ఐపీవోకు మణిపాల్‌ హెల్త్‌ | Manipal Health for IPO | Sakshi
Sakshi News home page

ఐపీవోకు మణిపాల్‌ హెల్త్‌

Mar 26 2026 7:48 PM | Updated on Mar 26 2026 8:00 PM

Manipal Health for IPO

ఆసుపత్రుల దిగ్గజం మణిపాల్‌ హెల్త్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 8,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 4,32,27,668 షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.

పీఈ దిగ్గజం టెమాసెక్‌కు పెట్టుబడులున్న సంస్థ ఈక్విటీ జారీ నిధుల్లో మణిపాల్‌ హాస్పిటల్స్‌కు చెందిన రుణ చెల్లింపులకు రూ. 5,378 కోట్లు వెచ్చించనుంది. అనుబంధ కంపెనీ సహ్యాద్రి హాస్పిటల్స్‌లో మైనారిటీ వాటా కొనుగోలు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు రూ. 574 కోట్లు వినియోగించనుంది.

ఐపీవోకంటే ముందుగా రూ. 1,600 కోట్ల షేర్ల విక్రయ యోచనలో ఉంది. ఇది జరిగితే ఐపీవోలో ఈక్విటీ జారీ పరిమాణాన్ని కుదించనుంది. కార్డియాలజీ, అంకాలజీ, న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్స్, కిడ్నీ మార్పిడి తదితర పలు స్పెషాలిటీలు కలిగిన మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులను దేశవ్యాప్తంగా కంపెనీ నిర్వహిస్తోంది. 2025 సెప్టెంబర్‌కల్లా 38 ఆసుపత్రుల ద్వారా 10,761 పడకలను కలిగి ఉంది. గతేడాది(2024–25)లో ఆదాయం రూ. 8,242 కోట్లను అధిగమించగా.. దాదాపు రూ. 1,082 కోట్ల నికర లాభం ఆర్జించింది.

Advertisement
 
Advertisement
Advertisement