భారతీయ పని సంస్కృతిపై చర్చ!
ఆఫీసు పని అయిపోయింది.. గడియారం ఆరు దాటింది.. కానీ సీటులోంచి లేవాలంటే ఏదో తెలియని భయం. ‘అప్పుడే వెళ్లిపోతున్నావా?’ అని బాస్ అడుగుతాడేమో అన్న సందేహం. రోజంతా కష్టపడి పని చేసినా, ఉదయం ఆఫీస్‌కు త్వరగా వచ్చినా.. సమయానికి ఇంటికి బయలుదేరితే ‘హాఫ్ డేనా?’ అంటూ సెటైర్లు. ఇదీ సగటు భారతీయ ఉద్యోగి నిత్యం ఎదుర్కొనే మానసిక ఒత్తిడి. సరిగ్గా ఇదే అంశంపై ‘24 నార్త్ స్టార్’ వ్యవస్థాపకురాలు నిస్తా త్రిపాఠి చేసిన లింక్డ్ఇన్ పోస్ట్ ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారితీసింది.
యూరప్‌లో.. భారత్‌లో..
నిస్తా త్రిపాఠి తన పోస్ట్‌లో భారత్, యూరప్ దేశాల పని సంస్కృతి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపారు. ఆమె విశ్లేషణ ప్రకారం..
యూరోపియన్ స్టైల్: యూరప్ దేశాల్లోని ఆఫీస్ ఉద్యోగులు సాయంత్రం 5 గంటలకే ఎటువంటి సంకోచం లేకుండా ‘రేపు కలుద్దాం’ అని సిస్టమ్స్ లాగ్ ఆఫ్ చేస్తారు. గడువులోగా పనులు పూర్తి చేయడంలో వారు ఏమాత్రం వెనుకబడరు. కానీ పని గంటల తర్వాత వ్యక్తిగత జీవితానికి ప్రాముఖ్యత ఇస్తారు.
భారతీయ విధానం: ఇక్కడ ఉద్యోగి ఎంత సామర్థ్యంతో పని చేశాడనే దానికంటే, ఎన్ని గంటలు ఆఫీసులో కూర్చున్నారనే దాన్ని బట్టే వారి అంకితభావాన్ని కొలుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పెరుగుతున్న అసహనం
భారతీయ బహుళజాతి కంపెనీల్లో (ఎంఎన్‌సీ) పనిచేసే వారు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య టైమ్ జోన్. అమెరికా, యూరప్ క్లయింట్ల కోసం భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు కూడా మీటింగ్‌లకు హాజరుకావాల్సి వస్తోంది. దీనివల్ల ఉద్యోగుల వ్యక్తిగత సమయం హరించుకుపోతోందని, 24/7 అందుబాటులో ఉండటం వల్ల ఉత్పాదకత పెరగకపోగా ఉద్యోగుల్లో అసహనం పెరుగుతోందని త్రిపాఠి పేర్కొన్నారు. ‘కంపెనీలు తమ సమయాన్ని, శక్తిని కాపాడుకునే వ్యక్తులను గౌరవించడం నేర్చుకోవాలి’ అని చెప్పారు.
ఏం చేయాలంటే..
కొత్త తరం ఉద్యోగులు ఇప్పుడు స్మార్ట్ వర్క్ వైపు మొగ్గు చూపుతున్నారు. సంస్థలు తమ పని సంస్కృతిని మార్చుకోకపోతే మేధో వలసలు పెరిగే ప్రమాదం ఉందని ఈ చర్చ హెచ్చరిస్తోంది. ఒక ఉద్యోగి సంతోషంగా ఇంటికి వెళ్లినప్పుడే, మరుసటి రోజు రెట్టింపు ఉత్సాహంతో పని చేయగలడని కార్పొరేట్ దిగ్గజాలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.
ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి!


