ముకేశ్‌ అంబానీ రిలయన్స్‌ పగ్గాలు చేపట్టి 20 ఏళ్లు.. ఆదాయం, లాభాలు ఎన్ని రెట్లు పెరిగాయో తెలుసా?

Mukesh Ambani completes 20 years at helm of Reliance - Sakshi

న్యూఢిల్లీ: తండ్రి ధీరుభాయ్‌ అంబానీ ఆకస్మిక మరణంతో వ్యాపార సామ్రాజ్యం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) పగ్గాలను ఆయన కుమారుడు ముకేశ్‌ అంబానీ (65) చేపట్టి రెండు దశాబ్దాలయ్యింది. ఈ ఇరవై ఏళ్లలో రిలయన్స్‌ను ముకేశ్‌ వృద్ధి బాటలో పరుగులు పెట్టించారు. టెలికమ్యూనికేషన్స్, రిటైల్, కొత్త ఇంధనం తదితర విభాగాల్లోకి సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆయన సారథ్యంలో రిలయన్స్‌ ఆదాయం 17 రెట్లు, లాభాలు 20 రెట్లు ఎగిశాయి. కంపెనీ అంతర్జాతీయ దిగ్గజాల్లో ఒకటిగా ఆవిర్భవించింది.

2002లో ధీరుభాయ్‌ మరణం అనంతరం ముకేశ్, ఆయన చిన్న సోదరుడు అనిల్‌ అంబానీ.. రిలయన్స్‌ పగ్గాలు చేపట్టారు. ముకేశ్‌ సీఎండీగాను, అనిల్‌ వైస్‌ చైర్మన్, జాయింట్‌ ఎండీగాను బాధ్యతలు స్వీకరించారు. అయితే, సోదరులిద్దరి మధ్య ఆధిపత్య పోరు తలెత్తడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రెండుగా చీలింది. విభజనతో ముకేశ్‌ వంతుకు గ్యాస్, ఆయిల్, పెట్రోకెమికల్స్‌ విభాగాలు రాగా అనిల్‌ చేతికి టెలికం, విద్యుదుత్పత్తి, ఆర్థిక సేవల విభాగాలు వచ్చాయి. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయ డ్రాపౌట్‌ అయిన ముకేశ్‌ సారథ్యంలో రిలయన్స్‌ మహా సామ్రాజ్యంగా ఎదిగింది. ఆ వివరాలు.. 

2002 మార్చిలో రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ. 41,989 కోట్లు కాగా 20% వార్షిక వృద్ధితో 2022 మార్చికల్లా రూ. 17,81,841 కోట్లకు చేరింది.  
ఆదాయాలు రూ. 45,411 కోట్ల నుంచి రూ. 7,92,756 కోట్లకు, లాభాలు రూ. 3,280 కోట్ల నుంచి రూ. 67,845 కోట్లకు ఎగిశాయి. 
ఎగుమతులు రూ. 11,200 కోట్ల నుంచి రూ. 2,54,970 కోట్లకు చేరాయి.  
మొత్తం అసెట్స్‌ వార్షిక ప్రాతిపదికన 19 శాతం వృద్ధితో రూ.48,987 కోట్ల నుంచి రూ. 14,99,665 కోట్లకు ఎగిశాయి. నికర విలువ 2002లో రూ. 27,977 కోట్లుగా ఉండగా.. 2022 మార్చి నాటికి రూ. 6,45,127 కోట్లకు పెరిగింది.  
రెండు దశాబ్దాల్లో ఇన్వెస్టర్ల సంపదకు ఏటా సగటున రూ. 87,000 కోట్లు చొప్పున, రిలయన్స్‌ రూ. 17.4 లక్షల కోట్లు జత చేసింది. 
మోతీలాల్‌ ఓస్వాల్‌ 26వ వార్షిక సంపద సృష్టి అధ్యయనం ప్రకారం 2016–21 మధ్యలో రూ. 10 లక్షల కోట్ల సంపద సృష్టితో రిలయన్స్‌ టాప్‌లో నిల్చింది. తన గత రికార్డును తానే తిరగరాసింది. 
ఈ క్రమంలో 2007లో ముకేశ్‌ అంబానీ దేశీయంగా తొలి ట్రిలియనీర్‌గా (రూపాయి మారకంలో లక్ష కోట్ల అధిపతి) ఎదిగారు.  

విస్తరణ.. 
రెండు దశాబ్దాల్లో రిలయన్స్‌ పలు కొత్త వ్యాపారాల్లోకి విస్తరించింది. 2006లో రిటైల్‌లోకి, 2021లో న్యూ ఎనర్జీ విభాగంలోకి ప్రవేశించింది. 2016లో జియో ద్వారా టెలికంలో సంచలనం సృష్టించింది. రిలయన్స్‌కు 2002లో జామ్‌నగర్‌లో ఒక్క ఆయిల్‌ రిఫైనరీ ఉండేది. అది ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్‌ లొకేషన్‌ రిఫైనింగ్‌ కాంప్లెక్స్‌గా ఎదిగింది. ఈ వ్యవధిలో రిలయన్స్‌ చమురు శుద్ధి సామర్థ్యాలను రెట్టింపు చేసుకుంది. 2009లో చమురు, గ్యాస్‌ ఉత్పత్తి ప్రారంభించింది. అటు పైన బ్రిటిష్‌ పెట్రోలియం దిగ్గజం బీపీని భాగస్వామిగా చేసుకుని పెట్రోల్‌ రిటైల్‌ అవుట్‌లెట్స్‌ నడిపిస్తోంది. పర్యావరణ అనుకూల ఇంధనాలపై దృష్టి పెట్టిన రిలయన్స్‌ వచ్చే మూడేళ్లలో కొత్త ఇంధన వ్యాపారంపై రూ.75,000 కోట్లు వెచ్చించనుంది.

నిధుల సమీకరణ... 
2021 ఆర్థిక సంవత్సరంలో రైట్స్‌ ఇష్యూ వంటి మార్గాల్లో రిలయన్స్‌ రికార్డు స్థాయిలో రూ. 2.5 లక్షల కోట్లు సమీకరించింది. జియో ప్లాట్‌ఫామ్స్‌.. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌లో మైనారిటీ వాటాలు విక్రయించింది. ఫేస్‌బుక్, గూగుల్‌ వంటి అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాలు ఇన్వెస్ట్‌ చేశాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top