హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నుంచి జెఫ్రీస్‌ నిష్క్రమణ | Jefferies Exits HDFC Bank Leadership Shake Up Cuts Key Portfolio Exposure | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నుంచి జెఫ్రీస్‌ నిష్క్రమణ

Mar 28 2026 7:28 AM | Updated on Mar 28 2026 12:41 PM

Jefferies Exits HDFC Bank Leadership Shake Up Cuts Key Portfolio Exposure

ఛైర్మన్‌ అతాను చక్రవర్తి రాజీనామా నేపథ్యం

కొన్ని పోర్ట్‌ఫోలియోల్లో భారత్‌ వెయిటేజీ తగ్గింపు

ప్రైవేట్‌ రంగం బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ జెఫ్రీస్‌ నిష్క్రమించింది. బ్యాంకులో తమ పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పార్ట్‌టైమ్‌ చైర్మన్, స్వతంత్ర డైరెక్టర్‌ అతాను చక్రవర్తి ఇటీవలే అకస్మాత్తుగా రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ మూడు కీలక పోర్ట్‌ఫోలియోల్లో బ్యాంక్‌ షేర్లను విక్రయించి, ఎక్స్‌పోజర్‌ని తగ్గించుకున్నట్లు తాజా గ్రీడ్‌ అండ్‌ ఫియర్‌ నివేదికలో జెఫ్రీస్‌ వ్యూహకర్త క్రిస్‌ ఉడ్స్‌ తెలిపారు.

జపాన్‌ మినహా ఏషియా లాంగ్‌–ఓన్లీ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో, గ్లోబల్‌ లాంగ్‌–ఓన్లీ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో, అమెరికా మినహా ఇంటర్నేషనల్‌ లాంగ్‌–ఓన్లీ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో వీటిలో ఉన్నాయి. అయితే, ఈ నిర్ణయం వెనుక కారణాన్ని ఉడ్స్‌ తెలపలేదు. అన్ని పోర్ట్‌ఫోలియోల్లోనూ 4 శాతం వెయిటేజ్‌తో హెచ్‌ఎస్‌బీసీని చేర్చింది. 

జపాన్‌ మినహా ఏషియా పసిఫిక్‌ రిలేటివ్‌–రిటర్న్‌ పోర్ట్‌ఫోలియోలో భారత్, ఆ్రస్టేలియా వెయిటేజీని రెండు పర్సంటేజీ పాయింట్లు తగ్గించి తైవాన్‌ వెయిటేజీని నాలుగు పర్సంటేజీ పాయింట్ల మేర పెంచనున్నట్లు నివేదిక తెలిపింది. తన నైతిక ప్రమాణాలకు, వ్యక్తిగత విలువలకు భంగం కలిగేలా బ్యాంకులో గత రెండేళ్లుగా పరిణామాలు చోటు చేసుకున్నాయంటూ అతాను చక్రవర్తి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: బ్యాంకింగ్ వ్యవస్థకు ముప్పుగా అంతర్గత లోపాలు

Advertisement
 
Advertisement
Advertisement