అమెరికాలో పనిచేస్తున్న భారతీయ మహిళ శారికా యాదవ్.. షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె భారతదేశం vs అమెరికా కార్పొరేట్ పని సంస్కృతుల మధ్య ఉన్న తేడాలను వివరించింది.
అమెరికాలో పనిచేసే ఉద్యోగులు తమ పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడం, తీసుకురావడం, డాక్టర్ అపాయింట్‌మెంట్లు వంటి వ్యక్తిగత పనుల కోసం.. ముందుగానే తమ ఆఫీస్ క్యాలెండర్‌లో సమయం బ్లాక్ చేసుకుంటారు. ఆ సమయంలో ఇతరులు మీటింగ్స్ పెట్టకుండా గౌరవిస్తారు. ఒకవేళ మీటింగ్ అవసరం వచ్చినా, ముందుగా ఉద్యోగిని అడిగి సమయం ఖరారు చేస్తారు. అక్కడ ఉద్యోగుల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించడం కంపెనీల పని సంస్కృతిలో భాగంగా మారిందని శారికా యాదవ్ పేర్కొన్నారు.
భారతదేశంలో పరిస్థితి భిన్నంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక్కడ సెలవు తీసుకోవాలంటే.. ఉద్యోగులు మేనేజర్లకు పూర్తి వివరణ ఇవ్వాల్సి వస్తుందని పేర్కొన్నారు. అనేక కంపెనీల్లో ఉద్యోగులపై పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, వ్యక్తిగత అవసరాలకు తగిన ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. చాలా మంది తమ అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. కొందరు అమెరికా వర్క్ కల్చర్‌లో వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని అంగీకరించగా, మరికొందరు ప్రతి దేశానికి ప్రత్యేకమైన పని విధానం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇంకొందరు భారతదేశంలో ఉద్యోగులపై ఉండే ఒత్తిడి కారణంగా చాలామంది స్వంత వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారని అభిప్రాయపడ్డారు.


