
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య జరిగిన పోరులో సోమవారం బుల్స్ ధాటికి బేర్స్ తలవంచాయి. ఆరంభంలోనే 1026 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్ మెటల్, ఐటీ, ఇంధన షేర్లు రాణించడంతో 389 పాయింట్లు లాభంతో 56,247 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 136 పాయింట్లు పెరిగి 16,800 పాయింట్ల చేరువలో 16,794 వద్ద ముగిసింది. సూచీలకిది రెండో రోజూ లాభాల ముగింపు. ఆర్థిక, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకవైపు భీకర యుద్ధం జరుగుతున్నా.., మరోవైపు బెలారస్ సరిహద్దు ఫ్యాపిట్ వేదికగా రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. కీలకమైన ఈ చర్చలతో యుద్ధ ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టొచ్చనే ఆశలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలను నెలకొల్పాయి.
ఆసియా మార్కెట్లు ఆరంభ నష్టాలను పూడ్చుకోగలిగాయి. సింగపూర్, హాంగ్‌కాంగ్ మినహా అన్ని దేశాల మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. లాభాల్లో ప్రారంభమైన యూరప్ సూచీలు మన మార్కెట్ ముగిసిన తర్వాత అనూహ్యంగా నష్టాలబాటపట్టాయి. దేశీ ఇన్వెస్టర్లు రూ.3,948 కోట్ల షేర్లను అమ్మేశారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.4,143 కోట్ల షేర్లను కొన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు దాదాపు ఐదుశాతం పెరగడంతో ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ రెండు పైసలు స్వల్పంగా క్షీణించి ఫ్లాట్‌గా 75.33 వద్ద స్థిరపడింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం(నేడు) స్టాక్, ఫారెక్స్, డెట్, కమోడిటీ మార్కెట్లకు సెలవు. బుధవారం మార్కెట్లు మళ్లీ యథాతథంగా పనిచేస్తాయి.
భారీ నష్టాల్లోంచి లాభాల్లోకి...
ఉక్రెయిన్– రష్యా యుద్ధ భయాల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్ ఉదయం భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 530 పాయింట్లు పతనమైన 55,329 వద్ద, నిఫ్టీ 176 పాయింట్లు క్షీణతతో 16,482 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి గంటలో భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకదశలో సెన్సెక్స్ 1026 పాయింట్లను కోల్పోయి 54,834 వద్ద, నిఫ్టీ 300 పాయింట్లు క్షీణించి 16,356 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. రష్యా–ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగుతాయన్న వార్తలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు తెరతీశారు. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం ఇన్వెస్టర్లకు మరింత ఉత్సాహాన్నించింది. ట్రేడింగ్ ముగిసే వరకు స్థిరమైన కొనుగోళ్లు జరగడంతో సూచీలు నష్టాలను పూడ్చుకోవడమే కాకుండా రెండోరోజూ లాభాలతో ముగిశాయి.
సూచీల రికవరీకి మెటల్ షేర్ల దన్ను
మెటల్ షేర్లు రాణించి సూచీల రికవరీలో ప్రధాన పాత్ర పోషించాయి. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో రష్యా మెటల్ ఎగుమతులు తగ్గొచ్చనే అంచనాలతో దేశీయ మెటల్ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. హిందాల్కో ఏడు శాతం, జిందాల్ స్టీల్ అండ్ పవర్, టాటా స్టీల్ 6%, జేఎస్‌డబ్ల్యూ ఐదుశాతం రాణించాయి. నాల్కో, వేదాంత, హిందూస్తాన్ కాపర్ షేర్లు 4–3% లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో అన్నిరంగాల సూచీల్లోకెల్లా మెటల్ ఇండెక్స్ ఐదుశాతం ర్యాలీ చేసింది.
ఆరు నెలల కనిష్టానికి ఇన్వెస్టర్ల సంపద
ఫిబ్రవరిలో బీఎస్‌ఈ సెన్సెక్స్ సూచీ 1,767 పాయింట్లు నష్టపోవడంతో ఇన్వెస్టర్ల రూ.26.41 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. తద్వారా ఫిబ్రవరి చివరిరోజు(28 తేదీ)నాటికి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ ఆరునెలల కనిష్ట స్థాయి రూ.252 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. గతేడాది(2021) ఇదే ఫిబ్రవరి ముగింపు నాటితో నమోదైన రూ.200 లక్షల కోట్లతో పోలిస్తే ఇన్వెస్టర్ల సంపద 25.68 శాతం వృద్ధి చెందింది.
మార్కెట్లో మరిన్ని సంగతులు
► రిలయన్స్ ఇండస్ట్రీస్ 200 స్టోర్స్‌ను టేకోవర్ చేసుకోవడంతో ఫ్యూచర్ గ్రూప్ షేర్లు రాణించాయి. ఫ్యూచర్ కన్జూమర్, ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజస్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్ షేర్లు ఎనిమిది శాతం నుంచి 16% లాభపడ్డాయి.
► డిసెంబర్ క్వార్టక్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో రైన్ ఇండస్ట్రీస్ షేరు ఎనిమిది శాతం క్షీణించి రూ.185 వద్ద ముగిసింది.
► పలు బ్రోకరేజ్ సంస్థలు రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో రిలయన్స్ షేరు మూడు శాతం బలపడి రూ.2359 వద్ద స్థిరపడింది.
(చదవండి: మారుతి సుజుకి వినియోగదారులకు శుభవార్త..!)