భారత్‌ సొంత ఏఐ ఇన్‌ఫ్రాను నిర్మించుకోవాలి | India Must Build Its Own AI Infrastructure For Strategic Future, Gautam Adani Warns Energy Digital Security | Sakshi
Sakshi News home page

భారత్‌ సొంత ఏఐ ఇన్‌ఫ్రాను నిర్మించుకోవాలి

May 12 2026 8:16 AM | Updated on May 12 2026 10:02 AM

India Must Build Its Own AI Infrastructure Adani Warns Energy Digital Security

రాబోయే దశాబ్దాల్లో ఇంధన భద్రత, డిజిటల్‌ ఇన్‌ఫ్రా కీలకం

అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ వ్యాఖ్యలు

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వ్యవస్థకు సంబంధించి భారత్‌ సొంతంగా మౌలిక సామర్థ్యాలను నెలకొల్పాల్సిన అవసరం ఉందని అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ పిలుపునిచ్చారు. రాబోయే దశాబ్దాల్లో భౌగోళిక రాజకీయ శక్తిగా ఎదగాలంటే ఇంధన భద్రత, డిజిటల్‌ ఇన్‌ఫ్రాలే కీలకమని ఆయన పేర్కొన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన వార్షిక వ్యాపార సదస్సు–2026లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయపరమైన విభజనల నేపథ్యంలో దశాబ్దాల నాటి గ్లోబలైజేషన్‌ భావనలకు కాలం చెల్లుతోందన్నారు.

‘సెమీకండక్టర్లు ఇప్పుడు రాజకీయ అస్త్రాలుగా మారాయి. డేటాను జాతీయ వనరుగా భావిస్తున్నారు. క్లౌడ్‌ ఇన్‌ఫ్రాను ఆయుధంగా మలచుకుంటున్నారు. ఇక ఏఐ సదుపాయాలను డేటా సెంటర్ల రక్షణ గోడల మాటున నిర్మించుకుంటున్నారు’ అని అదానీ పేర్కొన్నారు. ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రిక్తతల సమయంలో డిజిటిల్‌ మౌలిక సదుపాయాలపై దాడుల గురించి ప్రస్తావిస్తూ... ఇంధన భద్రత, డిజిటల్‌ భద్రత అనేవి ఏ దేశానికైనా రెండు మూల స్తంభాలుగా మారాయని అభిప్రాయపడ్డారు.

‘ఇంధన వనరులను నియంత్రించే దేశ పారిశ్రామిక భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అలాగే డిజిటల్‌ కంప్యూటింగ్‌ను కంట్రోల్‌ చేసే దేశ మేధోపరమైన భవిష్యత్తుకు తిరుగుండదు. ఈ రెండింటినీ నియంత్రించే దేశమే రాబోయే శతాబ్దాన్ని తీర్చిదిద్దుతుంది’ అని అదానీ తెలిపారు.

ఏఐని సాఫ్ట్‌వేర్‌గా చూడొద్దు...

భారత్‌ ఏఐని కేవలం ఒక సాఫ్ట్‌వేర్‌గా మాత్రమే కాకుండా... ఎనర్జీ, డేటా సెంటర్లు, చిప్‌లు, నెట్‌వర్క్‌లు, కంప్యూటింగ్, ప్రతిభ వంటి రంగాల వ్యాప్తంగా ఒక వ్యూహాత్మక ఇన్‌ఫ్రాగా పరిగణించాలని అదానీ చెప్పారు. ‘భారత్‌ తన మేధో 
భవిష్యత్తు కోసం ఈ ఏఐ ఇన్‌ఫ్రాను అద్దెకు తీసుకుంటే సరిపోదు. స్వదేశంలోనే సొంతంగా నిర్మించుకోవడంతో పాటు, సామర్థ్యాలను విస్తరించాలి’ అని నొక్కిచెప్పారు. తయారీ, రవాణా, మొబిలిటీ, డిజిటల్‌ సర్వీసుల వ్యాప్తంగా నెలకొన్న భారీ దేశీ డిమాండ్‌ అనేది పెద్దయెత్తున ఏఐ, ఎనర్జీ ఇన్‌ఫ్రా నిర్మాణానికి దోహదం చేస్తోందన్నారు.

భారత్‌లో విద్యుదుత్పత్తి సామర్థ్యం ఇప్పటికే 500 గిగావాట్లను అధిగమించిందని, భవిష్యత్తులో భారత్‌ ఏఐ ఎకానమీ కోసం విద్యుత్, కంప్యూటింగ్‌ ఎకోసిస్టమ్‌లలో భారీ స్థాయి పెట్టుబడులు అవసరమవుతాయని వివరించారు. ఏఐని అవకాశాలను హరించే శక్తిగా కాకుండా ఉత్పాదకతను పెంచేదిగా, ఉద్యోగాలను కల్పించేదిగా, ఎంట్రప్రెన్యూర్లకు చేదోడుగా నిలిచేదిగా, భారతీయులు ప్రపంచవ్యాప్తంగా పోటీపడే సాధనాలుగా రూపొందించాలని అదానీ పేర్కొన్నారు. కాగా, అదానీ గ్రూప్‌ డేటా సెంటర్‌ బిజినెస్‌లో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. భారత్‌లో అతిపెద్ద గిగావాట్‌ స్లాయి డేటా సెంటర్‌ క్యాంపస్‌ను విశాఖలో నిర్మించేందుకు గూగుల్‌తో జట్టుకట్టిన విషయాన్ని కూడా అదానీ గుర్తుచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement