భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు | Premium Petrol Price Up By Rs 2 Cost Of Normal Petrol Unchanged | Sakshi
Sakshi News home page

భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు

Mar 20 2026 3:14 PM | Updated on Mar 20 2026 4:19 PM

Premium Petrol Price Up By Rs 2 Cost Of Normal Petrol Unchanged

లీటరుకు రూ.2 మేర పెరిగిన ప్రీమియం పెట్రోల్

వచ్చే వారం తప్పని పెట్రోల్ మోత?

లీటరుకు రూ.3 నుంచి రూ.5 వరకు పెరిగే చాన్స్

పశ్చిమాసియా పరిస్థితులే ప్రధాన కారణం

డీజిల్‌పైనా వడ్డింపు తప్పదంటున్న చమురు సంస్థలు!

భారత్‌లో ప్రీమియం పెట్రోల్‌ ధరలు పెరిగాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) తన ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ .2 పెంచింది. సవరించిన రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీ ఈ పెంపు వెనుక ఎటువంటి కారణాన్ని పేర్కొననప్పటికీ, కొనసాగుతున్న ఇరాన్-యుఎస్ వివాదం మధ్య ప్రపంచ ముడి చమురు ధరలలో హెచ్చుతగ్గులు, లాజిస్టిక్స్ ఖర్చులలో మార్పులే ఈ నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు.

ఇక హైదరాబాద్‌లో ఈ ధరలు కనిష్ఠంగా రూ.2.26 మేర పెరిగినట్లు పెట్రోల్ డీలర్స్ చెబుతున్నారు. అయితే.. ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చు మేరకు ఒక్కో బంకులో ఒక్కోరకంగా ధరల్లో తేడాలు ఉండే అవకాశాలున్నాయని వివరిస్తున్నారు. అంటే.. అయిదు నుంచి పది పైసల మేర ఈ తేడా ఉంటుందని వెల్లడించారు.

సాధారణ పెట్రోల్ ధరలో మార్పు లేదు..
సాధారణ పెట్రోల్ వాడే సామాన్యులకు మాత్రం ఈ పెంపు నుంచి ఉపశమనం లభించింది. హెచ్‌పీసీఎల్ సాధారణ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అంతేకాకుండా, చమురు సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని సంస్థ స్పష్టం చేసింది. "అదనపు సరకు రవాణా ఇప్పటికే మార్గంలో ఉంది. రాబోయే రోజుల్లో దేశీయ సరఫరా మరింత బలోపేతం అవుతుంది. ప్రజలు పుకార్లను నమ్మవద్దు" అని హెచ్‌పీసీఎల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్‌' వేదికగా విజ్ఞప్తి చేసింది.

ఏమిటీ ప్రీమియం పెట్రోల్?
ప్రీమియం పెట్రోల్‌ను ‘హై-ఆక్టేన్ ఫ్యూయల్’ లేదా ‘పవర్ పెట్రోల్’ అని పిలుస్తారు. ఇది సాధారణంగా లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైక్‌లు, హై-పెర్ఫార్మెన్స్ ఇంజిన్లలో వాడతారు. ఇది ఇంజిన్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా, మైలేజీని కూడా పెంచుతుంది. ఈ ధరల పెంపు ప్రధానంగా లగ్జరీ వాహన యజమానులపై, సంపన్న వర్గాలపైనే ప్రభావం చూపనుంది.

డీజిల్‌ ధర కూడా పెంపు 
హెపీసీఎల్‌ను అనుసరిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) కూడా బల్క్ డీజిల్ ధరను లీటరుకు ఏకంగా లీటరుకు రూ.22 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు రూ.87.57 గా ఉన్న లీటరు డీజిల్ ధర..  తాజా రేట్ల పెంపుతో రూ.109.59కి చేరుకుంది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో లభించే డీజిల్ ధరలపై ప్రస్తుతం పెద్దగా ప్రభావం లేనప్పటికీ.. నేరుగా కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ కొనే పారిశ్రామిక వినియోగదారులకు షాక్ తగిలింది.

రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం
బల్క్ డీజిల్ ధరల పెరుగుదల ప్రధానంగా తయారీ రంగం, భారీ పరిశ్రమలు, లాజిస్టిక్స్ విభాగాలపై తీవ్రంగా ప్రభావం చూపనుంది. సిమెంట్, ఉక్కు కర్మాగారాలు, భారీ యంత్రాలను నడిపే పరిశ్రమలకు డీజిల్ వినియోగం అధికంగా ఉంటుంది. ఇది లీటరుకు రూ.22 పెరగడం వల్ల వారి ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతుంది. అలాగే నేరుగా కంపెనీల నుంచి డీజిల్ కొనే భారతీయ రైల్వే, రాష్ట్ర రవాణా సంస్థలు,  ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపు వల్ల రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి దారితీయవచ్చు.

వచ్చేవారం పెట్రోల్ మోత?
పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్నా.. చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతున్నా.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సామాన్యులపై పెట్రోల్ భారం వేయలేదు. దేశంలో 60 రోజులకు సరిపడా వ్యూహాత్మక నిల్వలు ఉన్నప్పటికీ.. వచ్చేవారం నుంచి పెట్రోల్ మోతకు చమురు సంస్థలు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఆ మేరకు పెట్రోల్, డీజిల్‌పై రూ.3 నుంచి రూ.5 మేర అదనపు భారం మోపే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలిపాయి.

ఇదీ చదవండి: అతి భారీగా తగ్గిన బంగారం.. అంతలోనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement