
డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ తాజాగా 54 పైసలు పతనమైంది. దాంతో 85.94 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 85.53 వద్ద ప్రారంభమైంది. తదుపరి 85.51–86.03 మధ్య ఆటుపోట్లను చవిచూసింది. ప్రపంచ కరెన్సీలతో డాలరు బలపడటం, యూఎస్ టారిఫ్‌ల గడువు దగ్గరపడటం తదితర అంశాలు రూపాయిని దెబ్బతీసినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి.
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆయా దేశాలపై 10% అదనపు డ్యూటీలను విధించనున్నట్లు ప్రకటించడం సైతం రూపాయిపై ప్రభావం చూపినట్లు తెలియజేశారు. కాగా, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.25 శాతం పుంజుకుని 97.41కు చేరింది. రూపాయి విలువ ఎలాంటి సందర్భాల్లో ఎలా ఉంటుందో నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: ‘పాస్‌వర్డ్ సరైందే! ఎందుకు లాగిన్ అవ్వట్లేదు’
టారిఫ్‌లు వేయడం రూపాయికి ప్రతికూలంగా మారుతుంది. ఎగుమతులు తగ్గిపోతాయి.
కొత్తగా ఇతర దేశాలతో చేసుకునే కాంట్రాక్ట్‌లు రూపాయి విలువకు ఊతం ఇస్తాయి.
భారత్ వంటి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు వాటి ధరలు పెరగడం నెగిటివ్‌గా ఉంటుంది.
ఆర్‌బీఐ జోక్యం చేసుకొని రూపాయి విలువను స్థిరీకరిస్తుంది.
గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ కూడా రూపాయి విలువను ప్రభావితం చేస్తుంది.
ట్రంప్ టారిఫ్ వైఖరి మళ్లీ కఠినతరంగా మారితే లేదా భారత్ విస్తృత వాణిజ్య ఉద్రిక్తతల్లోకి వెళితే రూపాయి మరింత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు.