breaking news
chemical materials
-
కెమికల్స్ దిగ్గజంగా భారత్!!
న్యూఢిల్లీ: దేశీయంగా ప్రపంచ స్థాయి కెమికల్ హబ్స్‌ను నెలకొల్పడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్ ఒక నివేదికలో సూచించింది. అలాగే అత్యధిక సామర్థ్యాలుండే ఎనిమిది పోర్ట్–ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అప్పుడే గ్లోబల్ కెమికల్ తయారీ దిగ్గజంగా భారత్ ఎదగగలదని పేర్కొంది. ‘‘రసాయనాల పరిశ్రమ: అంతర్జాతీయ వేల్యూ చెయిన్‌లో (జీవీసీ) భారత భాగస్వామ్యానికి దన్ను’’ పేరిట రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వివరించింది. 2040 నాటికి భారత్ 1 లక్ష కోట్ల డాలర్ల రసాయనాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. నివేదిక ప్రకారం.. 2023లో జీవీసీలో 3.5 శాతంగా ఉన్న భారత్ వాటా 2040 నాటికి 5–6 శాతానికి పెరగనుందని, 2030 నాటికి అదనంగా 7 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని వివరించింది. గ్లోబల్ కెమికల్ వేల్యూ చెయిన్‌లో భారత్ వాటా 3.5 శాతమే ఉండటం, 2023లో రసాయనాల వాణిజ్య లోటు 31 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండటమనేది ముడి సరుకు, ఇతరత్రా స్పెషాలిటీ రసాయనాల కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తున్న విషయాన్ని తెలియజేస్తోందని రిపోర్ట్ పేర్కొంది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → సమగ్ర ఆర్థిక, ఆర్థికేతర సంస్కరణలు అమలు చేస్తే భారత రసాయనాల పరిశ్రమ 2040 నాటికి 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరేందుకు, జీవీసీలో వాటాను 12 శాతానికి పెంచుకునేందుకు దోహదపడుతుంది. తద్వారా శక్తివంతమైన గ్లోబల్ కెమికల్ కేంద్రంగా భారత్ ఎదగవచ్చు. → కేంద్ర స్థాయిలో ఒక సాధికారిక కమిటీని వేయాలి. ఉమ్మడిగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, వీజీఎఫ్ మొదలైన వాటి కోసం బడ్జెట్ కేటాయింపులతో సాధికారిక కమిటీ కింద కెమికల్ ఫండ్ ఏర్పాటు చేయాలి. హబ్ స్థాయిలోని అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగం, మొత్తం హబ్ నిర్వహణను పర్యవేక్షించాలి. → పోర్టుల్లో రసాయనాల ట్రేడింగ్‌కు సవాలుగా ఉంటున్న మౌలిక సదుపాయాల అంతరాలను పరిష్కరించడంలో పోర్టులకు తగు సూచనలివ్వగలిగేలా కెమికల్ కమిటీ కూర్పు ఉండాలి. అత్యధిక సామర్థ్యాలున్న 8 పోర్ట్ క్లస్టర్స్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. → దిగుమతులు, ఎగుమతి సామర్థ్యాలు, సోర్సింగ్ కోసం ఒకే దేశంపై ఆధారపడటం, మార్కెట్ ప్రాధాన్యత తదితర అంశాల ఆధారంగా అదనంగా రసాయనాలను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలివ్వాలి. → పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండేలా పర్యావరణ అనుమతుల (ఈసీ) ప్రక్రియను వేగవంతం చేయాలి. కాల పరిమితులు, నిబంధనల అమలును పర్యవేక్షించేలా పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం డీపీఐఐటీ కింద ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ఈసీ క్లియరెన్స్ ప్రక్రియలను సరళతరం, వేగవంతం చేయాలి. తరచుగా నివేదికలను ప్రచురించాలి. ఈఏసీకి మరింత స్వయం ప్రతిపత్తినివ్వాలి. → స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో (ఎఫ్‌టీఏ) రసాయనాల పరిశ్రమ కోసం నిర్దిష్ట నిబంధనలను చేర్చేలా భారత్ చర్చలు జరపవచ్చు. పరిశ్రమ ప్రయోజనాలను పరిరక్షించేలా టారిఫ్ కోటాలు లేదా కీలకమైన ముడిసరుకు, పెట్రోకెమికల్ ఫీడ్‌స్టాక్‌లపై సుంకాలపరంగా మినహాయింపులులాంటివి చేర్చే అవకాశాలను పరిశీలించవచ్చు. → అంతర్జాతీయంగా పోటీపడటంలో భారత రసాయన రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఫీడ్‌స్టాక్ కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం పెద్ద సవాలుగా ఉంటోంది. ఫలితంగా 2023లో 31 బిలియన్ డాలర్ల మేర వాణిజ్య లోటు నమోదైంది. → అంతర్జాతీయంగా పోటీ సంస్థలతో పోల్చి చూసినప్పుడు మౌలిక సదుపాయాల్లో అంతరాలు, కాలం చెల్లిన పారిశ్రామిక క్లస్టర్లు, భారీ స్థాయి లాజిస్టిక్స్ వ్యయాలు మొదలైనవి దేశీ సంస్థలకు ప్రతికూలంగా ఉంటున్నాయి. → దీనికి తోడు పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై భారత్ పెట్టే పెట్టుబడులు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. అంతర్జాతీయంగా ఇది సగటున 2.3 శాతంగా ఉండగా, భారత్‌లో 0.7 శాతంగానే ఉంది. అత్యంత విలువైన రసాయనాలను దేశీయంగా ఆవిష్కరించడానికి ఇది ఆటంకంగా ఉంటోంది. → నియంత్రణ సంస్థలపరమైన జాప్యాలు, ముఖ్యంగా పర్యావరణ అనుమతులపరంగా నెలకొన్న సవాళ్లు, పరిస్థితులకు తగ్గట్లు పరిశ్రమ ఎదగడంలో అవరోధాలుగా ఉంటున్నాయి. → పరిశ్రమలో నైపుణ్యాలున్న ప్రొఫెషనల్స్ కొరత 30 శాతం మేర ఉంది. ముఖ్యంగా గ్రీన్ కెమిస్ట్రీ, నానోటెక్నాలజీ, ప్రాసెస్ సేఫ్టీ లాంటి కొత్త విభాగాల్లో ఇది మరింత తీవ్రంగా ఉంది. → ప్రస్తుత సవాళ్లను పరిష్కరించి, ప్రతిపాదిత సంస్కరణలను అమలు చేస్తే, భారత్ అంతర్జాతీయంగా పోటీ పడే సామర్థ్యాలను పెంచుకోవచ్చు. పెట్టుబడులను ఆకర్షించవచ్చు. గ్లోబల్ వేల్యూ చెయిన్‌కి సారథ్యం వహించేలా రసాయనాల రంగాన్ని పటిష్టంగా తీర్చిదిద్దుకోవచ్చు. -
రసాయనాలు పేలి ఇద్దరి దుర్మరణం
⇒ మరొకరికి తీవ్రగాయాలు, పరిస్థితి విషమం ⇒ పేలుడు ధాటికి చెల్లాచెదురైన శరీర భాగాలు ⇒ బద్దలైన గోడలు.. తలుపులు, కిటికీలు కరీంనగర్: కరీంనగర్ హౌసింగ్ బోర్డులోని ఓ ఇంట్లో శనివారం రాత్రి రసాయన పదార్థాలు పేలడంతో ఇద్దరు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా వెలుగోడు మండలానికి చెందిన పెంటెం నాగార్జున కుమార్(35), పెంటం శ్రీనివాస్ కుమార్(34), మల్ల రామ క్రిష్టరెడ్డి(42) హౌసింగ్‌బోర్డులోని ఎంఐజీ 2/336 ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వీరు వివిధ రసాయన పదార్థాలతో బొమ్మలు తయారు చేస్తూ నగరంలో సరయు మార్కెటింగ్ గిఫ్ట్ అర్టికల్స్‌ను నిర్వహించడంతో పాటు ఇతర దుకాణాలకు బొమ్మలను సరఫరా చేస్తున్నారు. వీరు వినియోగించే రసాయన పదార్థాల్లో కోబాల్డ్, హార్డినర్లకు పేలే స్వభావం ఉంది. శనివారం ఎప్పటిలాగే బొమ్మలు తయారు చేయగా.. మిగిలిన పదార్ధాలను ఇంటి సమీపంలో పారేశారు. అక్కడ మధ్యాహ్నం సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, త్రీ టౌన్ పోలీసులు వచ్చి పరిశీలించారు. ఇంట్లో పేలుడు పదార్థాలున్నాయనే అను మానంతో పలుచోట్ల తవ్వి చూశారు. సదరు వ్యక్తులను విచారించారు. వారి మాటలను పోలీసులు నమ్మకపోవడంతో వారి ముందు బొమ్మలు చేసి చూపించారు. దీంతో పోలీసులు వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా, ఇంట్లో పది లీటర్ల క్యాన్‌లో ఉన్న హార్డినర్ ఎక్స్‌పెయిరీ డేట్ ముగిసిందని ఆదివారం రాత్రి గమనించిన శ్రీనివాస్, నాగార్జునలు సంబంధిత కంపెనీకి ఫోన్ చేసి చెప్పారు. అది పేలుడు స్వభావం కలదని, దానిని నీటిలో కలిపి దూరంగా పారబోయాలని కంపెనీ ప్రతినిధి తెలిపినట్టు సమాచారం. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో శ్రీనివాస్ సదరు పౌడర్‌లో నీళ్లు కలిపేందుకు ప్రయత్నించగా, సరిగా కలవలేదు. దీంతో క్యాన్‌లో చేయిపెట్టి గట్టిగా నొక్కడంతో అది పెద్ద శబ్ధంతో పేలి మంటలు లేచాయి. అవి పక్కనే ఉన్న రసాయనాలకూ అంటు కున్నాయి. గది తలుపులు, కిటికీలు మూసి ఉంచడంతో పేలుడు తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ ప్రమాదంలో పెంటం నాగార్జునకుమార్, మల్లు రామకృష్ణారెడ్డి అక్కడిక్కడే మృతిచెందారు. రసాయనం కలిపిన శ్రీనివాస్ చేతులు తెగిపోయాయి. కాళ్లు ఇతర భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఇద్దరి శరీరాలు మాంసం ముద్దలుగా మారాయి. పేలుడు ధాటికి గదిలోని కిటికీలు, తలుపులు దూరంగా ఎగిరిపడగా ఒక పక్క గోడ పూర్తిగా బద్దలైంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేవారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ కుమార్‌ను హైదారాబాద్‌కు తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ శివకుమార్, కరీంనగర్ డీఎస్పీ రామారావు పరిశీలించారు. -
గుర్తింపు కార్డు చూపితేనే యాసిడ్ అమ్మకం
హైదరాబాద్: తెలంగాణలో యాసిడ్, రసాయన పదార్థాల నిల్వలు, అమ్మకాలను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ముసాయిదా నిబంధనలను రూపొందించింది. ఫొటో, గుర్తింపు కార్డు, ఫోన్ నెంబర్ వంటి వివరాలు సేకరించిన తర్వాతే వాటిని విక్రయించాలని స్పష్టంచేసింది. మార్కెట్లో యాసిడ్, కెమికల్స్ ఇష్టానుసారంగా విక్రయిస్తుండటంతో దాడులు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ మార్గదర్శకాలను రూపొందించింది. వీటిపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లో వైద్యశాఖ ముఖ్యకార్యదర్శికి తెలియజేయాలని పేర్కొంది. -
ఆయాసం వస్తే... వేడి వేడి టీ తాగాలి!
డాక్టర్ సలహా నా వయసు 75 ఏళ్లు. ఉబ్బసంతో బాధపడుతున్నాను. చలికాలం తీవ్రమవుతోంది. అలర్జిక్ కోల్డ్ చాలా బాధపెడుతోంది. ఈ మధ్య తలదిమ్ముగా, భారంగా ఉంటోంది. బి.పి, డయాబెటిస్, అజీర్తి వంటి ఇబ్బందులేమీ లేవు. - ఎస్. ఈశ్వరయ్య, కంకిపాడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీకు ఉబ్బసరోగం (ఆస్త్మా) ఉంది. దీన్నే ఆయుర్వేదంలో ‘తమకశ్వాస’ అంటారు. శరీరానికి సరిపడని అసాత్మ్య (ఎలర్జిక్) పదార్థాల వల్ల ఈ వ్యాధి లక్షణాలు జనిస్తాయి. ఇది కొందరిలో వారసత్వంగా రావచ్చు. మానసిక ఒత్తిడి కూడా ఒక కారణమే. చల్లటి మేఘాలు, వాతావరణంలో అధిక తేమ, దుమ్ము, ధూళి, కొన్ని రసాయనిక పదార్థాలు మొదలైనవి కూడా కొంతమందికి అసాత్మ్యంగా ఉంటాయి. ఆయాసం ఉన్న సమయంలో విశ్రాంతి తీసుకోవాలి. శ్రమకు గురికాకూడదు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. వేడి వేడి ‘టీ’ తాగితే మంచిది. శీతల పానీయాలకు, ఫ్రిజ్‌లో ఉంచిన పదార్థాలకు దూరంగా ఉండాలి. మందులు: శ్వాసకుఠార రస (మాత్రలు) ఉదయం ఒకటి- రాత్రి ఒకటి కనకాసవ (ద్రావకం) మూడు చెంచాలకు సమానంగా గోరు వెచ్చని నీళ్లు కలిపి (ఇది ఒక మోతాదు) రోజుకు మూడుసార్లు (ఉదయం, మధ్యాహ్నం, రాత్రి) తీసుకోవాలి. ఆయాసం తగ్గిపోయిన తర్వాత వాడాల్సిన మందులు: శృంగారాభ్రరస (మాత్రలు) ఉదయం ఒకటి- రాత్రి ఒకటి అగస్త్య హరీతకి రసాయనం (లేహ్యం) ఉదయం ఒక చెంచా- రాత్రి ఒక చెంచా చప్పరించి పాలు తాగాలి. వీటిని ఎంత కాలమైనా వాడవచ్చు. ఈ మందుల వల్ల ఊపిరి తిత్తులకు, శ్వాస కోశ అవయవాలకు బలం కలిగి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి ఉబ్బసం అతి తరచుగా రావడం అనే సమస్య తగ్గిపోతుంది. ఒకవేళ ఉబ్బసం వచ్చినా దాని తీవ్రత స్వల్పంగా ఉంటుంది. కొంతకాలానికి అసాత్మ్యత (ఎలర్జీ)కు గురికావడం తగ్గి క్షమత్వం పెరుగుతుంది. ఆయాసం లేనప్పుడు రెండు పూటలా పది నిమిషాల పాటు ప్రాణాయామం చేస్తే మంచిది. గృహవైద్యం: ఒక చెంచా ఆవనూనెలో ఒక చెంచా తేనె కలిపి తాగితే ఆయాసానికి వెంటనే ఉపశమనం లభిస్తుంది. దగ్గు, కఫం తగ్గడానికి... ఒక చెంచా తులసిరసంలో ఒక చెంచా తేనె కలిపి మూడు పూటలా సేవిస్తే మూడురోజుల్లో బాధ తగ్గిపోతుంది. - డాక్టర్ విఎల్‌ఎన్ శాస్త్రి, ఆయుర్వేద వైద్య నిపుణులు