‘అత్తారింటికి దారేది’లో పరిస్థితే వస్తే.. ఈ కారే చూసుకుంటుంది

New Technology Under Development to Respond to Health Scare Of Driver - Sakshi

సూపర్‌హిట్‌ మూవీ అత్తారింటికి దారేది సినిమాలో రావు రమేశ్‌ కారులో ఎ​యిర్‌పోర్టుకి వెళ్తుంటే దారి మధ్యలో అకస్మాత్తుగా గుండెపోటు వస్తుంది. సాయం చేసేందుకు పక్కన ఎవరూ ఉండరు. సమయానికి హీరో రావడంతో ఆస్పత్రిలో చేరి ప్రాణాలు దక్కించుకుంటాడు. నిజ జీవితంలో ఇదే పరిస్థితి ఎదురయితే వెంటనే అలెర్టయ్యి పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించే టెక్నాలజీతో ఓ కారు తయారవుతోంది.

కెమెరాల సాయంతో
జపాన్‌కి చెందిన ఆటో మేకర్‌ కంపెనీ మజ్దాకి ఇండియాతో అనుబంధం ఉంది. స్వరాజ్‌ కంపెనీతో కలిసి గతంలో ఈ సంస్థ పలు వాహనాలను ఇండియన్‌ మార్కెట్లోకి తెచ్చింది. తాజాగా ఎమర్జెన్సీ సమయంలో స్పందించే విధంగా సరికొత్త కారుని తయారు చేస్తోంది. కారులో అమర్చే ప్రత్యేకమైన కెమెరా సెన్సార్లు కారు చుట్టు పక్కలతో పాటు డ్రైవింగ్‌ సీటులో ఉన్న వ్యక్తిని గమనిస్తుంటాయి. డ్రైవింగ్‌ సీటులో ఉన్న వ్యక్తి నిద్రలోకి జారుకుంటే వెంటనే అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు కారు నడిపే వ్యక్తికి అనారోగ్య సమస్యలు ఎదురైనా, ప్రమాదాలు సంభవించినా వెంటనే అలెర్టయి పోతుంది. కారు వేగాన్ని తగ్గించి సురక్షితంగా రోడ్డు పక్కన ఆగేలా ఆటో పైలెట్‌ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. తద్వారా రోడ్డు యాక్సిడెంట్లను అరికట్టగలుగుతుంది. దీంతోపాటు డ్రైవర్‌ ఆరోగ్య పరిస్థితులను అనుసరించి అంబులెన్స్‌, హస్పిటల్‌తో పాటు కుటుంబ సభ్యులకు ఎమర్జెన్సీ మెజేస్‌ పంపిస్తుంది.

2025 కల్లా సిద్ధం
కెమెరాల ద్వారా మనిషి ఆరోగ్య పరిస్థితులను అంచనా వేసి అందుకు తగ్గట్టుగా స్పందిపంచే టెక్నాలజీపై మజ్ధా సంస్థ కొంత కాలంగా పని చేస్తోంది. అందులో భాగంగా సుకుబా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో పాటు ఇతర మెడికల్‌ ఎక్స్‌పర్ట్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ నిపుణులతో కలిసి టెక్నాలజీ డెవలప్‌ చేసింది. రియల్‌టైంలో మరికొన్ని సార్లు పరీక్షలు నిర్వహిస్తామని, ఏమైనా లోపాలు ఎదురైతే సవరించి 2025 కల్లా ఈ కొత్త టెక్నాలజీ కారును మార్కెట్లోకి తెస్తామంటూ మజ్దా ఘంటాపథంగా చెబుతోంది.

ఎంట్రీ లెవల్‌కి
కోటి రూపాయలు ఆపై ధర ఉన్న హైఎండ్‌ కార్లలో డ్రైవర్‌ను అలెర్ట్‌ చేసే ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ వ్యవస్థను  కొన్ని కార్ల కంపెనీలు ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఇందులో ఖర్చు అధికంగా ఉండే లేజర్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. లేజర్‌ సాయం లేకుండా కేవలం కారులో అమర్చిన కెమెరాల ద్వారానే అలెర్ట్‌ సిస్టమ్‌ రూపొందించడమే టార్గెట్‌గా మజ​​‍్దా ముందుకు కదులుతోంది. ఈ టెక్నాలజీ కనుక అందుబాటులోకి వస్తే ఎంట్రీ, మిడ్‌ రేంజ్‌ కార్లలో కూడా భద్రతా ప్రమాణాలు మెరుగవుతాయని మజ​‍్దా హామీ ఇస్తోంది.  

ఇది సాధ్యమేనా
ఓనర్‌కి ఏదైనా సమస్య వస్తే వెంటనే ఎస్‌ఓఎస్‌ మెసేజ్‌లు పంపి రక్షించే టెక్నాలజీ యాపిల్‌ సంస్థ ఇటీవల పరిచయం చేసింది. జాగింగ్‌ వెళ్తూ గుండెపోటుకు గురైన వ్యక్తికి కేవలం యాపిల్‌ వాచ్‌ పంపిన మెసేజ్‌ కారణంగా సత్వరమే వైద్య సాయం అందింది. అతని ప్రాణాలు దక్కాయి. మజ్దా టెక్నాలజీ కనుక అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top