బీమా రంగంలోకి వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించడమనేది పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆరోగ్య బీమా రంగ దిగ్గజం స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ఎండీ ఆనంద్ రాయ్ తెలిపారు. దీనితో మరిన్ని పెట్టుబడులు, మెరుగైన సాంకేతికత అందుబాటులోకి వస్తాయని, ఇన్సూరెన్స్ రంగ విస్తృతి మరింత పెరుగుతుందని మంగళవారమిక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.24,000 కోట్ల మేర స్థూల రిటెన్ ప్రీమియం (జీడబ్ల్యూపీ) సాధించాలని నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. గతేడాది ఇది సుమారు రూ.20,400 కోట్లుగా ఉండగా, 2028 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.30,000 కోట్ల స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాయ్ వివరించారు. చిన్న పట్టణాల్లో మరింతగా విస్తరించడం ద్వారా దీన్ని సాధించనున్నట్లు చెప్పారు. బీమాను ప్రజలకు మరింత చేరువలోకి తెచ్చే దిశగా చిన్న పట్టణాల్లోని వారి కోసం తక్కువ ప్రీమియంలతో ఈ ఆర్థిక సంవత్సరం కొత్త పథకాలను ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో 15 శాతం వాటా లక్ష్యం
సంస్థ వ్యాపారంలో రెండు తెలుగు రాష్ట్రాల వాటా దాదాపు 10 శాతంగా ఉన్నట్లు రాయ్ చెప్పారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో దీన్ని 12–15 శాతానికి పెంచుకోనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,254 కోట్లు విలువ చేసే 1.8 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించామని, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 24 శాతం అధికమని రాయ్ వివరించారు. జాతీయ స్థాయిలో 30.6 లక్షల క్లెయిమ్‌లకు సంబంధించి రూ. 11,903 కోట్లు సెటిల్ చేసినట్లు చెప్పారు. టెక్నాలజీపై ఏటా రూ. 200–250 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. బీమా ప్రీమియంలు గరిష్ట సింగిల్ డిజిట్ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.


