
ప్రైవేటు రంగ డీసీబీ బ్యాంక్ మార్చితో అంతమైన త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 14 శాతం పెరిగి రూ.177 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.156 కోట్లుగానే ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం రూ.1,581 కోట్ల నుంచి రూ.1,961 కోట్లకు వృద్ధి చెందింది. బ్యాంక్ స్థూల నిరర్థక రుణ ఆస్తులు (ఎన్‌పీఏలు) 2.99 శాతంగా నమోదయ్యాయి.
క్రితం ఏడాది ఇదే త్రైమాసికం చివరికి ఇవి 3.23 శాతంగా ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు పెద్దగా మార్పు లేకుండా 1.12 శాతానికి పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 1.11 శాతంగా ఉన్నాయి. వాటాదారుల వద్దనున్న ప్రతి షేరుకు రూ.1.35 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. ఇందుకు కంపెనీ వార్షిక సమావేశంలో (ఏజీఎం) వాటాదారులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
ఆర్‌బీఎల్ బ్యాంక్ లాభాలకు కోత
ప్రైవేటు రంగ ఆర్‌బీఎల్ బ్యాంక్ కన్సాలిడేటెడ్ లాభం గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2024–25 క్యూ4) గణనీయంగా (76 శాతం) తగ్గిపోయింది. రూ.89 కోట్ల లాభం నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.364 కోట్లుగా ఉండగా, 2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.47 కోట్లుగా ఉండడం గమనార్హం. నికర వడ్డీ ఆదాయం 2 శాతం తగ్గి రూ.1,563 కోట్లుగా నమోదైంది. రుణాల్లో 7 శాతం వృద్ధి కనిపించింది. ముఖ్యంగా ప్రొవిజన్లు, కంటింజెన్సీలకు (మొండి బకాయిలు, ఇతర అవసరాలకు) కేటాయింపులు రూ.785 కోట్లకు పెరిగిపోవడం లాభాలకు కోత పెట్టింది.
క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఇవి రూ.414 కోట్లుగానే ఉన్నాయి. నికర వడ్డీ మార్జిన్ 5.45 శాతం నుంచి 4.89 శాతానికి తగ్గింది. బ్యాంకు రుణ ఆస్తుల నాణ్యతను గమనిస్తే.. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 2.6 శాతంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.65 శాతంగా ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.74 శాతం నుంచి 0.29 శాతానికి తగ్గాయి. ఇక 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.695 కోట్ల లాభం నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,168 కోట్లుగా ఉంది. ప్రతీ షేరుకు రూ.1 చొప్పున డివిడెండ్ పంపిణీకి బోర్డు సిఫారసు చేసింది.