మారుతి పాపులర్ చిన్న కారు నిలిపివేత! | Maruti Suzuki Ignis Discontinued In India To Be Replaced By New Micro SUV | Sakshi
Sakshi News home page

మారుతి పాపులర్ చిన్న కారు నిలిపివేత!

Apr 16 2026 3:28 PM | Updated on Apr 16 2026 3:47 PM

Maruti Suzuki Ignis Discontinued In India To Be Replaced By New Micro SUV

భారతీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి తన పాపులర్ టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్ 'ఇగ్నిస్' (Ignis) ఉత్పత్తిని నిశ్శబ్దంగా నిలిపివేసింది. మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. దాదాపు నెల రోజుల క్రితమే దీని ఉత్పత్తి నిలిచిపోయినట్లు డీలర్ వర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం డీలర్లు ఈ కారు కోసం కొత్త బుకింగ్‌లను తీసుకోవడం నిలిపివేసినప్పటికీ, అధికారిక నెక్సా (NEXA) వెబ్‌సైట్‌లో మాత్రం ఈ మోడల్ ఇంకా లిస్టింగ్‌లో కనిపిస్తోంది.

2017లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఇగ్నిస్, తన విభిన్నమైన డిజైన్, డ్రైవింగ్ డైనమిక్స్‌తో యువతను ఆకట్టుకుంది. 2020లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ద్వారా మరిన్ని అప్‌డేట్లను పొందిన ఈ కారు, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 83bhp శక్తిని, 113Nm టార్క్‌ను అందించేది. ఫీచర్ల పరంగా 7-అంగుళాల స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, క్లైమేట్ కంట్రోల్, ఎయిర్‌క్రాఫ్ట్ స్టైల్ స్విచ్‌లు దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. భద్రత కోసం ఏబీఎస్‌, ఈబీడీ, ఐసోఫిక్స్ మౌంట్‌ల వంటి ప్రామాణిక ఫీచర్లతో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉండేది.

పంచ్‌కు పోటీ వస్తోందా?
ఇగ్నిస్ నిష్క్రమణతో మారుతి సుజుకి తన దృష్టిని ఇప్పుడు సరికొత్త మైక్రో ఎస్‌యూవీ వైపు మళ్లించింది. ప్రస్తుతం 'Y43' అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చెందుతున్న ఈ కొత్త కారు, ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది నేరుగా టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి బలమైన మోడళ్లతో పోటీ పడనుందని చెబుతుతున్నారు. ఇగ్నిస్ స్థానాన్ని భర్తీ చేయనున్న ఈ కొత్త ఎస్‌యూవీ, మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలో బ్రెజ్జా కంటే దిగువన ఉండి, నెక్సా ప్రీమియం డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించే అవకాశం ఉంది.

రాబోయే Y43 మోడల్ 1.2 లీటర్ 'డ్యూయల్ జెట్' పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇగ్నిస్ కేవలం హై-రైడింగ్ హ్యాచ్‌బ్యాక్‌గా మాత్రమే పరిమితమవ్వగా, కొత్త మోడల్ పూర్తిస్థాయి మైక్రో ఎస్‌యూవీ లుక్, ఫీచర్లతో రానుంది. పంచ్ వంటి కార్లు ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో ఉన్న నేపథ్యంలో, మారుతి కూడా తన కొత్త ఉత్పత్తితో గట్టి పోటీ ఇవ్వాలని ప్రణాళికతో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement