
ప్రపంచ స్థాయి రసాయన హబ్‌లు నెలకొల్పాలి
8 పోర్ట్–ఇన్‌ఫ్రా క్లస్టర్లు ఏర్పాటు చేయాలి
అప్పుడే అగ్రగామిగా ఎదుగుతాం నీతి ఆయోగ్ నివేదిక
న్యూఢిల్లీ: దేశీయంగా ప్రపంచ స్థాయి కెమికల్ హబ్స్‌ను నెలకొల్పడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్ ఒక నివేదికలో సూచించింది. అలాగే అత్యధిక సామర్థ్యాలుండే ఎనిమిది పోర్ట్–ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అప్పుడే గ్లోబల్ కెమికల్ తయారీ దిగ్గజంగా భారత్ ఎదగగలదని పేర్కొంది.
‘‘రసాయనాల పరిశ్రమ: అంతర్జాతీయ వేల్యూ చెయిన్‌లో (జీవీసీ) భారత భాగస్వామ్యానికి దన్ను’’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వివరించింది. 2040 నాటికి భారత్ 1 లక్ష కోట్ల డాలర్ల రసాయనాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది.
నివేదిక ప్రకారం.. 2023లో జీవీసీలో 3.5 శాతంగా ఉన్న భారత్ వాటా 2040 నాటికి 5–6 శాతానికి పెరగనుందని, 2030 నాటికి అదనంగా 7 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని వివరించింది. గ్లోబల్ కెమికల్ వేల్యూ చెయిన్‌లో భారత్ వాటా 3.5 శాతమే ఉండటం, 2023లో రసాయనాల వాణిజ్య లోటు 31 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండటమనేది ముడి సరుకు, ఇతరత్రా స్పెషాలిటీ రసాయనాల కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తున్న విషయాన్ని తెలియజేస్తోందని రిపోర్ట్ పేర్కొంది.
నివేదికలోని మరిన్ని విశేషాలు..
→ సమగ్ర ఆర్థిక, ఆర్థికేతర సంస్కరణలు అమలు చేస్తే భారత రసాయనాల పరిశ్రమ 2040 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరేందుకు, జీవీసీలో వాటాను 12 శాతానికి పెంచుకునేందుకు దోహదపడుతుంది. తద్వారా శక్తివంతమైన గ్లోబల్ కెమికల్ కేంద్రంగా భారత్ ఎదగవచ్చు.
→ కేంద్ర స్థాయిలో ఒక సాధికారిక కమిటీని వేయాలి. ఉమ్మడిగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, వీజీఎఫ్ మొదలైన వాటి కోసం బడ్జెట్ కేటాయింపులతో సాధికారిక కమిటీ కింద కెమికల్ ఫండ్ ఏర్పాటు చేయాలి. హబ్ స్థాయిలోని అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగం, మొత్తం హబ్ నిర్వహణను పర్యవేక్షించాలి.
→ పోర్టుల్లో రసాయనాల ట్రేడింగ్‌కు సవాలుగా ఉంటున్న మౌలిక సదుపాయాల అంతరాలను పరిష్కరించడంలో పోర్టులకు తగు సూచనలివ్వగలిగేలా కెమికల్ కమిటీ కూర్పు ఉండాలి. అత్యధిక సామర్థ్యాలున్న 8 పోర్ట్ క్లస్టర్స్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
→ దిగుమతులు, ఎగుమతి సామర్థ్యాలు, సోర్సింగ్ కోసం ఒకే దేశంపై ఆధారపడటం, మార్కెట్ ప్రాధాన్యత తదితర అంశాల ఆధారంగా అదనంగా రసాయనాలను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలివ్వాలి.
→ పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండేలా పర్యావరణ అనుమతుల (ఈసీ) ప్రక్రియను వేగవంతం చేయాలి. కాల పరిమితులు, నిబంధనల అమలును పర్యవేక్షించేలా పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం డీపీఐఐటీ కింద ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఈసీ క్లియరెన్స్ ప్రక్రియలను సరళతరం, వేగవంతం చేయాలి. తరచుగా నివేదికలను ప్రచురించాలి. ఈఏసీకి మరింత స్వయం ప్రతిపత్తినివ్వాలి.
→ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో (ఎఫ్‌టీఏ) రసాయనాల పరిశ్రమ కోసం నిర్దిష్ట నిబంధనలను చేర్చేలా భారత్ చర్చలు జరపవచ్చు. పరిశ్రమ ప్రయోజనాలను పరిరక్షించేలా టారిఫ్ కోటాలు లేదా కీలకమైన ముడిసరుకు, పెట్రోకెమికల్ ఫీడ్‌స్టాక్‌లపై సుంకాలపరంగా మినహాయింపులులాంటివి చేర్చే అవకాశాలను పరిశీలించవచ్చు.
→ అంతర్జాతీయంగా పోటీపడటంలో భారత రసాయన రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఫీడ్‌స్టాక్ కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం పెద్ద సవాలుగా ఉంటోంది. ఫలితంగా 2023లో 31 బిలియన్ డాలర్ల మేర వాణిజ్య లోటు నమోదైంది.
→ అంతర్జాతీయంగా పోటీ సంస్థలతో పోల్చి చూసినప్పుడు మౌలిక సదుపాయాల్లో అంతరాలు, కాలం చెల్లిన పారిశ్రామిక క్లస్టర్లు, భారీ స్థాయి లాజిస్టిక్స్ వ్యయాలు మొదలైనవి దేశీ సంస్థలకు ప్రతికూలంగా ఉంటున్నాయి.
→ దీనికి తోడు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై భారత్ పెట్టే పెట్టుబడులు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. అంతర్జాతీయంగా ఇది సగటున 2.3 శాతంగా ఉండగా, భారత్‌లో 0.7 శాతంగానే ఉంది. అత్యంత విలువైన రసాయనాలను దేశీయంగా ఆవిష్కరించడానికి ఇది ఆటంకంగా ఉంటోంది.
→ నియంత్రణ సంస్థలపరమైన జాప్యాలు, ముఖ్యంగా పర్యావరణ అనుమతులపరంగా నెలకొన్న సవాళ్లు, పరిస్థితులకు తగ్గట్లు పరిశ్రమ ఎదగడంలో అవరోధాలుగా ఉంటున్నాయి.
→ పరిశ్రమలో నైపుణ్యాలున్న ప్రొఫెషనల్స్ కొరత 30 శాతం మేర ఉంది. ముఖ్యంగా గ్రీన్ కెమిస్ట్రీ, నానోటెక్నాలజీ, ప్రాసెస్ సేఫ్టీ లాంటి కొత్త విభాగాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంది.
→ ప్రస్తుత సవాళ్లను పరిష్కరించి, ప్రతిపాదిత సంస్కరణలను అమలు చేస్తే, భారత్ అంతర్జాతీయంగా పోటీ పడే సామర్థ్యాలను పెంచుకోవచ్చు. పెట్టుబడులను ఆకర్షించవచ్చు. గ్లోబల్ వేల్యూ చెయిన్‌కి సారథ్యం వహించేలా రసాయనాల రంగాన్ని పటిష్టంగా తీర్చిదిద్దుకోవచ్చు.