5జీ స్మార్ట్‌ఫోన్‌ రూ.10,000 లోపే!

Realme GT 5G to Launch Globally in June - Sakshi

విడుదలకు సన్నాహాలు చేస్తున్న రియల్‌మీ

రూ.7 వేలకూ తీసుకొస్తామంటున్న కంపెనీ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ మరోసారి వేడెక్కనుంది. 3జీ, 4జీ మొబైల్స్‌ విషయంలో చైనా కంపెనీల దూకుడుతో హేమాహేమీ బ్రాండ్లు కనుమరుగైన సంగతి తెలిసిందే. ఇప్పుడు 5జీ స్మార్ట్‌ఫోన్ల వంతు రాబోతోంది. ఈ విభాగంలో తొలి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తున్న రియల్‌మీ రూ.10,000 లోపు ధరలో మోడళ్లను తీసుకురానున్నట్టు ప్రకటించింది. వచ్చే ఏడాది ఇవి   భారత్‌లో సాకారమవుతాయని రియల్‌మీ వైస్‌ ప్రెసిడెంట్, ఇండియా, యూరప్‌ సీఈవో మాధవ్‌ సేథ్‌ 5జీ సమ్మిట్‌ సందర్భంగా వెల్లడించారు. క్రమంగా రూ.7,000 ధరలోనూ మోడళ్లను తీసుకొస్తామని పేర్కొన్నారు. మూడేళ్లలో 10 కోట్ల మంది కస్టమర్లకు చవక 5జీ స్మార్ట్‌ఫోన్లను అందించాలన్నది సంస్థ లక్ష్యం.

పరిశోధనకు రూ.2,100 కోట్లు..
అంతర్జాతీయంగా 5జీ పరిశోధన, అభివృద్ధికై రూ.2,100 కోట్లకుపైగా వెచ్చించనున్నట్టు మాధవ్‌ వెల్లడించారు. భారత్‌ సహా వివిధ దేశాల్లో ఏడు ఆర్‌అండ్‌డీ సెంటర్లను ఈ ఏడాది నెలకొల్పనున్నట్టు తెలిపారు. 90 శాతం పరిశోధన బృందం ఈ విభాగంపైనే ఫోకస్‌ చేసిందన్నారు. ‘10–15 మార్కెట్లలో 5జీ నెట్‌వర్క్‌ పైలట్‌ ప్రోగ్రామ్స్‌లో పాలుపంచుకుంటాం. మూడు నాలుగేళ్లలో 5జీ స్మార్ట్‌ఫోన్స్‌ అభివృద్ధి రెండవ శకంలోకి అడుగుపెడుతుంది. ఆ సమయానికి ఉపకరణాలు చవకగా లభిస్తాయి. తొలి శకంలో 5జీ స్మార్ట్‌ఫోన్స్‌ అధిక ధరల్లో లభించే ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లకే పరిమితమయ్యాయి. 5జీ శ్రేణిని విస్తరిస్తాం. గతేడాది 22 దేశాల్లో 14 రకాల 5జీ స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టాం. మొత్తం మోడళ్లలో వీటి వాటా 40 శాతం. 2022 నాటికి 5జీ మోడళ్లు 20 దాటతాయి. తద్వారా వీటి వాటా 70 శాతానికి చేరుకుంటుంది’ అని వివరించారు.

టెలికం కంపెనీలకు బూస్ట్‌..
నెట్‌వర్క్‌ అందుబాటులో లేనప్పటికీ 5జీ స్మార్ట్‌ఫోన్స్‌ మార్కెట్లో ఉన్నాయి. 5జీ సేవలు త్వరితగతిన ప్రవేశపెట్టేందుకు టెలికం కంపెనీలకు ఈ అంశం బూస్ట్‌నిస్తుందని క్వాల్‌కామ్‌ ఇండియా, సార్క్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజెన్‌ వగాదియా తెలిపారు. 5జీ నెట్‌వర్క్‌ వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చే సమయానికి అధిక మొత్తంలో 5జీ స్మార్ట్‌ఫోన్స్‌ దర్శనమిస్తాయని అన్నారు. ఆధునిక తరం సాంకేతిక పరిజ్ఞానం మెరుగైన గేమింగ్, కెమెరా అనుభూతి ఇస్తాయని కస్టమర్లకు అవగాహన ఉందన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top