సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో భారత్ వృద్ధి అంచనాలకు మూడీస్ కోత విధించింది. గతంలో 6.8 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందన్న అంచనాలను 6 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. పశ్చిమాసియా యద్ధ సంక్షోభంతోపాటు.. ఇప్పటి వరకు నియంత్రణలో ఉన్న ద్రవ్యోల్బణం పెరిగిపోయే రిస్క్‌తో వృద్ధి మోస్తరు స్థాయికి పరిమితం అవుతుందని పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఎల్‌పీజీ రవాణాకు ఆటంకాలు మరింత కాలం పాటు గృహాలకు సరఫరా కొరతకు దారితీస్తుందని.. అధిక ఇంధన రవాణా ఖర్చులు ఆహార ద్రవ్యోల్బణానికి కారణమవుతాయని హెచ్చరించింది. భారత్ చమురు, గ్యాస్ సరఫరాకు హర్మూజ్ జలసంధి కీలకంగా ఉండడం తెలిసిందే. 2026–27లో ద్రవ్యోల్బణం 4.8 శాతం స్థాయిలో ఉండొచ్చని, 2025–26లో ఉన్న సగటు 2.4 శాతంతో పోల్చితే రెట్టింపు అవుతుందని మూడిస్ పేర్కొంది.
వృద్ధికి అవరోధాలు, ద్రవ్యోల్బణం రిస్క్‌ల నేపథ్యంలో పాలసీ రేట్లు స్థిరంగా లేదంటే క్రమంగా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఎంత కాలం పాటు పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతుంది? ఇంధనం, ఆహారంపై దాని ప్రభావంపైనే ఇది ఆధారపడి ఉంటుందని తెలిపింది. పెరిగిపోయిన చమురు, ఎరువుల ధరలు లకి‡్ష్యత సబ్సిడీలు మరింత పెరిగేలా చేస్తాయని.. దీంతోపాటు ఆదాయం కూడా తగ్గిపోతుందని పేర్కొంది. వినియోగదారులపై ప్రభావం పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం తెలిసిందే.
స్థిరంగానే ఎగుమతులు
వస్తు, సేవల ఎగుమతులు స్థిరంగానే ఉంటాయని మూడిస్ అంచనా వేసింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు, ఎరువుల సరఫరాకు మార్గాలు గుర్తిస్తున్నందున దిగుమతుల వ్యయాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఆర్థిక సహకార, అభివృద్ది సమాఖ్య (ఓఈసీడీ) సైతం భారత్ జీడీపీ 2026–27లో 6.1 శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేయగా, ఈవై ఒక శాతం వరకు వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం. దేశీ రేటింగ్ సంస్థ ఇక్రా 2026–27లో జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.


