ఎలాన్ మస్క్ తన రాకెట్ తయారీ సంస్థ స్పేస్ఎక్స్ (SpaceX)ను పబ్లిక్ కంపెనీగా మార్చబోతున్నట్లు హింట్ ఇచ్చారు. టెస్లా 2025 వాటాదారుల సమావేశంలో ఆయన చేసిన ప్రకటన వల్ల స్పేస్ఎక్స్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) వచ్చే అవకాశం ఉంటుందని కొందరు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
టెస్లా (Tesla) 2025 వాటాదారుల సమావేశంలో మాట్లాడుతూ మస్క్ స్పేస్ఎక్స్ ఐపీఓ గురించి వ్యాఖ్యలు చేశారు. ‘టెస్లా వాటాదారులు స్పేస్ఎక్స్ వృద్ధిలో పాల్గొనడానికి ఏదైనా మార్గాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాను. అది చాలా మేలు చేస్తుంది. స్పేస్ఎక్స్ కంపెనీ భవిష్యత్తు కార్యకలాపాల్లో పాలుపంచుకోవడానికి ప్రజలకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. ఇప్పటికే ఇతర కంపెనీల్లో స్టాక్స్ కలిగి ఉన్న మద్దతుదారులు స్పేస్ఎక్స్ స్టాక్ కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. కానీ, ఏ సమయంలో అది జరుగుతుందో కచ్చితంగా చెప్పలేను. అయితే ఏదో ఒక సమయంలో మాత్రం స్పేస్ఎక్స్ పబ్లిక్ కంపెనీగా మారాలి’ అని అన్నారు.
ఈ వ్యాఖ్యలు ప్రపంచంలోని అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీల్లో ఒకటైన స్పేస్ఎక్స్ భవిష్యత్తుపై, సాధారణ ప్రజలు పెట్టుబడి పెట్టే అవకాశంపై ఊహాగానాలకు దారితీశాయి.
స్పేస్ఎక్స్
2002లో ఎలాన్ మస్క్ దీన్ని స్థాపించారు. స్పేస్ఎక్స్ (స్పేస్ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్ప్) టెక్సాస్‌లోని బ్రౌన్స్ విల్లేలో ఉన్న స్టార్ బేస్‌లో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. లో-ఎర్త్ ఆర్బిట్ నుంచి అంతరిక్ష నౌకను విజయవంతంగా తిరిగి భూమిపైకి తెచ్చిన సంస్థగా గుర్తింపు పొందింది.
ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)తో అంతరిక్ష నౌక (డ్రాగన్ 2)ను విజయవంతంగా డాక్ చేసింది.
స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లు పునర్వినియోగానికి వీలుగా ఉన్నాయి.
ఇదీ చదవండి: రైలులో మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నారా?


