మంది డ్రైవర్లను అప్పుల ఊబిలోకి నెట్టి..

May 1 2026 9:08 AM | Updated on May 1 2026 10:42 AM

Rise Fall of App Based Cab Services Lessons for India Gig Economy

ఒకప్పుడు పట్టణ రవాణా వ్యవస్థను శాసించిన యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసుల నమూనా ప్రస్తుతం గందరగోళ పరిస్థితిలో ఉంది. ఒకప్పుడు వేల రూపాయల ఆదాయం, విలాసవంతమైన జీవితం అంటూ ఊరించిన ఈ వ్యవస్థ నేడు వేలాది మంది డ్రైవర్లను అప్పుల ఊబిలోకి నెట్టి ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతోంది. తీసుకున్న అప్పులు కట్టకపోవడంతో వెహికిల్‌ లోన్లు ఇచ్చిన బ్యాంకులు 30,000లకు పైగా క్యాబ్‌లను జప్తు చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వెనుక ఉన్న చేదు నిజాలు ఏమిటో విశ్లేషిద్దాం.

ఓలా/ ఉబెర్ నమూనా

యాప్-ఆధారిత క్యాబ్ కంపెనీల వృద్ధిని నిశితంగా పరిశీలిస్తే అవి నాలుగు దశల్లో తమ నెట్‌వర్క్‌ను విస్తరించాయి.

1. నగదు వెల్లువ: ప్రారంభంలో భారీగా ఇన్సెంటివ్‌లు ఇచ్చి మార్కెట్‌ను ఆక్రమించాయి.

2. నమ్మకం: డ్రైవర్లకు నెలకు రూ.70,000 నుంచి రూ.80,000 వరకు ఆదాయం వస్తుందనే ఆశ కల్పించాయి.

3. ఆధారపడటం: డ్రైవర్లు ఆ ఆదాయాన్ని నమ్మి భారీగా కార్ లోన్లు తీసుకుని సొంత వాహనాలు కొనుగోలు చేశారు.

4. నియంత్రణ: మార్కెట్‌ను గుప్పిట్లోకి తెచ్చుకున్నాక ఇన్సెంటివ్‌లను తగ్గించి కమిషన్లను పెంచాయి.

అప్పుల ఊబిలో డ్రైవర్లు

కంపెనీల వ్యూహాలు మారడంతో డ్రైవర్ల ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. పెరుగుతున్న ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులకు తోడు ఇన్సెంటివ్‌లు తగ్గడంతో డ్రైవర్ల చేతికి వచ్చే ఆదాయం రూ.30,000 నుంచి రూ.35,000కు పరిమితమైంది. దీంతో తీసుకున్న కార్ లోన్ల ఈఎంఐలు కట్టడం డ్రైవర్లకు భారమైంది.

కొవిడ్ సంక్షోభం ఈ పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. ఆదాయం లేక, అప్పులు తీర్చలేక దాదాపు 30,000కు పైగా క్యాబ్‌లను బ్యాంకులు జప్తు చేశాయి. వాహనాల జప్తుతోపాటు లక్షలాది కుటుంబాల జీవనోపాధి దెబ్బతింది.

మారుతున్న ధోరణి

ప్రస్తుతం డ్రైవర్ల ఆలోచనా ధోరణి మారింది. అప్పుల భారం లేని, రిస్క్ తక్కువగా ఉండే డెలివరీ పార్టనర్ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆదాయం తక్కువైనా సొంత వాహనంపై అప్పుల బాధ్యత లేకపోవడమే వారికి ఇప్పుడు ఊరటనిస్తోంది.

ప్రయాణికులపై భారం

మరోవైపు, ప్రయాణికుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు ఒక సామాన్య ప్రయాణికుడు ప్రధాన నగరాల్లో సరాసరి నెలవారీ క్యాబ్ ప్రయాణాల కోసం దాదాపు రూ.27,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది సొంత కారును కొని మెయింటెనెన్స్ చేసుకునే ఖర్చు కంటే ఎక్కువ కావడం గమనార్హం.

క్యాబ్-హెయిలింగ్ ఎకోసిస్టమ్ కేవలం డ్రైవర్లకే కాకుండా కంపెనీలకు, ప్రయాణికులకు కూడా నష్టదాయకంగా మారింది. కేవలం గ్రోత్ మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ మోడల్ స్థిరత్వం వైపు దృష్టి సారించకపోవడంతో ఈ దుస్థితి దాపురించిందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో రవాణా వ్యవస్థపై పునసమీక్షించుకోకపోతే ఈ సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది.

ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్‌!

Advertisement
 
Advertisement
Advertisement