
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలతో ప్రభావితమయ్యే ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌ల (ఏఐఎఫ్) నుంచి పెట్టుబడులను సజావుగా రాబట్టుకోగలమని పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ (పీఈఎల్) ధీమా వ్యక్తం చేసింది. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి ఏఐఎఫ్ యూనిట్లలో పీఈఎల్, పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్‌కు రూ. 3,817 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి.
ఇందులో రుణగ్రస్త కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయని మొత్తం .. రూ. 653 కోట్లుగా ఉంది. మిగతా రూ. 3,164 కోట్లలో రూ. 1,737 కోట్ల నిధులను గత 12 నెలల వ్యవధిలో మూడు రుణగ్రస్త కంపెనీల్లో ఏఐఎఫ్‌లు ఇన్వెస్ట్ చేశాయి. అయితే, నిబంధనలకు అనుగుణంగా మొత్తం రూ. 3,164 కోట్లకు పీఈఎల్ ప్రొవిజనింగ్ చేయొచ్చని, ఫలితంగా 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,200 కోట్ల మేర నష్టాలను చూపించే అవకాశం ఉందని బ్రోకరేజి సంస్థ ఎమ్‌కే ఒక నివేదికలో తెలిపింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు తమ దగ్గర రుణాలు తీసుకున్న సంస్థల్లో ఏఐఎఫ్‌ల ద్వారా ఇన్వెస్ట్ చేయరాదని, ఒకవేళ చేసి ఉంటే నెలరోజుల్లోగా వాటిని ఉపసంహరించుకోవాలని లేదా ఆ మొత్తానికి ప్రొవిజనింగ్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే.