ఐవేర్ రిటైలర్ లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 31న ప్రారంభంకానుంది. నవంబర్ 4న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 2,150 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు మరో 12.75 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. యాంకర్ ఇన్వెస్టర్లకు 30న షేర్లను ఆఫర్ చేయనుంది. ఐపీవో నిధులను పెట్టుబడి వ్యయాలు, దేశీయంగా కంపెనీ నిర్వహణలోని సొంత స్టోర్ల ఏర్పాటు, లీజ్, అద్దెలు, లైసెన్స్ ఒప్పందాల చెల్లింపులు తదితరాలకు వినియోగించనుంది.
వీటితోపాటు.. టెక్నాలజీ, క్లౌడ్ ఇన్‌ఫ్రా, బ్రాండ్ మార్కెటింగ్, ఇతర సంస్థల కొనుగోళ్లకు సైతం మరికొన్ని నిధులను వెచి్చంచనుంది. కాగా.. గత వారం డీమార్ట్ స్టోర్ల అధినేత రాధాకృష్ణన్ దమానీ ప్రీఐపీవో రౌండ్‌లో భాగంగా కంపెనీలో రూ. 90 కోట్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2008లో ఏర్పాటైన కంపెనీ ఫ్యాషనబుల్, ప్రిస్క్రిప్షన్ కళ్లద్దాలు, సన్‌గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్‌లను రూపొందించి విక్రయిస్తోంది. ఆన్‌లైన్ అమ్మకాలుసహా ఫిజికల్ స్టోర్లనూ నిర్వహిస్తోంది.
లెన్స్కార్ట్ వ్యవస్థాపకుడు, సీఈఓ 'షార్క్ ట్యాంక్ ఇండియా' ఫేమ్ పీయూష్ బన్సాల్, ఆఫర్ ఫర్ సేల్ (OFS)లో భాగంగా 2.05 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా రూ .824 కోట్లు అందుకోనున్నారు. అక్టోబర్ 31 న ప్రారంభమయ్యే ఐపీఓ తరువాత, బన్సాల్ కంపెనీలో 8.78% వాటాను కలిగి ఉంటారు. ఆయన సోదరి, కంపెనీ సహ వ్యవస్థాపకురాలు నేహా బన్సాల్ కూడా రూ .40.62 కోట్ల చెల్లింపునకు సుమారు 10.1 లక్షల షేర్లను విడుదల చేస్తున్నారు. వీరితో పాటు ఇతర ప్రమోటర్లు అమిత్ చౌదరి, సుమీత్ కపాహి ఐపీఓలో చొప్పున 28.7 లక్షల షేర్లను విక్రయిస్తున్నారు. వీరిద్దరూ కంపెనీలో 0.8 శాతం వాటాను కలిగి ఉన్నారు.


