
సామాన్యుడి సొంతింటి కల మరింత దూరమవుతోంది. అందుబాటు గృహాల నిర్మాణాలు తగ్గుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇసుక, సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో పాటు డెవలపర్లు విలాసవంతమైన ఇళ్ల నిర్మాణానికే మొగ్గు చూపిస్తున్నారు. గతంలో ప్రభుత్వాలు కూడా సామాన్య, మధ్యతరగతి కోసం వేర్వేరు పథకాల ద్వారా సొంతింటి కలను నెరవేర్చేవి. కేంద్రం ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) గృహరుణ ఆధారిత వడ్డీ సబ్సిడీతో కొనుగోలుదారులకు భారం తగ్గి ఈఎంఐ చెల్లింపుల్లో కొంత వెసులుబాటు లభించేది. ఎంఐజీ విభాగంలో 1,800 చ.అ. విస్తీర్ణం వరకు ఈ పథకం అమలు చేసినప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందారు. ఇప్పుడిది ఎల్‌ఐజీ వరకే పరిమితమైంది. దీంతో సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. - సాక్షి, సిటీబ్యూరో
ప్రైవేటీకరణ..
పట్టణాల్లో హౌసింగ్ బోర్డుల ఆధ్వర్వంలో గృహ నిర్మాణం చేపట్టినప్పుడు అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని కాలనీలను నిర్మించేవారు. అధిక ఆదాయం, మధ్య, తక్కువ ఆదాయ వర్గాలుగా హెచ్‌ఐజీ, ఎంఐజీ, ఎల్‌ఐజీగా విభజించి ఇళ్లు, స్థలాలను విక్రయించే పరిస్థితి ఉండేది. అయితే డిమాండ్‌కు అనుగుణంగా, కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణాలు చేపట్టడంలో హౌసింగ్ బోర్డులు వెనకబడటంతో ప్రైవేట్ రంగం విజృంభించింది. మొదట్లో అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్న ఇళ్ల నిర్మాణం చేపట్టినా.. తర్వాత డిమాండ్ ఉన్న ప్రీమియం ఇళ్లవైపు వ్యవస్థీకృత రియల్ ఎస్టేట్ మొగ్గింది. భూముల ధరలు అనూహ్యంగా పెరగడంతో సరసమైన ధరల ప్రాజెక్టులు చేపట్టలేకపోతున్నామని.. విలాసవంతమైన ఇళ్ల నిర్మాణం చేపడితే విక్రయాలు బాగుంటున్నాయని బిల్డర్లు అంటున్నారు.
తగ్గిన కొనుగోలు శక్తి..
మధ్యతరగతి వర్గాల్లో అత్యధిక శాతం మంది గృహరుణం ద్వారానే ఇల్లు కొంటుంటారు. అధిక వడ్డీ రేట్లు, రుణ లభ్యత తగ్గిపోవడంతో సొంతింటి కల సవాల్‌గా మారింది. భూముల ధరలు పెరగడం.. ఆ మేరకు ఇంటి ధరలను పెంచాల్సి రావడంతో అందుబాటు ధరల్లో ఇళ్ల లభ్యత తగ్గిపోయింది. బిల్డర్ ఎవరైనా ముందుకొచ్చి సరసమైన ధరల ఇళ్ల నిర్మాణం చేపడితే వాటిని విక్రయించడం పెద్ద సవాల్‌గా మారిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఆయా వర్గాల్లో మేరకు కొనుగోలు శక్తి లేకపోవడమే దీనికి కారణం. అన్ని వనరులను సమీకరించుకుని కొంతమంది కొనుగోలు చేస్తున్నారు.