ప్రమోటర్ల దారెటు..? | Promoters are responsible for ensuring accurate disclosures | Sakshi
Sakshi News home page

ప్రమోటర్ల దారెటు..?

Apr 6 2026 3:09 AM | Updated on Apr 6 2026 3:09 AM

Promoters are responsible for ensuring accurate disclosures

ఈ పతనంలోనూ షేర్లు కొంటూ సంకేతాలిస్తున్న కంపెనీలు 

కొందరైతే భారీగా విక్రయించి క్యాష్‌ చేసుకుంటున్న తీరు 

ప్రమోటర్లిస్తున్న సంకేతాలు అర్థం చేసుకోవటం ముఖ్యం 

అన్నిసార్లూ కొనటం పాజిటివ్‌... అమ్మటం నెగెటివ్‌ కాదు 

వాటితో పాటు మిగిలిన అంశాలనూ పరిశీలిస్తేనే స్పష్టత 

సరిగ్గా విశ్లేషించుకోగలిగితే ఏం చేయాలనే దానిపై అవగాహన

కొన్నాళ్లుగా అమెరికా సుంకాలు... ఇపుడేమో ఇరాన్‌ యుద్ధం. మార్కెట్లు విపరీతమైన ఊగిసలాటకు గురవుతున్నాయి. గడిచిన ఆరునెలల రికార్డు చూస్తే 90 శాతానికి పైగా స్టాక్స్‌ నష్టాల్లోనే ఉన్నాయి. కొన్ని స్టాక్స్‌ 50 శాతానికి పైగా నష్టపోయాయంటే అతిశయోక్తి కాదు. కొందరేమో ఇపుడు కొంత సొమ్ము ఇన్వెస్ట్‌ చేయొచ్చని చెబుతున్నారు. మరికొందరేమో ఇంకొన్నాళ్లు ఆగాలని చెబుతున్నారు. ఒకరకంగా ఇది గందరగోళ పరిస్థితే. ఇప్పటికే బాగా నష్టపోయిన వారి పరిస్థితయితే మరీ దారుణం. 

మరేం చెయ్యాలి? ఈ ప్రశ్నకు జవాబు వెదికే ముందు మరో సంగతి చూద్దాం.. అది.. ప్రమోటర్లు ఏం చేస్తున్నారనేది.  ఎందుకంటే ప్రమోటర్లు కూడా పరిస్థితులకు తగ్గట్టుగా వారి కంపెనీలో వారికున్న షేర్లనూ విక్రయిస్తుంటారు. కొన్నిసార్లు కొంటుంటారు. షేరు ధర పడిపోతే వారి కంపెనీ విలువతో పాటు వారి షేర్ల విలువా తగ్గిపోయినట్టే. తాజా పతనంలో వారూ నష్టపోయినట్లే. అయితే సొంత కంపెనీ షేర్లను కొంటున్నా, అమ్ముతున్నా అది మిగిలిన ఇన్వెస్టర్లకు వారిస్తున్న సంకేతంగానే భావించాలి. 

ఎందుకంటే మిగతా వారందరి కన్నా ఫౌండర్స్, మేనేజ్‌మెంటుకే కంపెనీ వాస్తవ స్థితిగతులు ఎక్కువగా తెలుస్తాయి. వారు స్పెక్యులేషన్‌ బట్టి కాకుండా క్షేత్ర స్థాయి పరిస్థితుల గురించి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టే ప్రమోటర్లు తమ షేరును కొనడాన్ని మార్కెట్‌ కొంత సానుకూల విషయంగా పరిగణిస్తుంది. వారు సొంత డబ్బును మరింతగా ఇన్వెస్ట్‌ చేయడాన్ని కంపెనీ వ్యాపారంపై వారికి గల ధీమాగా భావిస్తుంది. ప్రమోటర్లు ఇలా కొనుగోళ్లు, అమ్మకాలు జరపడమనేది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? సాధారణ ఇన్వెస్టర్లు వాటిని ఎలా అర్థం చేసుకోవచ్చు? సదరు స్టాక్‌ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు? ఇందులో పొంచి ఉన్న రిస్కులు ఏమిటి? ఇవన్నీ ఈ వెల్త్‌ స్టోరీలో చూద్దాం...     

కొనుగోళ్లకు ఎందుకంత ప్రాముఖ్యత.. 
ప్రమోటర్లు షేర్లను కొనుక్కోవడమనేది ఒకోసారి స్టాక్‌ విలువ ఉండాల్సిన స్థాయి కంటే తక్కువే ఉందని (అండర్‌వేల్యుయేషన్‌) భావించడానికి సంకేతంగా చూడొచ్చు. అలాగే, దీర్ఘకాలికంగా వ్యాపారంపై వారికున్న నమ్మకాన్ని ప్రతిబింబించవచ్చు. సాధారణంగా ఆదాయాలు మెరుగుపడటానికి, స్టాక్‌ రీ–రేటింగ్‌కి ముందు ఇలాంటివి కనిపిస్తుంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే.. స్టాక్‌ తగ్గిందంటే దానిపై మార్కెట్లో నిరాశపూరిత ధోరణికి సిగ్నల్‌గా, ప్రమోటర్లు కొంటున్నారంటే.. కాని్ఫడెన్సుకి సంకేతంగా పరిగణిస్తుంటారు.

ఈ డేటాను ఎలా ఉపయోగించుకోవాలంటే..  
ప్రమోటర్లు కొన్ని త్రైమాసికాలుగా స్థిరంగా కొనుక్కుంటూ ఉండవచ్చు. మార్కెట్లు కరెక్షన్‌కి లోనైనప్పుడు కొనుక్కుంటూ ఉండొచ్చు. ఇలాంటి వాటిని ట్రాక్‌ చేయాలి. ప్రమోటర్లు అదనంగా కొంటున్నారేమో చూడాలి. షేర్‌హోల్డింగ్‌ ప్యాటర్న్‌ను ప్రమోటర్‌ సైకాలజీగా చూడాలి.  

ఎలా ట్రాక్‌ చేయొచ్చు..
ప్రమోటర్ల యాక్టివిటీని దేశీయంగా ట్రాక్‌ చేసేందుకు కొన్ని సాధనాలున్నాయి. రియల్‌ టైమ్‌ డిస్‌క్లోజర్స్‌కి సంబంధించి సెబీ పీఐటీ (ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌) ఫైలింగ్స్‌లో చాలా తరచుగా, దాదాపు రియల్‌ టైమ్‌లో వివరాలు అందుబాటులో ఉంటాయి. అదే వాటాల్లో మార్పులేవైనా చోటు చేసుకుంటే సెబీ ఎస్‌ఏఎస్‌టీ ఫైలింగ్స్‌లో తెలుస్తుంది. సాధారణంగా ఇలాంటి విషయాలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ డిస్‌క్లోజర్లు, రెగ్యులేషన్‌ 10(5) .. 10 (6), ఎస్‌ఏఎస్‌టీ థ్రెషోల్డ్‌ ఫైలింగ్స్‌ రూపంలో ఉంటాయి.

ప్రమోటరు అమ్మడం పూర్తి నెగటివ్‌ కాదు.. 
ప్రమోటర్లు అమ్ముతున్నారంటే తప్పకుండా దుర్వార్త ఏదో ఉండే ఉంటుందనే అభిప్రాయం అపోహ మాత్రమే. వివిధ కారణాలరీత్యా ప్రమోటర్లు తమ వాటాలను విక్రయిస్తుండవచ్చు. వెల్త్‌ డైవర్సిఫికేషన్, కొత్త వెంచర్లకు నిధులను సమకూర్చుకోవడం, ఫ్యామిలీ లేదా ఎస్టేట్‌ ప్లానింగ్‌ కూడా కారణం కావచ్చు. ఇలాంటివేవీ కాకపోయి ఉంటే ప్రమోటర్ల విక్రయాలు కొన్ని సార్లు నిర్దిష్ట సంకేతాలు ఇస్తాయి. ర్యాలీ తర్వాత వేల్యుయేషన్‌ భారీ స్థాయికి చేరిపోయి ఉండొచ్చు. ఎరి్నంగ్స్, ఫండమెంటల్స్‌తో సంబంధం లేకుండా మిడ్, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ ట్రేడవుతూ ఉండొచ్చు. లేదా వ్యూహాత్మకంగా లాభాల స్వీకరణ కోసం కూడా ప్రమోటర్లు కొంత వాటాలు అమ్ముకోవచ్చు.  

గుర్తుంచుకోవాల్సినది.. 
ప్రమోటర్లు కొనడమనేది కంపెనీ సామర్థ్యాలకు సంబంధించి శక్తివంతమైన సంకేతమే. కానీ దీని వెనుక ఉద్దేశాలను బట్టి రిస్కులు ఉండొచ్చు. కొనుక్కోవడమనేది స్టాక్‌ పతనాన్ని అడ్డుకునేందుకు కావొచ్చు, వేల్యూ ట్రాప్‌ చేసేందుకు కావొచ్చు, ధీమా ముసుగు వేసి బలహీన ఫండమెంటల్స్‌ని అధిగమించేందుకు కావచ్చు.  ఇలా ఏదైనా కారణం కావచ్చు. కాబట్టి ప్రమోటర్లు కొనుగోళ్ల వ్యవహారాన్ని ఆర్థిక అంశాల విశ్లేషణ, క్యాష్‌ ఫ్లో, కార్పొరేట్‌ గవర్నెన్స్, తీసుకున్న రుణాలు.. తనఖా స్థాయులతో కలిపి అధ్యయనం చేస్తే అసలు విషయంపై మరికాస్త మెరుగైన అవగాహన ఏర్పడవచ్చు. 

ప్రమోటర్లు చాలా స్మార్ట్‌ ఇన్‌సైడర్స్‌. వారు తీసుకునే చర్యలనేవి నమ్మకాన్ని, వ్యూహాన్ని ప్రతిబింబిస్తాయి. వేల్యుయేషన్‌ని సూచిస్తాయి. అయితే, ఇన్‌సైడర్‌ సంకేతాలతో పాటు ఫండమెంటల్స్‌ పటిష్టంగా ఉన్నప్పుడే ప్రయోజనం చేకూరుతుంది. ఇలాంటి సందర్భాల్లో గందరగోళానికి లోను కాకుండా దీర్ఘకాలిక దృష్టి కోణంలో ఆలోచించాల్సి ఉంటుంది. ప్రమోటర్‌ సిగ్నల్‌ అనేది దిక్సూచి మాత్రమే తప్ప మ్యాప్‌ కాదు.

– సాక్షి వెల్త్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement