
గృహ రుణ రంగ సంస్థ పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 25 శాతం జంప్‌చేసి రూ. 550 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ.439 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ.1,814 కోట్ల నుంచి రూ. 2,037 కోట్లకు ఎగసింది. వాటాదారులకు షేరుకి రూ.5 డివిడెండ్ ప్రకటించింది. కాగా.. వడ్డీ ఆదాయం రూ.1,693 కోట్ల నుంచి రూ. 1,906 కోట్లకు బలపడింది. నికర వడ్డీ ఆదాయం 16 శాతం పుంజుకుని రూ.734 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.65 శాతంనుంచి 3.75 శాతానికి మెరుగయ్యాయి. స్థూల మొండి బకాయిలు(ఎన్‌పీఏలు) ఫ్లాట్‌గా 1.08 శాతంవద్ద నిలవగా.. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 13 శాతం వృద్ధితో రూ.80,397 కోట్లకు చేరాయి. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 28 శాతం జంప్‌చేసి రూ.1,936 కోట్లయ్యింది. 2023–24లో రూ. 1,508 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 7,024 కోట్ల నుంచి రూ. 7,661 కోట్లకు ఎగసింది.
యుకో బ్యాంక్ లాభం జూమ్
పీఎస్‌యూ సంస్థ యుకో బ్యాంక్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 24 శాతం జంప్‌చేసి రూ. 666 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 538 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 6,984 కోట్ల నుంచి రూ. 8,136 కోట్లకు ఎగసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ నికర లాభం రూ. 1,671 కోట్ల నుంచి రూ. 2,468 కోట్లకు జంప్‌చేసింది. స్థూల మొండి బకాయిలు(ఎన్‌పీఏలు) 3.46 శాతం నుంచి 2.69 శాతానికి దిగిరాగా.. నికర ఎన్‌పీఏలు 0.89 శాతం నుంచి 0.5 శాతానికి తగ్గాయి. క్యూ4లో ప్రభుత్వ వాటా 95.39 శాతం నుంచి 90.95 శాతానికి క్షీణించింది.
ఐడీబీఐ బ్యాంక్ లాభం అప్
పీఎస్‌యూ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ నియంత్రణలోని ఐడీబీఐ బ్యాంక్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 26 శాతం జంప్‌చేసి రూ. 2,051 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,628 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 7,887 కోట్ల నుంచి రూ. 9,035 కోట్లకు ఎగసింది. వడ్డీ ఆదాయం నామమాత్ర క్షీణతతో రూ. 6,979 కోట్లకు పరిమితమైంది. వాటాదారులకు షేరుకి రూ. 2.1 డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 33 శాతం జంప్‌చేసి రూ. 7,515 కోట్లకు చేరింది. 2023–24లో రూ. 5,634 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 30,037 కోట్ల నుంచి రూ. 33,826 కోట్లకు ఎగసింది. స్థూల మొండి బకాయిలు(ఎన్‌పీఏలు) 4.53 శాతం నుంచి 2.98 శాతానికి దిగిరాగా.. నికర ఎన్‌పీఏలు 0.34 శాతం నుంచి 0.15 శాతానికి తగ్గాయి.
ఐఆర్‌ఎఫ్‌సీ లాభం నేలచూపు
క్యూ4లో రూ. 1,667 కోట్లు
రూ. 60,000 కోట్ల సమీకరణకు సై
రైల్వే రంగ ఫైనాన్స్ కంపెనీ ఐఆర్‌ఎఫ్‌సీ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో ప్రభుత్వ రంగ సంస్థ నికర లాభం 3 శాతం నీరసించి రూ. 1,667 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,717 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 6,478 కోట్ల నుంచి రూ. 6,723 కోట్లకు బలపడింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 4,761 కోట్ల నుంచి రూ. 5,042 కోట్లకు పెరిగాయి. కాగా.. దేశ, విదేశీ మార్కెట్ల నుంచి రూ. 60,000 కోట్లవరకూ పెట్టుబడులు సమీకరించేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఇందుకు వీలుగా ప్రయివేట్ ప్లేస్‌మెంట్ లేదా పబ్లిక్ ఇష్యూ ద్వారా పన్నురహిత బాండ్లు, సాధారణ బాండ్లు జారీ చేయనుంది. వీటిలో క్యాపిటల్ గెయిన్ బాండ్లు, ప్రభుత్వ హామీగల బాండ్లు తదితరాలున్నట్లు కంపెనీ పేర్కొంది. వివిధ మార్గాలలో చౌకగా పెట్టుబడులను సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు కంపెనీ సీఎండీ మనోజ్ కుమార్ దూబే పేర్కొన్నారు.