ఏపీలో 1,200 కోట్లతో ఎంఎస్‌ఏఎఫ్‌ ప్లాంటు

MSAF to set up new Ultron modern steel plant in Andhra Pradesh - Sakshi

1,800 మందికి కొత్తగా ఉద్యోగాలు

కంపెనీ డైరెక్టర్‌ గౌతమ్‌ గనెరివాల్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్టీల్‌ తయారీలో ఉన్న ఎంఎస్‌ అగర్వాల్‌ ఫౌండ్రీస్‌ (ఎంఎస్‌ఏఎఫ్‌) కొత్తగా అత్యాధునిక స్టీల్‌ ప్లాంటును నెలకొల్పుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద 4 లక్షల మెట్రిక్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది ఏర్పాటవుతోంది. ఇందుకోసం సంస్థ రూ.1,200 కోట్లు పెట్టుబడి చేస్తోంది. తద్వారా 1,800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్లాంటు సిద్ధమవుతుందని కంపెనీ డైరెక్టర్‌ గౌతమ్‌ గనెరివాల్‌ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఇప్పటికే సంస్థకు తెలంగాణ, ఏపీలో మూడు ప్లాంట్లు ఉన్నాయి. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.50 లక్షల మెట్రిక్‌ టన్నులు. వీటి సా మర్థ్యం 2021లో 2.5 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరనుంది. ప్రస్తుతం సంస్థలో 8,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. గ్రూప్‌ టర్నోవర్‌ రూ.2,100 కోట్లు.

కంపెనీ నుంచి కొత్త ఉత్పాదన..
ఎంఎస్‌ఏఎఫ్‌ కొత్తగా ఎంఎస్‌ లైఫ్‌ 600 ప్లస్‌ పేరుతో భూకంపాలను తట్టుకునే టీఎంటీ బార్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. సొంతంగా తామే దీనిని అభివృద్ధి చేశామని, ఇటువంటి ఉత్పాదన దేశంలో తొలిసారి అని కంపెనీ డైరెక్టర్‌ అనురాగ్‌ అగర్వాల్‌ తెలిపారు. హైదరాబాద్‌ సమీపంలోని తూప్రాన్‌ వద్ద ఉన్న ప్లాంటులో తయారు చేస్తున్నట్టు చెప్పారు. ఎంఎస్‌ లైఫ్‌ 600, ఏఎఫ్‌ స్టార్‌ 500–డి పేరుతో స్టీల్‌ ఉత్పత్తులను దక్షిణాదిన 750 చానెల్‌ పార్ట్‌నర్స్‌ ద్వారా కంపెనీ విక్రయిస్తోంది. గంగవరం, కృష్ణపట్నం పోర్టు, హైదరాబాద్, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలు, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు స్టీల్‌ను సరఫరా చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top