
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 'నో హెల్మెట్, నో ఫ్యూయెల్' విధానాన్ని గత నెలలో అమలు చేసింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం 'నో పీయూసీ, నో ఫ్యూయెల్' విధానానికి శ్రీకారం చుట్టింది. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే.. వాహనాలకు ఇంధనం నింపకూడదని కఠిన ఆంక్షలు పెట్టింది.
భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడానికి, ప్రస్తుత తరం కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. కాలుష్యాన్ని నియంత్రించే ప్రయత్నాలను బలహీనపరిచే అక్రమ పీయూసీ సర్టిఫికెట్లను ఆపాల్సిన అవసరాన్ని గురించి మహారాష్ట్ర రవాణా మంత్రి 'ప్రతాప్ సర్నాయక్' తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
ఈ కొత్త విధానం ప్రకారం.. ప్రతి వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను పెట్రోల్ పంపులలోని సీసీటీవీ కెమెరాల ద్వారా స్కాన్ చేసి, దాని పీయూసీ సర్టిఫికేట్ చెల్లుబాటును ధృవీకరిస్తారు. చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ లేకుండా దొరికిన వాహనాలకు ఇంధనం నింపరు. అంతే కాకుండా ఈ పీయూసీ సర్టిఫికేట్‌లను అక్కడిక్కడే జారీ చేయడానికి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. అక్రమ సర్టిఫికెట్ జారీ చేసే ముఠాలను లక్ష్యంగా చేసుకుని రవాణా శాఖ ఈ ప్రచారం ప్రారంభించింది.
ఇదీ చదవండి: దేశంలో అతిపెద్ద డీల్!.. రూ.3472 కోట్లు వెచ్చించిన ఆర్‌బీఐ
భారతదేశంలో కొత్త కారు లేదా బైక్ యజమానులకు కొనుగోలు తేదీ నుంచి కనీసం ఒక సంవత్సరం పాటు పీయూసీ సర్టిఫికేట్ అవసరం లేదు. అంతే కాకుండా బీఎస్3 వాహనాలకు ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే పీయూసీ సర్టిఫికేట్ లభిస్తుంది. బీఎస్4, బీఎస్6 మోడళ్లకు పూర్తి సంవత్సరం పాటు చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ జారీ చేస్తారు.