5 ఏళ్లు.. 3 రెట్లు.. రూ.లక్ష కోట్లు!

Investments into Andhra Pradesh triples in last 5 years - Sakshi

వైఎస్‌ జగన్ పాలనలో వచ్చిన వాస్తవ పెట్టుబడులు రూ. లక్ష కోట్లు

బాబు హయాంలో వచ్చినవి రూ. 33 వేల కోట్లే

స్పష్టం చేస్తున్న ఐఈఎం ఫైలింగ్స్‌ డేటా

ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్లలో ప్రధాన పారిశ్రామిక గమ్యస్థానంగా మారింది. ఇంతకు ముందటి ఐదేళ్లు అంటే గత ప్రభుత్వంలో కంటే మూడు రెట్లు ఎక్కువ పెట్టుబడులను  ప్రస్తుత ప్రభుత్వం ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక ప్రగతిని కేంద్ర పరిశ్రమల శాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. 

2014 నుంచి 2018 వరకు ఐదు సంవత్సరాలలో నమోదైన ఎండస్ట్రియల్‌ ఎంట్రప్రిన్యూర్‌ మెమోరాండమ్స్ (IEM) పార్ట్ B ఫైలింగ్‌ల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రూ. 32,803 కోట్ల వాస్తవ పెట్టుబడులను పొందింది. ఐఈఎంల పార్ట్ A ఫైలింగ్‌లు అనేవి పెట్టుబడి ఉద్దేశాలను సూచిస్తుండగా, పార్ట్ B ఫైలింగ్‌లు వాస్తవ పెట్టుబడికి సంబంధించినవి.

ప్రముఖ బిజినెస్‌ పత్రిక ‘బిజ్‌ బజ్‌’ కథనం ప్రకారం.. నాలుగున్నరేళ్లలో 2019 నుంచి 2023 జూన్ వరకు రాష్ట్రానికి రూ. 100,103 కోట్ల వాస్తవ పారిశ్రామిక పెట్టుబడులు వచ్చాయి. ఇది 2014-18 కాలంలో వచ్చిన దానికంటే 226.9 శాతం ఎక్కువ అని అధికారిక వర్గాలు బిజ్ బజ్‌కి తెలిపాయి. ఈ నాలుగున్నరేళ్లలో కోవిడ్ మహమ్మారి, లాక్‌డౌన్‌లు, ఇతర అడ్డంకులు ఎన్ని ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్‌ పురోగతి సాధించింది. 

2022లో ఊపు
వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోని ఐదేళ్లలో వచ్చిన పెట్టుబడుల కంటే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2019లోనే రాష్ట్రానికి 73 ప్రాజెక్టుల్లో రూ. 34,696 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. అయితే ఆ తర్వాత సంవత్సరంలో కోవిడ్‌ మహమ్మారి వ్యాపించడంతో  ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశమంతా ప్రభావం చూపించింది. దీంతో ఆ 2020లో 42 ప్రాజెక్టుల్లో కేవలం రూ.9,840 కోట్లు మాత్రమే వచ్చాయి. 2021లో పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. 47 ప్రాజెక్టులకు రూ.10,350 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక 2022లో పెట్టుబడులు ఊపందుకున్నాయి. 46 ప్రాజెక్టుల్లో ఏకంగా రూ.45,217 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అలాగే 2023 మొదటి ఆరు నెలల్లో 26 ప్రాజెక్ట్‌లకు రూ.7,135 కోట్లు పెట్టుబడులు వచ్చాయి.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ నిర్వహించిన బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్, వివిధ సూచికలపై మొత్తం 98.3 శాతం స్కోర్‌తో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.

2019-2023 లో వాస్తవ పెట్టుబడులు ఇలా..

సంవత్సరం  ప్రాజెక్ట్‌లు పెట్టుబడుల విలువ (రూ.కోట్లలో)
2019   73 34696
2020 42 9840
2021 47 10350
2022 46 45217
2023 (జూన్‌ నాటికి) 26  7135
మొత్తం 100103

2014-2018లో ఇలా..

సంవత్సరం ప్రాజెక్ట్‌లు పెట్టుబడుల విలువ (రూ.కోట్లలో)
2014  19 2804
2015 51 4542
2016 76 11395
2017  62  4509
2018  72  9553
మొత్తం 32803

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top