
దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇంటర్నల్ అసెస్‌మెంట్ పరీక్షలో ఫెయిలైన 240 మంది ట్రెయినీలను తొలగించింది. తాజాగా కొలువుల నుంచి తొలగించిన వారితోపాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో లేఆఫ్స్ ప్రకటించిన వారికి ఉచితంగా నైపుణ్యాలు అభివృద్ధి చేసుకునేందుకు ప్రత్యేక ప్రోగ్రామ్‌లతో మద్దతుగా నిలుస్తున్నట్లు చెప్పింది. లేఆఫ్స్‌తో గాయం చేసి ఉచిత స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌తో దానికి పూత పూసినట్లయింది. ఏప్రిల్ 18న ఇన్ఫోసిస్ లేఆఫ్స్‌కు సంబంధించి ట్రెయినీలకు ఈమెయిల్ పంపించింది. ‘జెనెరిక్ ఫౌండేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్’లో అర్హత సాధించని వారిని తొలగిస్తున్నట్లు అందులో పేర్కొంది. అదనపు ప్రిపరేషన్ సమయం, సందేహాల నివృత్తి సెషన్లు, అనేక మాక్ అసెస్‌మెంట్లు ఉన్నప్పటికీ ఈ ప్రోగ్రామ్‌లో అర్హత ప్రమాణాలను చేరుకోలేదనే సాకుతో ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించింది.
తొలగించిన ఉద్యోగులకు మద్దతుగా..
ఎన్ఐఐటీ, అప్‌గ్రాడ్ సంస్థల భాగస్వామ్యం ద్వారా కొలువు కోల్పోయిన ట్రయినీలకు ఉచితంగా నైపుణ్యాలు పెంచుకునేలా అవకాశాలను అందిస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరిలో లేఆఫ్స్ ప్రకటించిన వారికి కూడా ఈ కార్యక్రమాన్ని వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది. శిక్షణార్థులకు బీపీఎం పరిశ్రమలో ఉద్యోగాల సాధన కోసం లేదా ఐటీ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ ప్రోగ్రామ్‌లు ఎంతో తోడ్పడుతాయని ఈమెయిల్‌లో తెలిపింది.
‘మీరు ఇన్ఫోసిస్‌లో కాకుండా బయట ఉద్యోగ అవకాశాలను చూస్తుంటే మీకు సాయం చేసేందుకు ప్రొఫెషనల్ అవుట్ ప్లేస్‌మెంట్ సేవలను ప్లాన్ చేశాం. బీపీఎం పరిశ్రమలో మీరు ఉద్యోగాలు సాధించేలా తోడ్పాటు అందించాలని అనుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్‌లో అందుబాటులో ఉన్న ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఐటీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకుంటే అందుకు మద్దతుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫండమెంటల్స్‌పై ఇన్ఫోసిస్ స్పాన్సర్డ్ ఎక్స్‌టర్నల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ఎంచుకునే అవకాశం కూడా ఉంది’ అని ఈమెయిల్‌తో తెలిపింది. టెక్ కంపెనీల ఆదాయాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇది తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించడానికి ఒక కారణంగా నిలుస్తుంది. కంపెనీల ఆదాయాలు తగ్గుతుండడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి
ట్రంప్ సుంకాలు ప్రధానంగా భారత టెక్ కంపెనీలకు అవాంతరంగా తోస్తున్నాయి. ఎందుకంటే భారత్‌లోని టెక్నాలజీ సర్వీసులను యూఎస్‌లోకి ఎగుమతి చేస్తున్నాయి. ఈ క్రమంలో యూఎస్ దిగుమతులపై ట్రంప్ సుంకాలు విధిస్తుండడంతో ఈ రంగం కుదేలవుతుందని భావిస్తున్నారు. దాంతోపాటు ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిని ఎదుర్కొంటోంది. భారత ఐటీ సేవలకు కీలక మార్కెట్ అయిన అమెరికా ద్రవ్యోల్బణం, విధాన మార్పులతో సతమతమవుతుండటంతో ఔట్ సోర్సింగ్ టెక్ సేవలపై ఖర్చు తగ్గింది.
బలహీనమైన ఆదాయ అంచనాలు
ప్రధాన ఐటీ కంపెనీలు ఊహించిన దానికంటే బలహీనమైన రాబడులను నమోదు చేస్తున్నాయి. ఉదాహరణకు, విప్రో భవిష్యత్తులో రెవెన్యూ క్షీణిస్తుందని ముందుగానే అంచనా వేసింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ కూడా వృద్ధిని కొనసాగించడానికి కష్టపడుతున్నాయి.
ఐటీ సేవలకు తగ్గుతున్న డిమాండ్
చాలా కంపెనీలు తమ బడ్జెట్లను కఠినతరం చేస్తున్నాయి. దాంతో అవసరమైన ఐటీ సేవల కోసం వ్యయాలు(డిసిక్రీషినరీ స్పెండింగ్) తగ్గాయి. కంపెనీలు కొత్త టెక్నాలజీ పెట్టుబడుల కంటే వ్యయ తగ్గింపు చర్యలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇది ఐటీ సర్వీస్ ప్రొవైడర్లకు కాంట్రాక్టులు తగ్గేందుకు దారితీస్తోంది.
ఇదీ చదవండి: పది రోజుల్లో కొత్త టోలింగ్ వ్యవస్థ..?
భౌగోళిక, వాణిజ్య సవాళ్లు
ముఖ్యంగా అమెరికాలో కొత్త వాణిజ్య విధానాలు, టారిఫ్ నిబంధనలు ఐటీ కంపెనీల కష్టాలను మరింత పెంచాయి. ఈ మార్పులు నిర్వహణ వ్యయాలను అధికం చేస్తున్నాయి. భవిష్యత్తు ఒప్పందాలపై అనిశ్చితి సృష్టించాయి.