
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) పెనాల్టీ నిబంధనలను సవరించింది. ఇందులో భాగంగా ఆర్‌బీఐ తాజాగా ఫెమా నిర్దిష్ట ఉల్లంఘనలకు జరిమానాలను రూ.2 లక్షలకు పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. ఇది విదేశీ మారకద్రవ్య లావాదేవీలతో సంబంధం ఉన్న వ్యక్తులు, వ్యాపారాలకు కీలకం కానుంది.
గతంలోని నిబంధనల ప్రకారం ఉల్లంఘనల మొత్తంలో కొంత శాతంగా ఈ జరిమానాలను వసూలు చేసేవారు. దీని స్థానంలో రూ.2 లక్షలు స్థిరమైన జరిమానా నిబంధనను తీసుకొచ్చారు. గతంలోని విధానం ద్వారా తరచుగా భారీ ఆర్థిక జరిమానాలు చెల్లించాల్సి వచ్చేది. ఫెమా పెనాల్టీ ఫ్రేమ్‌వర్క్ కింద లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) రాబడులు, ఎగుమతి కాలపరిమితిలో జాప్యం, అధిక విలువ కలిగిన షేర్లను బహుమతిగా ఇవ్వడం వంటి అంశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. పెనాల్టీలో భాగంగా ఫిక్స్‌డ్ క్యాప్‌ను ప్రవేశపెట్టడం ద్వారా జరిమానాల ప్రక్రియను సరళతరం చేసినట్లయిందని కొందరు భావిస్తున్నారు. ఇటువంటి నియంత్రణ ఉల్లంఘనల సమయంలో వ్యక్తులు, వ్యాపారాలు ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా ఆర్‌బీఐ ఈ మార్పులు చేసినట్లు చెప్పింది.
ఇదీ చదవండి: ‘పహల్గాం బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిస్తాం’
ఈ చర్య వాటాదారులపై భారాన్ని తగ్గించి ఫెమా మార్గదర్శకాలను మరింత మెరుగ్గా పాటించేలా చేస్తుందని కొందరు చెబుతున్నారు. జరిమానాలు నిష్పాక్షికంగా ఉండేలా చూడటం ద్వారా దేశంలో మరింత స్నేహపూర్వక వ్యాపార వాతావరణాన్ని పెంపొందించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.