వజ్రాల మెరుపు వెనుక అసలు కథ | Natural vs LabGrown Diamonds Market Trends Consumer Choices Future Outlook | Sakshi
Sakshi News home page

వజ్రాల మెరుపు వెనుక అసలు కథ

Apr 9 2026 12:58 PM | Updated on Apr 9 2026 1:05 PM

Natural vs LabGrown Diamonds Market Trends Consumer Choices Future Outlook

వజ్రాల వ్యాపారులు, వినియోగదారులు నిన్న(ఏప్రిల్ 8, 2026) తొలి ‘ప్రపంచ వజ్రాల దినోత్సవం’ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నేచురల్ డైమండ్ కౌన్సిల్ (ఎన్‌డీసీ) పిలుపు మేరకు జరిగిన ఈ వేడుకల్లో చాలా అంశాలు చర్చకు వచ్చాయి. అయితే, ప్రస్తుతం మార్కెట్‌లో సహజ వజ్రాలకు ధీటుగా ‘ల్యాబ్‌గ్రోన్‌ డైమండ్లు’ విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? వీటి భవిష్యత్తు వినియోగం ఎలా ఉండబోతోంది? అనే అంశాలను విశ్లేషిద్దాం.

సహజ వజ్రం.. ల్యాబ్‌గ్రోన్‌ డైమండ్ మధ్య తేడా..

చాలామంది ల్యాబ్‌గ్రోన్ డైమండ్లను నకిలీ వజ్రాలు అనుకుంటారు, కానీ అది తప్పు. ఇవి భౌతికంగా, రసాయనికంగా, ఆప్టికల్‌గా దాదాపు సహజ వజ్రాల మన్నికనే పోలి ఉంటాయి. సహజ వజ్రాలు భూమి అంతర్భాగంలో అధిక ఉష్ణోగ్రత, పీడనం వల్ల ఏర్పడతాయి. ల్యాబ్‌గ్రోన్ డైమండ్లు ప్రయోగశాలల్లో కేవలం కొన్ని వారాల్లోనే తయారవుతాయి. సహజ వజ్రాలతో పోలిస్తే ల్యాబ్‌గ్రోన్ వజ్రాలు 60% నుంచి 80% వరకు తక్కువ ధరకే లభిస్తాయి. వీటిని భూమిని తవ్వి ప్రాసెసింగ్‌ చేయాల్సిన అవసరం లేనందున ‘ఎకో-ఫ్రెండ్లీ’ డైమండ్లుగా పిలుస్తారు.

కృత్రిమంగా ఎలా తయారు చేస్తారు?

ల్యాబ్‌లో వజ్రాలను సృష్టించడానికి ప్రధానంగా రెండు పద్ధతులు ఉన్నాయి.

  • హెచ్‌పీహెచ్‌టీ(హై ప్రెషర్‌ హై టెంపరేచర్‌): భూమి పొరల్లో ఉండే సహజ వాతావరణాన్ని (అధిక పీడనం, ఉష్ణోగ్రత) యంత్రాల ద్వారా సృష్టించి కార్బనైజేషన్‌ ద్వారా వజ్రాన్ని అభివృద్ధి చేస్తారు.

  • సీవీడీ (కెమికల్‌ వేపర్‌ డెపొజిషన్‌): ఒక ఛాంబర్‌లో కార్బన్ వాయువులను నింపి ప్లాస్మా సాంకేతికతతో కార్బన్ పరమాణువులను పొరలు పొరలుగా పేరుకుపోయేలా చేస్తారు. ప్రస్తుతం అత్యుత్తమ నాణ్యత గల వజ్రాల కోసం భారత్‌లో ఈ పద్ధతినే ఎక్కువగా వాడుతున్నారు.

వినియోగదారులు తేడాను ఎలా గుర్తించాలి?

సాధారణంగా సహజ వజ్రానికి, ల్యాబ్‌గ్రోన్ వజ్రానికి మధ్య తేడాను కనిపెట్టడం అసాధ్యం. అనుభవజ్ఞులైన వ్యాపారులు కూడా వీటిని కొన్నిసార్లు గుర్తుపట్టలేరు. కాబట్టి వినియోగదారులు వజ్రాలు కొనేముందు కొన్ని అంశాలు గమనించాలి. వజ్రాభరణాలు కొనేటప్పుడు జీఐఏ(జెమొలాజికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అమెరికా) లేదా ఐజీఐ వంటి సంస్థల ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా అడగాలి. అందులో అది ‘నేచురల్‌’ లేదా ‘లేబొరేటరీ గ్రోన్‌’ అని స్పష్టంగా ఉంటుంది. ల్యాబ్ వజ్రాల గర్డిల్ (అంచు)పై మైక్రోస్కోపిక్ లేజర్ మార్కింగ్ ఉంటుంది.

ఈ విభాగంలో ఉపాధి అవకాశాలు

వజ్రాల తయారీ రంగంలో భారత్‌లోని సూరత్ గ్లోబల్ హబ్‌గా మారింది. దాంతో స్థానికంగా సీవీడీ మిషన్ల నిర్వహణకు ఇంజినీర్లు, ల్యాబ్ టెక్నీషియన్ల అవసరం పెరుగుతోంది. వజ్రాలను సానబెట్టే (పాలిషింగ్‌) నైపుణ్యం ఉన్నవారికి దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. తక్కువ ధర వల్ల మధ్యతరగతి ప్రజలు కూడా వజ్రాల వైపు మొగ్గు చూపుతుండటంతో సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో వేలాది ఉద్యోగాలు లభిస్తున్నాయి.

భవిష్యత్తు ఎటువైపు?

సహజ వజ్రాలు పెట్టుబడిగా, వారసత్వ సంపదగా వాటి విలువను కాపాడుకుంటున్నాయి. కొన్ని పెళ్లిళ్లు, భావోద్వేగ సందర్భాల కోసం వీటిని వాడుతున్నారు. ల్యాబ్‌గ్రోన్ డైమండ్లు ఫ్యాషన్ జ్యువెలరీ, రోజువారీ వాడకానికి ఇవి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. వీటి పర్యావరణ హితం, తక్కువ ధర కారణంగా యువత, జెన్‌జీ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

ఇదీ చదవండి: 40 శాతం రాయితీపై రష్యా ఎల్‌ఎన్‌జీ?

Advertisement
 
Advertisement
Advertisement