
తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అనుచిత వ్యాపార విధానాలకు గాను రైడ్ సేవల సంస్థ ర్యాపిడోకి వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సీసీపీఏ రూ. 10 లక్షల జరిమానా విధించింది. ‘5 నిమిషాల్లో ఆటో లేదా రూ. 50 పొందండి ‘ ఆఫర్ కింద పరిహారం లభించని కస్టమర్లకు రీయింబర్స్ చేయాలని కూడా ఆదేశించింది.
దీనితో పాటు ‘గ్యారంటీడ్ ఆటో‘ ఆఫర్ ప్రకటనలను కూడా పరిశీలించిన సీసీపీఏ, ఇవి వినియోగదారులను తప్పుదోవ పట్టించే తప్పుడు అడ్వర్టైజ్‌మెంట్లుగా నిర్ధారించింది. హామీ ఇచ్చినట్లుగా రూ. 50 డబ్బు రూపంలో కాకుండా రూ. 50 వరకు విలువ చేసే ర్యాపిడో కాయిన్ల రూపంలో లభిస్తాయన్న విషయాన్ని చాలా చిన్నని, చదవడానికి అనువుగా లేని ఫాంట్లలో కంపెనీ డిస్‌ప్లే చేసిందని సీసీపీఏ విచారణలో తేలింది.
పైపెచ్చు ఆ మొత్తాన్ని బైక్ రైడ్స్ కోసమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏడు రోజుల వ్యవధిలో ఉపయోగించుకోకపోతే కాలపరిమితి తీరిపోతుంది. అంతేగాకుండా ఈ హామీ బాధ్యతను కంపెనీ తన మీద పెట్టుకోకుండా వ్యక్తిగత డ్రైవర్ల మీదకు నెట్టేసినట్లు విచారణలో తేలింది. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ డేటా ప్రకారం 2024 జూన్ నుంచి 2025 జూలై మధ్య కాలంలో ర్యాపిడోపై ఫిర్యాదులు 1,224కి ఎగిశాయి. అంతక్రితం 14 నెలల వ్యవధిలో 575 కంప్లైట్లు నమోదయ్యాయి.