బ్రిటన్ వెళ్లాలనుకునే విద్యార్థులకు కొత్త రూల్స్ - రిషి సునాక్ సంచలన ట్వీట్..

New Plan For UK Visa Says Rishi Sunak - Sakshi

స్వదేశీయులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి.. ఇమ్మిగ్రేషన్‌ను తగ్గించడానికి బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలను ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బ్రిటన్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్‌ను తగ్గించడానికి "రాడికల్ యాక్షన్" ప్రకటించింది. ఇందులో భాగంగానే నైపుణ్యం కలిగిన విదేశీయుడు యూకేలో పనిచేయడానికి వీసా కావాలనుకుంటే.. కనీస వేతనాన్ని కూడా భారీగా పెంచింది. 2022లో ప్రభుత్వం జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ విసాల సంఖ్య 745000. ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యధికంగా కావడం గమనార్హం.

పెరిగిన ఇమ్మిగ్రేషన్ విసాల సంఖ్యను మూడు లక్షల కంటే తక్కువకు తీసుకురావాలనుకునే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆ దేశ హోమ్ మినిష్టర్ 'జేమ్స్ క్లెవెర్లీ' (James Cleverly) తెలిపారు. అంతే కాకుండా కొత్త రాకపోకలను తగ్గిస్తానని ప్రతిజ్ఞ చేసిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై ఒత్తిడి పెరగటం కూడా ఇందుకు ఒక కారణం అని తెలుస్తోంది.

ఇమ్మిగ్రేషన్ చాలా ఎక్కువగా ఉందని గణాంకాలు వెల్లడించాయి, దానిని తగ్గించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు, ఇవన్నీ యూకే ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఉంటాయని.. రిషి సునాక్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇదీ చదవండి: ఆర్‌బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్

విదేశీ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను బ్రిటన్‌కు తీసుకుని రావడంపై కూడా నిషేధం ఉంది. అయితే రీసెర్చ్ డిగ్రీలు చేసే పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇందులో నుంచి మినహాయింపు ఉంటుంది.  విదేశీ ఉద్యోగుల జీతం కూడా 38,000 పౌండ్‌లకు (రూ.40,01,932) పెంచింది.

గతంలో యూరోపియన్ యూనియన్ దేశాల వారు ఎక్కువగా బ్రిటన్ దేశానికీ వలసలు వచ్చేవారు. అయితే ఈ మధ్యకాలంలో ఇండియా, నైజీరియా, చైనా నుంచి బ్రిటన్ వెళ్లేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని సమాచారం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top