జనవరి–మార్చి క్వార్టర్‌లో 3 శాతం క్షీణత
ఆరేళ్లలోనే అతి తక్కువ
కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక
న్యూఢిల్లీ: దేశీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) మందగించింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, క్యూ1లో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు (కంపెనీ నుంచి డీలర్లకు రవాణా) గత ఏడాదితో పోలిస్తే 3 శాతం తగ్గాయి. గత 6 ఏళ్లలో బలహీనమైన పనితీరు ఇది. పెరిగిన తయారీ ఖర్చులు, ముఖ్యంగా మెమొరీ చిప్‌ల ధరలు పెరిగిపోవడం తెలిసిందే. దీంతో వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గడం (ముఖ్యంగా రూ.15,000 లోపు ఫోన్లకు).. మొత్తం మార్కెట్ పనితీరును ప్రభావితం చేసినట్టు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది.
ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు డబుల్ డిజిట్ స్థాయిలో తగ్గొచ్చని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ పేర్కొన్నారు. ‘‘2026 పూర్తి సంవత్సరానికి స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సుమారు 10 శాతం తగ్గొచ్చని అంచనా. ‘‘విడిభాగాల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా మెమొరీ ధరలు గత 9 నెలల్లో 4 రెట్లు పెరిగిపోయాయి. దీంతో వినియోగదారులు ఫోన్లను వెంటనే మార్చకుండా, ఉన్న వాటినే ఎక్కువ కాలం వినియోగిస్తున్నారు’’అని పాఠక్ వివరించారు. పశ్చిమాసియలో సంక్షోభంతో జీవన వ్యయాలు పెరిగాయని, ఈ పరిస్థితుల్లో ప్రజలు స్మార్ట్‌ఫోన్ల వంటి వాటి కంటే ముఖ్యమైన అవసరాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది. కనుక ఈ మార్కెట్ నెమ్మదిగా కోలుకోవచ్చని అభిప్రాయపడింది.
వివో నంబర్ 1
→ దేశీ మార్కెట్లో 21 శాతం వాటాతో వివో మొదటి స్థానంలో నిలిచింది. కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణతో పోర్ట్‌ఫోలియో విస్తరణ ద్వారా తన ఆధిపత్యాన్ని కాపాడుకుంది.
→ శామ్‌సంగ్ రెండో స్థానంలో ఉంది. ముఖ్యంగా ఎ–సిరీస్ మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది.
→ ఒప్పో 14 శాతం వాటాతో మూడో స్థానంలో నిలిచింది. మార్చి త్రైమాసికంలో 8 శాతం వృద్ధిని (2025 క్యూ1తో పోల్చితే) సాధించింది.
→ షావోమీ నాలుగో స్థానంలో ఉంది. రూ.10,000–20,000 ధరల శ్రేణిలో రడబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసింది.
→ ఆన్‌లైన్ మార్కెట్‌లో రూ.10,000–20,000 ధరల విభాగంలో రియల్‌మీ బలమైన బ్రాండ్‌గా నిలిచింది.
→ నథింగ్ 47 శాతం వృద్ధిని నమోదు చేసింది.
→ ప్రీమియం ఫోన్ల సెగ్మెంట్‌లో (రూ.45,000కు పైన) గూగుల్ 39 శాతం వృద్ధిని సాధించింది.
→ అందుబాటు ధరల ఫోన్ల విభాగంలో (రూ.30,000–45,000) ప్రముఖ బ్రాండ్‌గా వన్‌ప్లస్ ముందంజలో ఉంది. నార్డ్ సిరీస్‌కు మంచి స్పందన లభిస్తోంది.


