భారత్‌లో మరింత ఇన్వెస్ట్‌ చేయండి

PM Narendra Modi chairs Business Roundtable in Tokyo - Sakshi

జపాన్‌ వ్యాపారవేత్తలకు ప్రధాని మోదీ ఆహ్వానం

‘జపాన్‌ వారోత్సవాల’ నిర్వహణకు పిలుపు

టోక్యో: అపార వ్యాపార అవకాశాలు ఉన్న భారత్‌లో మరింతగా ఇన్వెస్ట్‌ చేయాలంటూ జపాన్‌ కార్పొరేట్లను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో జపాన్‌ది చాలా కీలకపాత్ర అని ఆయన పేర్కొన్నారు. దీన్ని పురస్కరించుకుని ’జపాన్‌ వారోత్సవాల’ను నిర్వహించడంపై ప్రధాని ప్రతిపాదన చేశారు. జపాన్‌ పర్యటనలో భాగంగా వ్యాపార దిగ్గజాలతో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు.

34 సంస్థల సీఈవోలు, టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు దీనికి హాజరయ్యారు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఉక్కు, టెక్నాలజీ, ట్రేడింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్‌ తదితర రంగాల కంపెనీల ప్రతినిధులు వీరిలో ఉన్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. జపాన్‌ కంపెనీలు భారత్‌లో మరింతగా ఇన్వెస్ట్‌ చేయాలని మోదీ ఈ సందర్భంగా ఆహ్వానించినట్లు వివరించింది. ‘టాప్‌ వ్యాపార సంస్థల సీఈవోలతో భేటీ అయ్యాను.

భారత్‌లో పుష్కలంగా ఉన్న పెట్టుబడి అవకాశాల గురించి వివరించాను‘ అని ప్రధాని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. హోండా, సుజుకీ, టయోటా వంటి ఆటోమొబైల్‌ సంస్థలు, సుమిటోమో కెమికల్, ఫ్యుజిత్సు, నిప్పన్‌ స్టీల్‌ కార్పొరేషన్, మిత్సుబిషి కార్పొరేషన్‌ తదితర సంస్థల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. చాలామటుకు కంపెనీలకు భారత్‌లో పెట్టుబడులు, కార్యకలాపాలు ఉన్నాయి.

రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు..
భారత్, జపాన్‌ సహజమైన భాగస్వాములని సమావేశం సందర్భంగా ప్రధాని చెప్పారు. భారత్‌–జపాన్‌ సంబంధాలు బలోపేతం అయ్యేందుకు వ్యాపార వర్గాలు బ్రాండ్‌ అంబాసిడర్ల పాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశంసించారు. గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) అంతర్జాతీయంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) మందగించినా, భారత్‌లోకి రికార్డు స్థాయిలో 84 బిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా  చెప్పారు.

భారత ఆర్థిక వృద్ధి సత్తాపై ఇన్వెస్టర్లకు ఉన్న ధీమాకు ఇది నిదర్శనమని ఆయన తెలిపారు. ఈ ఏడాది మార్చిలో జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడా భారత పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక పెట్టుబడులను వచ్చే అయిదేళ్లలో 5 లక్షల కోట్ల ఎన్ల స్థాయికి పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయని ప్రధాని చెప్పారు. ఇటీవలి కాలంలో ఇండియా–జపాన్‌ ఇండస్ట్రియల్‌ కాంపిటీటివ్‌నెస్‌ పార్ట్‌నర్‌షిప్‌ (ఐజేఐసీపీ), క్లీన్‌ ఎనర్జీ పార్ట్‌నర్‌షిప్‌ మొదలైన ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top