డిస్కౌంట్లకన్నా సౌకర్యానికే ఓటు | India Quick Commerce Shoppers Value Speed Over Discounts Grant Thornton Report | Sakshi
Sakshi News home page

డిస్కౌంట్లకన్నా సౌకర్యానికే ఓటు

Apr 9 2026 8:09 AM | Updated on Apr 9 2026 8:38 AM

India Quick Commerce Shoppers Value Speed Over Discounts Grant Thornton Report

క్విక్‌ కామర్స్‌పై వినియోగదారుల ధోరణి

గ్రాంట్‌ థార్న్‌టన్‌ భారత్‌ నివేదిక 

దేశీయంగా క్విక్‌ కామర్స్‌ వినియోగదారులు డిస్కౌంట్ల కన్నా సౌకర్యానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. డిస్కౌంట్లు తగ్గించినా సరే సదరు ప్లాట్‌ఫాంలను వినియోగించడాన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారు. దేశీయంగా వినియోగదారుల ధోరణుల్లో వస్తున్న మార్పులను సూచించేలా గ్రాంట్‌ థార్న్‌టన్‌ భారత్‌ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

దేశవ్యాప్తంగా మెట్రోపాలిటన్, ద్వితీయ..తృతీయ శ్రేణి పట్టణాల్లో 1,600 మంది వినియోగదారులు, 1,000కి పైగా కిరాణా స్టోర్స్‌ ఈ అధ్యయనంలో పాల్గొన్నాయి. దీని ప్రకారం రోజువారీ కొనుగోళ్ల విషయంలో ధర కన్నా వేగం, లభ్యతకు ప్రాధాన్యత పెరుగుతోంది. డిస్కౌంట్లను తగ్గించినా కూడా క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫాంలను వినియోగించడాన్ని కొనసాగిస్తామంటూ 70 శాతం మంది తెలిపారు. సంప్రదాయ రిటైల్‌ ఫార్మాట్ల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయడం కాకుండా, నిర్దిష్ట సందర్భాల కోసం మాత్రమే క్విక్‌ కామర్స్‌ని ప్రజలు వినియోగిస్తున్నారు. ఆఖరు నిమిషపు, అర్జంట్‌ ఆర్డర్ల కోసం 45 శాతం మంది వినియోగదారులు వీటిని ఎంచుకుంటున్నారు. ఇక 24 శాతం మంది పాలు, బ్రెడ్‌లాంటి ప్రతి రోజు అవసరమయ్యే వాటి కోసం ఉపయోగిస్తున్నారు. 19 శాతం మంది అప్పటికప్పుడు తినాలని, తాగాలనిపించే స్నాక్స్, పానీయాల్లాంటి కోసం క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫాలంను వినియోగిస్తున్నారు.  

నివేదికలో మరిన్ని విశేషాలు..

  • గత ఏడాది వ్యవధిలో కిరాణా స్టోర్స్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకున్నట్లు 51 శాతం మంది తెలిపారు. అయితే, 27 శాతం మంది ఈ విషయంలో చెప్పుకోతగ్గ మార్పేమీ లేదనగా, 13 శాతం మంది మాత్రం ఇప్పుడు వీటిని మరింతగా ఎంచుకుంటున్నట్లు చెప్పారు.

  • మార్జిన్లపరంగా ఒత్తిడి పెరుగుతుండటం, వినియోగదారుల్లో మారుతున్న ధోరణులకు అనుగుణంగా సంప్రదాయ రిటైలర్లు వ్యాపారాన్ని తీర్చిదిద్దుకునేందుకు సుముఖంగా ఉంటున్నారు.

  • 40 శాతం మంది కిరాణా రిటైలర్లు, క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫాంలతో జట్టు కట్టడంపై ఆసక్తి వ్యక్తం చేశారు.

  • 32 శాతం మంది తమకు ఆసక్తిగా ఉన్నా, ఇలాంటి భాగస్వామ్యాలు ఎలా పని చేస్తాయనేది తెలియడం లేదని పేర్కొన్నారు. తమకు నిర్వహణపరమైన లేదా సాంకేతికపరమైన మద్దతు లభిస్తే తప్పకుండా జట్టు కడతామని 20 శాతం కిరాణా రిటైలర్లు తెలిపారు.  

  • ద్వితీయ శ్రేణి, వర్ధమాన పట్టణ మార్కెట్లు రాబోయే రోజుల్లో రిటైల్‌ రంగ తదుపరి వృద్ధి చోదకాలుగా ఉండనున్నాయి.

ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement