ఇన్వర్టర్ ఏసీ vs నాన్ ఇన్వర్టర్ ఏసీ | Inverter Vs Non Inverter AC, Which One Should You Choose To Buy For This Summer, Watch Video For Full Details Inside | Sakshi
Sakshi News home page

ఇన్వర్టర్ ఏసీ vs నాన్ ఇన్వర్టర్ ఏసీ

Apr 4 2026 5:13 PM | Updated on Apr 4 2026 5:52 PM

Inverter vs Non Inverter AC Which One Should You Choose This Summer

నెమ్మదిగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవి తాపం ఇప్పుడిప్పుడే మొదలవుతుండటంతో ప్రతిఒక్కరూ ఏసీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మార్కెట్లోకి వెళ్లగానే వినియోగదారులకు తలెత్తే ప్రధాన ప్రశ్న.. 'ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా? లేక నాన్-ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా..?' అని. తక్కువ ధరలో వస్తుందని కొందరు, విద్యుత్ ఆదా అవుతుందని మరికొందరు రకరకాలుగా ఆలోచిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ రెండింటి మధ్య ఉన్న కీలక తేడాలు, లాభనష్టాలపై ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఇన్వర్టర్ ఏసీ
ఇన్వర్టర్ ఏసీ అనేది అత్యాధునిక సాంకేతికతతో పనిచేస్తుంది. గది ఉష్ణోగ్రతను బట్టి ఇందులోని కంప్రెసర్ తన వేగాన్ని వాటంతట అదే సర్దుబాటు చేసుకుంటుంది. గది చల్లబడగానే కంప్రెసర్ పూర్తిగా ఆగిపోకుండా నెమ్మదిగా తిరుగుతూ ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచు తుంది.

నాన్-ఇన్వర్టర్ ఏసీ
నాన్-ఇన్వర్టర్ ఏసీ అనేది పాత పద్ధతిలో పనిచేస్తుంది. కంప్రెసర్ అయితే పూర్తిగా ఆన్‌లో ఉంటుంది లేదా పూర్తిగా ఆఫ్‌లో ఉంటుంది. గది చల్లబడగానే కంప్రెసర్ ఆగిపోవడం, మళ్లీ వేడి పెరగగానే వెంటనే స్టార్ట్ కావడం దీని ప్రత్యేకత. ఏసీ అనగానే సామాన్యుడికి గుర్తొచ్చేది కరెంట్ బిల్లు. ఇన్వర్టర్ ఏసీలో కంప్రెసర్ పదే పదే ఆన్, ఆఫ్ కానక్కర్లేదు కాబట్టి విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఇది జేబుకు ఉపశమనాన్ని ఇస్తుంది.

అదే నాన్-ఇన్వర్టర్ ఏసీ విషయానికొస్తే.. కంప్రెసర్ ప్రతిసారీ పూర్తి సామర్థ్యంతో స్టార్ట్ కావాల్సి రావడంతో కరెంట్ బిల్లు భారమయ్యే అవకాశం ఉంది. గదిలో ఒకే రకమైన చల్లదనం ఉండాలని కోరుకునే వారికి ఇన్వర్టర్ ఏసీ సరైన ఎంపిక. ఇది ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు లేకుండా చూస్తుంది. నాన్-ఇన్వర్టర్ ఏసీలో కంప్రెసర్ ఆగిపోయిన ప్రతిసారీ గదిలో ఉష్ణోగ్రత స్వల్పంగా పెరగడం, మళ్లీ తగ్గడం వంటి మార్పులు గమనించవచ్చు.

జీవితకాలం పరంగా రెండూ మెరుగైనవే అయినప్పటికీ, నిర్వహణలో తేడాలున్నాయి. ముఖ్యంగా ఇన్వర్టర్ ఏసీ.. విషయంలో పీసీబీ వంటి సున్నితమైన ఎలక్ట్రానిక్ విడిభాగాలు ఉంటాయి. ఒకవేళ ఇవి పాడైతే మరమ్మతు ఖర్చు కాస్త ఎక్కువేగానే ఉంటుంది. నాన్-ఇన్వర్టర్ ఏసీ.. దీని టెక్నాలజీ చాలా సరళంగా ఉంటుంది. విడిభాగాలు ఎక్కడైనా సులభంగా దొరుకుతాయి. మెకానిక్ ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. రోజుకు 8 గంటల కంటే ఎక్కువ సమయం ఏసీ వాడాల్సి వస్తే.. కచ్చితంగా ఇన్వర్టర్ ఏసీ వైపు వెళ్లడమే తెలివైన పని అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తక్కువ సమయం, అప్పుడప్పుడు మాత్రమే వాడే వారైతే నాన్-ఇన్వర్టర్ ఏసీని ఎంచుకోవచ్చని వారు సూచిస్తున్నారు. - పసుపులేటి. వెంకటేశ్వరరావు.

Advertisement
 
Advertisement
Advertisement