
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా పెద ప్రజలకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో భాగంగా అందిస్తున్న ఉచిత రేషన్ అందించే కార్యక్రమాన్ని ఈ నెల 30 తర్వాత పొడిగించే ప్రతిపాదనేది లేదని కేంద్ర ప్రభుత్వ ఆహార, ప్రజాపంపిణీ విభాగం కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం వల్ల ప్రతిపాదన చేయలేదని ఆయన వెల్లడించారు. గతేడాది కోవిడ్-19 వల్ల విధించిన లాక్డౌన్ దృష్ట్యా పెదప్రజలకు ఉచితంగా రేషన్ అందించడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(పీఎంజీకెఏవై)ని మార్చి 2020లో ప్రకటించారు.
2020 ఏప్రిల్‌లో ఈ పథకం మొదలైంది. కరోనా సెకండ్ వేవ్‌లో ఈ ఏడాది మే, జూన్ వరకు అమలు చేశారు. ఆ తర్వాత కరోనా పరిస్థితుల వల్ల పేదలు ఇబ్బంది పడకుండా.. జూన్‌లో మరో ఐదు నెలలు( 2021 నవంబర్ 30 వరకు) పొడిగించారు. "ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, ఆహార ధాన్యాల ఒఎమ్ఎస్ఎస్(ఓపెన్ మార్కెట్ అమ్మకపు పథకం) డిస్పోజల్ కూడా ఈ సంవత్సరం మంచిగా ఉంది. కాబట్టి, పీఎంజీకెఏవైని పొడిగించే ప్రతిపాదన లేదు" అని సుధాన్షు పాండే విలేకరులకు విలేకరులకు తెలిపారు. దేశవ్యాప్తంగా జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ) కింద గుర్తించిన 80 కోట్ల రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ సరఫరా చేస్తుంది.
(చదవండి: సామాన్యులకు శుభవార్త, వంటనూనె ధరల్ని తగ్గించిన కేంద్రం!)