
కనిపించని ప్రాజెక్ట్ పురోగతి సమాచారం
దీంతో గృహ కొనుగోలుదారులలో ఆందోళన
గృహ కొనుగోలుదారులకు భద్రత, భరోసా కల్పించాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ–రెరా) గందరగోళంగా మారింది. కస్టమర్లకు తమ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలకమైన సమాచారం ‘లాస్ట్ అప్డేట్ కాలమ్’ను టీజీ–రెరా వెబ్‌సైట్ నుంచి తొలగించింది. దీంతో ప్రాజెక్ట్ పురోగతి సమాచారం తెలియక, గృహ కొనుగోలుదారులలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు టీజీ–రెరాలో 9,990 ప్రాజెక్ట్‌లు, 4,436 మంది ఏజెంట్లు నమోదయ్యారు. 2,266 ఫిర్యాదులు అందగా.. 1,302 కేసులను పరిష్కరించారు. -సాక్షి, సిటీబ్యూరో
రెరా చట్టంలోని సెక్షన్–11 ప్రకారం మూడు నెలలకు (త్రైమాసికం) ఒకసారి తమ ప్రాజెక్ట్ పురోగతి, విక్రయాలు, ఖాళీలు తదితర వివరాలను టీజీ–రెరా వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. దీంతో బిల్డర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన త్రైమాసిక సమాచారాన్ని బహిర్గతం చేస్తున్నారో లేదో కస్టమర్లు సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. బిల్డర్ ఒక ప్రాజెక్ట్ వివరాలను చివరగా ఎప్పుడు అప్డేట్ చేశారో లేదా అప్‌లోడ్ చేశారో ఈ కాలమ్ చూపిస్తుంది. ‘‘గతంలో టీజీ–రెరా వెబ్‌సైట్‌లో నా ప్రాజెక్ట్‌ను తనిఖీ చేస్తున్నప్పుడు, బిల్డర్ క్రమంతప్పకుండా అప్డేట్ చేస్తున్నాడో తెలుసుకోవడం సులభంగా ఉండేది. కానీ, ఇప్పుడు తేదీ లేకుండా, అది ఎప్పుడు అప్డేట్ చేశారో తెలియడం లేదు. ప్రస్తుతం ఉన్న వివరాలు తాజావా లేక పాతవా అనే సమాచారం తెలియడం లేదని’’ ఓ గృహ కొనుగోలుదారుడు వాపోయారు.
బహుళ పత్రాలను పరిశీలించాల్సిందే..
టీజీ–రెరా వెబ్‌సైట్ నుంచి ‘లాస్ట్ అప్డేట్ కాలమ్’ను తొలగించడం వల్ల టీజీ–రెరా నియమాలు, 2017 రూల్–16 ప్రకారం ప్రతి త్రైమాసికంలో డెవలపర్లు ప్రాజెక్ట్ వివరాలను అప్టేట్ చేస్తున్నారో లేదో ట్రాక్ చేయడం కష్టతరమైందని ఓ న్యాయవాది అన్నారు. గతంలో లాస్ట్ అప్టేడ్ కాలమ్‌తో ప్రాజెక్ట్ పురోగతి సమాచారం సులభంగా తెలుసుకునే వీలుండేది, కానీ, ఇప్పుడు బహుళ పత్రాలను పరిశీలిస్తే గానీ సమాచారంపై స్పష్టత రావడం లేదు. ఈ కాలమ్‌ను తొలగించడంతో డెవలపర్లలో కూడా ‘లాస్ట్ అప్డేట్’ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. దీంతో రెరా ఉద్ధేశించిన పారదర్శకత లోపించడంతో పాటు అమలు సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. అయితే ఈ విషయమైన ఓ టీజీ–రెరా అధికారిని సంప్రదించగా.. వైబ్‌సైట్‌లో పలు సాంకేతిక మార్పులలో భాగంగా తాత్కాలిక కాలం పాటు ఈ కాలమ్‌ను తొలగించామని, పునరుద్ధరణ తర్వాత తిరిగి ఈ ఫీచర్ తిరిగి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.