రాజుల గురించి, రాజకుటుంబాల గురించి చాలామంది పుస్తకాల్లో చదువుకుని ఉంటారు. భారతదేశంలో రాజరిక వ్యవస్థ అధికారికంగా అంతరించిపోయినప్పటికీ.. కొన్ని రాజ కుటుంబాలు మాత్రం తమ సంపదను కాపాడుకుంటూ.. కొత్త తరానికి అనుగుణంగా వ్యాపారాలను అభివృద్ధి చేస్తున్నాయి. అలాంటి కుటుంబాల్లో మేవార్ రాజ కుటుంబం ఒకటి.
ప్రస్తుతం ఈ కుటుంబం వివిధ వ్యాపారాలు చేస్తూ, పెట్టుబడులు పెడుతూ ముందుకు సాగుతోంది. వీరికి కూడా డబ్బు సమస్య ఉంటుంది. ఈ విషయాన్ని జాహ్నవి కుమారి మేవార్ వెల్లడించారు. ఈమె చదువుకునే రోజుల్లో పలు ఉద్యోగాలు కూడా చేసినట్లు చెప్పారు.
వ్యాపార జీవితానికి బలమైన పునాది
జాహ్నవి కుమారి చిన్నప్పటి నుంచే రాజభవన వాతావరణంలో పెరిగింది. ఇతర పిల్లల్లానే ఆమె కూడా సాధారణ బాల్యాన్ని అనుభవించినప్పటికీ, ఆమె చదువు రాజభవనం లోపలే తన బంధువులతో కలిసి సాగింది. చిన్న వయసులోనే ప్రముఖులు, విదేశీ అతిథులను కలవడం వల్ల ఆమెకు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, అనే నైపుణ్యాలు సహజంగానే వచ్చాయి. ఇవే తర్వాత ఆమె వ్యాపార జీవితానికి బలమైన పునాది అయ్యాయి.
ఆమె కుటుంబానికి రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, వినియోగ వస్తువులు, విద్య వంటి అనేక రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయి. చిన్నప్పటి నుంచే తండ్రి ఆఫీస్ పట్ల ఆమెకు ప్రత్యేక ఆసక్తి ఉండేది. తండ్రి కుర్చీలో కూర్చొని ఫైళ్లపై సంతకాలు చేయాలని పట్టుబడే ఆ చిన్నారి, తర్వాత నిజంగా కుటుంబ వ్యాపార బాధ్యతలను చేపట్టింది.
మూడు ఉద్యోగాలు చేస్తూ..
అయితే.. రాజ కుటుంబానికి చెందిన వారికి కూడా డబ్బు డబ్బు సమస్య ఉంటుందని జాహ్నవి స్పష్టం చేసింది. విదేశాల్లో చదువుతున్న సమయంలో ఆమెకు అవసరమైన ఖర్చులు మాత్రమే కుటుంబం భరించింది. అదనంగా.. ఆమె క్యాటరింగ్, క్లబ్ ప్రమోషన్, టెలిమార్కెటింగ్ వంటి మూడు ఉద్యోగాలు చేస్తూ చదువు కొనసాగించింది. దీని ద్వారా కష్టపడి సంపాదించే విలువ ఆమెకు అర్థమైంది.
తన ఇరవై ఏళ్ల ప్రారంభంలోనే.. జాహ్నవి కుటుంబ పెట్టుబడి వ్యవస్థను మార్చడం ప్రారంభించింది. పెట్టుబడుల్లో పారదర్శకత, బాధ్యత, దీర్ఘకాల లాభాలపై ఆమె ఎక్కువ దృష్టి పెట్టింది. ఆమె తీసుకున్న మొదటి నిర్ణయాల్లో ఒకటి.. కుటుంబంతో కలిసి పెట్టుబడులు పెట్టే బంధువులు, స్నేహితులు తమ ఖర్చులను తామే భరించాలి అనేది. మొదట ఆమె తండ్రి దీనికి వ్యతిరేకించినా, తర్వాత అదే నిర్ణయం కుటుంబ ఆర్థిక వ్యవస్థను మరింత క్రమబద్ధం చేసింది.
పెట్టుబడి విధానంలో మార్పు!
అంతేకాకుండా.. ఆమె పెట్టుబడి విధానాన్ని కూడా పూర్తిగా మార్చింది. మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. బ్యాంకర్లు, సలహాదారులు, అకౌంటెంట్లు వంటి మధ్యవర్తులు ఖర్చును పెంచుతారని, బాధ్యతను తగ్గిస్తారని ఆమె భావించింది. అందుకే ఆమె కుటుంబాన్ని ప్రపంచవ్యాప్తంగా కొత్త అవకాశాల వైపు మళ్లించింది, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లపై దృష్టి పెట్టింది.
ఒక యువతి, అది కూడా రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో, పెద్దవారి మధ్య తనను తాను నిరూపించుకోవడం ఆమెకు సులభం కాలేదు. చాలామంది ఆమె సామర్థ్యాన్ని అనుమానించారు. అయినప్పటికీ, ఆమె ధైర్యంగా ముందుకు సాగింది. ఆమె జీవితంలో మరో ముఖ్యమైన విషయం “సంపదను ముందుగా కాపాడుకోవాలి, తర్వాతే పెద్ద రిస్క్‌లు తీసుకోవాలి” అనే పాఠం. ఈ విషయాన్ని ఆమె కుటుంబానికి ఎన్నో సంవత్సరాలుగా సేవ చేసిన అనుభవజ్ఞులైన సలహాదారులు నేర్పారు. సంపదను కేవలం ఖర్చు చేయడం కాదు, దాన్ని తరతరాలకు నిలబెట్టడం ముఖ్యం అని అర్థం చేసుకుంది.
ఇదీ చదవండి: బంగారం కొనుగోలుపై.. 1967లో ఇదే జరిగిందా?


