
దిగుమతి సంబంధిత పన్ను ఎగవేతపై భారత ప్రభుత్వం పన్నులు, జరిమానాల రూపంలో శామ్‌సంగ్‌కు 601 మిలియన్ డాలర్ల(రూ.5,149 కోట్లు) డిమాంట్ నోటీసులు జారీ చేసింది. కొన్నేళ్లుగా కీలక టెలికాం పరికరాలను తప్పుగా వర్గీకరిస్తూ ఈ కంపెనీ ఉద్దేశపూర్వకంగా భారీ సుంకాలను తప్పించుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తప్పుడు వర్గీకరణ.. టారిఫ్ ఎగవేత
2018-2021 మధ్య కాలంలో 4జీ మొబైల్ టవర్లలో ఉపయోగించే కీలక భాగాలైన ‘రిమోట్ రేడియో హెడ్స్’ (ఆర్ఆర్‌హెచ్)లను శామ్‌సంగ్ దిగుమతి చేసుకోవడంపై ఈ వివాదం కేంద్రీకృతమైంది. భారత్‌లో 10% నుంచి 20% దిగుమతి సుంకాలు చెల్లించకుండా ఉండటానికి కంపెనీ ఈ వస్తువులను తప్పుగా వర్గీకరించింది. ఫలితంగా దక్షిణ కొరియా, వియత్నాం నుంచి 784 మిలియన్ డాలర్ల(సుమారు రూ.6,717 కోట్లు) విలువైన దిగుమతులపై ఎటువంటి సుంకాలు చెల్లించలేదని భారత కస్టమ్స్ అధికారులు ఆరోపిస్తున్నారు. 2021లో జరిగిన దర్యాప్తులో ముంబయి, గురుగ్రామ్‌లోని శామ్‌సంగ్ కార్యాలయాల్లో ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు సోదాలు నిర్వహించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఆ తర్వాత ఈ విడిభాగాలను భారత మొబైల్ నెట్‌వర్క్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సంస్థకు విక్రయించారు.
ఈ దిగుమతులపై సుంకాలు చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగా తప్పుడు పత్రాలను సమర్పించడం ద్వారా భారతీయ చట్టాలను కంపెనీ ఉల్లంఘించినట్లు కస్టమ్స్ కమిషనర్ సోనాల్ బజాజ్ తెలిపారు. సంస్థ లాభాలను పెంచడానికి శామ్‌సంగ్ అన్ని వ్యాపార నైతికత, పరిశ్రమ పద్ధతులను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌హెచ్ ట్రాన్సీవర్ కేటగిరీలో ఉందని ప్రభుత్వం పేర్కొంది. అది దిగుమతి సుంకాలకు లోబడి ఉందని తెలిపింది. అయితే కంపెనీ మాత్రం దాన్ని వ్యతిరేకించింది. ఆర్‌ఆర్‌హెచ్ ట్రాన్సీవర్‌గా పనిచేయదని, అందువల్ల టారిఫ్ మినహాయింపులకు అర్హత లభిస్తుందని కంపెనీ వాదిస్తోంది.
ఇదీ చదవండి: మెసేజ్ స్క్రోల్ చేస్తే జాబ్ పోయింది!
ఈ సమస్య పరిష్కరించేందుకు గతంలో నలుగురు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరి అభిప్రాయాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి. దాంతో కస్టమ్స్ అధికారులు శామ్‌సంగ్ వాదనను తోసిపుచ్చి పన్ను డిమాండ్‌ను విధించారు. ఇందులో భాగంగా భారత అధికారులు ఏడుగురు శామ్‌సంగ్ ఇండియా ఎగ్జిక్యూటివ్‌లకు మొత్తం 81 మిలియన్ డాలర్లు (సుమారు రూ .694 కోట్లు) వ్యక్తిగత జరిమానా విధించారు.
ఈ వ్యవహారంపై కంపెనీ స్పందిస్తూ ‘మా హక్కులను పూర్తిగా రక్షించడానికి చట్టపరమైన ఎంపికలపై దృష్టి సారిస్తున్నాం. భారతీయ చట్టాలకు కట్టుబడి ఉన్నాం. కస్టమ్స్ వర్గీకరణల భిన్నమైన వివరణలకు సంబంధించిన అంశంగా ఈ సమస్యను పరిగణిస్తున్నాం’ అని పేర్కొంది.