రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకుంది. సెప్టెంబర్ 2025లో సంస్థ వైర్‌లెస్, వైర్‌లైన్ రెండు విభాగాల్లోనూ వృద్ధి సాధించినట్లు తెలిపింది. టెలికాం రెగ్యులేటర్ సంస్థ (TRAI) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం, వైర్‌లైన్ విభాగంలో జియో 40,641 కొత్త యూజర్లను చేర్చుకొని తన సబ్‌స్క్రైబర్ సంఖ్యను 17.87 లక్షల నుంచి 18.28 లక్షలకు పెంచుకుంది. ఇది అన్ని ఆపరేటర్లలో అత్యధికం.
ఈ వృద్ధి ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్, ఎంటర్‌ప్రైజ్ కనెక్టివిటీ సొల్యూషన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. భారతి ఎయిర్‌టెల్ సెప్టెంబర్‌లో 12,043 మంది కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకోగా, బీఎస్ఎన్ఎల్ తక్కువ స్థాయిలో మాత్రమే వృద్ధి నమోదు చేసింది. వొడాఫోన్ ఐడియా మాత్రం 1,310 మంది యూజర్లను కోల్పోయింది.
వైర్‌లెస్ విభాగంలో జియో 1.17 లక్షల కొత్త మొబైల్ సబ్‌స్క్రైబర్లను చేర్చుకొని తన మొత్తం యూజర్ బేస్‌ను సెప్టెంబర్ 2025 నాటికి 3.18 కోట్లకు చేర్చుకుంది. ఎయిర్‌టెల్ 39,248 కొత్త యూజర్లను యాడ్ చేసుకుంది. బీఎస్ఎన్ఎల్ చవక ధర ప్లాన్లతో 80,840 యూజర్లను సాధించింది. అయితే వొడాఫోన్ ఐడియా దాదాపు 70,000 యూజర్లను కోల్పోయింది.
ఇదీ చదవండి: ఆరేళ్లు పూర్తి చేసుకున్న తొలి ప్రైవేట్ రైలు


