మర్చంట్‌ చెల్లింపుల్లో పేటీఎం ఫస్ట్‌ | Paytm is dominant leader in Indian merchant payments | Sakshi
Sakshi News home page

మర్చంట్‌ చెల్లింపుల్లో పేటీఎం ఫస్ట్‌

Mar 29 2026 4:56 AM | Updated on Mar 29 2026 4:56 AM

Paytm is dominant leader in Indian merchant payments

న్యూఢిల్లీ: మర్చంట్‌ చెల్లింపుల్లో పేటీఎం ప్లాట్‌ఫామ్‌ దూసుకుపోతోంది. వచ్చే రెండేళ్లలో కంపెనీ వ్యాపార వృద్ధిలో ఈ విభాగం కీలకంగా ఉంటుందని బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ పేర్కొంది. కంపెనీకి ‘బై’ (కొనుగోలు) రేటింగ్‌ ఇస్తూ రూ.1,350 లక్ష్యాన్ని ప్రకటించింది. 2025–26 నుంచి 2027–28 మధ్య కాలంలో కంపెనీ ఆదాయం ఏటా 22 % చొప్పున వృద్ధి చెందుతుందని (సీఏజీఆర్‌) అంచనా వేసింది. ఈ కాలంలో ఎబిట్డా మార్జిన్లు పెరుగుతాయని పేర్కొంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో మర్చంట్‌ చెల్లింపుల్లో అతిపెద్ద సంస్థగా పేటీఎం ఎదుగుతున్నట్టు వివరించింది.

అధిక చెల్లింపుల లావాదేవీలతోపాటు, వేగంగా రుణా ల మంజూరును ప్రస్తావించింది. పేటీఎం ప్లాట్‌ఫామ్‌పై 4.5 కోట్ల వర్తకులు ఉన్నారని, డివైజ్‌ సబ్‌స్క్రిప్షన్‌ పెరుగుతున్న కొద్దీ పేటీఎం ఆదాయాలు మెరుగుపడనున్నట్టు జెఫరీస్‌ తన నివేదికలో పేర్కొంది. చెల్లింపుల గ్రాస్‌ మర్చండైజ్‌ వ్యాల్యూ (జీఎంవీ) ఏటా 23% చొప్పున పెరుగుతూ 2028 మార్చి నాటికి రూ.35 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. 2026 మార్చి నాటికి ఇది రూ.24 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంది. పేటీఎం మర్చంట్‌ లెండింగ్‌ (వర్తకులకు రుణాల మంజూరు) అన్నది రిటైల్‌ రుణాలను మించినట్టు తెలిపింది.

యూపీఐ ద్వారా రుణ వితరణకు ఉన్న దీర్ఘకాల వృద్ధి అవకాశాలనూ ప్రస్తావించింది. ఆర్థిక సేవల ఆదాయం ఏటా 28 శాతం చొప్పున పెరుగుతూ 2028 మార్చి నాటికి రూ.12,500 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. 2028 మార్చి నాటికి రూ.1,700 కోట్ల నికర లాభాన్ని పేటీఎం ప్రకటించొచ్చని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.574 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది.   

Advertisement
 
Advertisement
Advertisement