
జీడీపీ వృద్ధి 6.4–6.7 శాతం
సీఐఐ కొత్త అధ్యక్షుడు రాజీవ్‌మెమానీ
దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.4–6.7 శాతం మేర వృద్ధి చెందుతుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ అనిశి్చతుల రిస్క్ నెలకొన్పప్పటికీ, బలమైన దేశీ డిమండ్ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందని సీఐఐ ప్రెసిడెంట్ రాజీవ్ మెమాని అభిప్రాయపడ్డారు. సీఐఐ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మెమానీ మీడియాతో మాట్లాడారు.
రుతుపవనాలు మెరుగ్గా ఉంటాయన్న అంచనాలు, వ్యవస్థలో నగదు లభ్యత పెంచే దిశగా ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు నిర్ణయాలు ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని చెప్పారు. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ని ఒక శాతం, రెపో రేటును అరశాతం తగ్గిస్తూ ఆర్‌బీఐ జూన్ మొదట్లో నిర్ణయం ప్రకటించడం తెలిసిందే. సీఆర్‌ఆర్ తగ్గించడం వల్ల వ్యవస్థలోకి రూ.2.5 లక్షల కోట్ల నిధుల లభ్యత పెరగనుంది. విదేశీ వాణిజ్యపరమైన రిస్క్‌లున్నాయంటూ.. అవి తటస్థం చెందుతాయని అంచనా వేస్తున్నట్టు మెమానీ చెప్పారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు వృద్ధికి ప్రతికూలంగా మారినా దేశీ డిమాండ్ ఆదుకుంటుందన్నారు.
జీఎస్‌టీ మరింత సరళం..
మూడు సులభతర శ్లాబులతో జీఎస్‌టీని మరింత సులభంగా మార్చాలని మెమానీ కోరారు. నిత్యావసరాలను 5 శాతం రేటు కింద, విలాసవంతమైన, హానికర వస్తువులను 28 శాతం రేటులో, మిగిలిన వస్తువులన్నింటినీ 12–18 శాతం మధ్య ఒక రేటు కిందకు తీసుకురావాలని సూచించారు. 28 శాతం రేటు అమలవుతున్న సిమెంట్ తదితర కొన్నింటిని తక్కువ రేటు కిందకు తీసుకురావాలన్నారు. అలా చేయడం ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు. పెట్రోల్, విద్యుత్, రియల్ ఎస్టేట్, ఆల్కహాల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు దేశవ్యాప్త ఏకాభిప్రాయం అవసరమన్నారు.