జైపూర్కు చెందిన రాహుల్ తనేజా అనే వ్యాపారవేత్త తన కొడుకు కొత్త లగ్జరీ కారు కోసం ప్రత్యేక వీఐపీ రిజిస్ట్రేషన్ నంబర్ కొనుగోలు చేసి సంచలనం సృష్టించారు. ఆయన ఆడి ఆర్ఎస్క్యూ8 కారుకు RJ 60 CM 0001 అనే నంబర్ ప్లేట్ కోసం సుమారు రూ.31 లక్షలు వెచ్చించారు. జైపూర్ రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ నిర్వహించిన పోటీ వేలంలో ఈ నంబర్‌ను గెలుచుకున్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇది రాజస్థాన్‌లో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నంబర్‌గా నిలిచింది.
వ్యాపారవేత్తలు ఖరీదైన వీఐపీ నంబర్లు కొనుగోలు చేయడం కొత్త విషయమేమీ కాదు. కానీ రాహుల్ తనేజా కథ నిజంగా స్ఫూర్తిదాయకం. మధ్యప్రదేశ్‌లోని మండ్లా జిల్లాలోని కత్రా గ్రామంలో జన్మించిన ఆయన చిన్ననాటి జీవితం చాలా కష్టాల మధ్య సాగింది. తండ్రి సైకిళ్లకు పంక్చర్‌లు వేసేవారు. తల్లి పొలాల్లో పని చేసేది. 11 ఏళ్ల వయసులోనే రాహుల్ జైపూర్‌లోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఓ ధాబాలో వెయిటర్‌గా పని చేశాడు.
తర్వాత రెండేళ్ల పాటు టీ, స్నాక్స్ వడ్డిస్తూ కుటుంబాన్ని పోషించాడు. అనంతరం వీధి వ్యాపారిగా మారి, దీపావళి సమయంలో బాణసంచా, హోలీకి రంగులు, సంక్రాంతికి గాలిపటాలు అమ్మేవాడు. వేసవి సెలవుల సమయంలో ఇంటింటికీ తిరిగి న్యూస్ పేపర్లు వేయడం, గోడలపై పోస్టర్లు అంటించడం వంటి చిన్నచిన్న పనులు ఎన్నో చేసాడు. 16 ఏళ్ల వయసులో రాత్రి 9 గంటల నుంచి అర్థరాత్రి వరకు దుర్గాపురా రైల్వే స్టేషన్ వద్ద ఆటో నడిపేవాడు.
ఇలా పొదుపు చేసుకున్న డబ్బుతో 19 సంవత్సరాల వయసులోనే జైపూర్‌లోని సింధీ కాలనీలో ‘కార్ ప్యాలెస్’ అనే చిన్న కార్ డీలర్‌షిప్ ప్రారంభించాడు. అదే సమయంలో ఆయన మోడలింగ్‌లో అడుగుపెట్టి, మిస్టర్ జైపూర్, మిస్టర్ రాజస్థాన్, మేల్ ఆఫ్ ది ఇయర్ 1999 వంటి టైటిల్స్ గెలుచుకున్నాడు. అయితే ఎప్పుడూ వ్యాపార దృష్టి ఉండే రాహుల్, 2000లో లైవ్ క్రియేషన్స్ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని స్థాపించాడు. 2005లో ఇండియన్ ఆర్టిస్ట్ డాట్‌కామ్ అనే ఆర్టిస్ట్ మేనేజ్‌మెంట్ సంస్థను ప్రారంభించి, తరువాత రాహుల్ తనేజా ప్రీమియం వెడ్డింగ్స్ పేరుతో లగ్జరీ వెడ్డింగ్ ప్లానింగ్‌లోకి ప్రవేశించాడు.
రాహుల్ తనేజా ఖరీదైన వీఐపీ నంబర్ ప్లేట్‌లు కొనుగోలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా రూ.10 లక్షలు, రూ.16 లక్షలు పెట్టి నంబర్ ప్లేట్‌లు కొనుగోలు చేశారు. ఇప్పుడు, తన కుమారుడు రెహాన్ 18వ పుట్టినరోజు సందర్భంగా ఆడి ఆర్ఎస్క్యూ8 కారును బహుమతిగా కొనిచ్చారు. అలాగే దానికి రూ.31 లక్షలు పెట్టి నంబర్ ప్లేట్ కొనిచ్చారు. ఎందుకింత ఖరీదైన నంబర్ కొనడం అంటే తన కొడుక్కి కార్లు, నంబర్లంటే ఇష్టమని, తన కొడుకు ఆనందమే తన ఆనందమని బదులిస్తున్నారు.


